పరిచయం : ఇండియన్​ సూపర్​ హీరో కోసం..

బేజిల్ జోసెఫ్​... ఈ పేరు టాలీవుడ్​కి కొత్త కావొచ్చు. కానీ, మాలీవుడ్​లో అతను యాక్ట్​ చేసినా, డైరెక్ట్​ చేసినా థియేటర్స్​లో విజిల్స్ పడాల్సిందే. మిన్నళ్ మురళి’తో మెరుపు వీరుడిని సృష్టించిన క్రియేటర్​. ‘జయ జయ జయ జయహే’లో నెగెటివ్​ రోల్​లో కామెడీ పండించిన కమెడియన్. అతను స్క్రిప్ట్ సెలక్షన్​ సింపుల్​గా, వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే.. ఫుల్ కామెడీతో ‘ఫ్యాలిమి’ సినిమాతో ఆడియెన్స్​ ముందుకొచ్చాడు. మరి అతని జర్నీ విశేషాలు తన మాటల్లోనే ... 

కేరళలోని వయనాడ్​లో సుల్తాన్ బతేరి మా సొంతూరు. చిన్నప్పుడు డ్రామా, క్వాయర్​, స్పోర్ట్స్ ఇలా అన్ని ప్రోగ్రామ్స్​లో పార్టిసిపేట్ చేసేవాడిని. హైజంప్​ పోటీల్లో కూడా పాల్గొనే వాడిని. టీనేజ్​లో క్రికెటర్​ అవ్వాలనుకున్నా. రోజూ గ్రౌండ్​కి వెళ్లి ఆడేవాడిని. కానీ, అప్పుడు దాన్నంత సీరియస్​గా తీసుకోలేదు. అందరిలానే నేను కూడా ఆ వయసు​లో సచిన్​లా అవ్వాలనుకున్నా అంతే. కల్చరల్ యాక్టివిటీస్​లోనే కాదు.. చదువులో కూడా నేను గుడ్ స్టూడెంట్​.

మా ఊళ్లోనే సెయింట్ జోసెఫ్​ ఇంగ్లిష్​ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివా. తర్వాత వయనాడ్​లో కల్పెట్టా సిటీలో ఇంటర్, త్రివేండ్రంలో బీటెక్​ చేశా. బీటెక్ పూర్తయ్యాక త్రివేండ్రంలోనే ఇన్ఫోసిస్ కంపెనీలో సిస్టమ్​ ఇంజినీర్​గా పనిచేశా. ఇంజినీరింగ్​ చదివేటప్పుడు ఎలిజబెత్​తో పరిచయం అయింది. ఏడేండ్లు ప్రేమలో ఉన్నాం. 2017లో పెండ్లితో ఒకటయ్యాం. మా ఇద్దరికీ తోడుగా ఇప్పుడు మాకో పాప ఉంది. 

ఐటీ జాబ్​ వదిలి..

ఇంజినీరింగ్ ఎంట్రన్స్​ ఎగ్జామ్​లో మంచి స్కోర్​ రావడం వల్ల త్రివేండ్రంలోని ఇంజినీరింగ్​ కాలేజీలో సీట్​ వచ్చింది. ​అక్కడికివెళ్లాక కల్చరల్ యాక్టివిటీస్​ పట్ల నాకున్న ఇంట్రెస్ట్​తో ఆర్ట్స్​ క్లబ్​ సెక్రెటరీ అయ్యా. ఆ తర్వాత ఇన్ఫోసిస్​లో ట్రైనింగ్ కోసం మైసూర్​ వెళ్లా. అక్కడ జరిగిన ‘పరిచయ్’​ అనే మెగా షోకి టెకీ కమ్యూనిటీలో ఉన్న ఆర్టిస్ట్​లు, యాక్టర్స్, డాన్సర్స్​ వచ్చారు. ఆ షోలో మెయిన్ క్యారెక్టర్​ నేను చేశా. అప్పుడే షార్ట్​ ఫిల్మ్ తీయాలనే ఆలోచన మొదలైంది.

ఆ తరువాత నాకు త్రివేండ్రంకి ట్రాన్స్​ఫర్ అయింది. అక్కడ 2012లో ‘సిఇటి లైఫ్’​లో యాక్టింగ్​ చేశా. తర్వాత నేనే ‘ప్రియంవద కాతరాయనొ’ అనే షార్ట్​ ఫిల్మ్​ తీశా.  అందులో నేను కూడా నటించా.17 నిమిషాల ఆ షార్ట్​ ఫిల్మ్​ని యూట్యూబ్​లో అప్​లోడ్ చేశా. అది ట్విస్ట్​తో కూడిన లవ్​ స్టోరీ. దానికి నా ఫ్రెండ్స్, కొలిగ్స్​ సపోర్ట్​ చేశారు. అప్పటికి నా వయసు 22 ఏండ్లు. ఇవేకాకుండా ‘ష్​...’ అనే షార్ట్ ఫిల్మ్​కి స్క్రిప్ట్​ రైటర్, డైరెక్టర్​​గా పనిచేశా.

2013లో ‘పకలుకలుడె రాణి’లో యాక్టర్​గా, ‘ఒరు తుండు పాదం’కి రైటర్​గా చేశా. 2014లో ‘హ్యాపీ ఓనమ్’​ అనే షార్ట్​ ఫిల్మ్​కి రైటర్​గా చేశా. ఆ తర్వాత ఐటీ జాబ్​ మానేసి, పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టా. నిజానికి ఐటీ జాబ్ మానేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అలాగే సినిమాలంటే చర్చి కమ్యూనిటీలో కూడా వేరుగా చూస్తారు. కానీ, ఈ విషయంలో మా పేరెంట్స్ నాకు అండగా నిలిచారు. 

సినిమా గురించి నేర్చుకున్నా

మలయాళం డైరెక్టర్స్... ప్రియదర్శన్, సత్యన్ అంతికద్, శ్రీనివాసన్, రఘునాథ్ పలేరి సినిమాలు నేను బాగా చూశా. 2010 టైంలో తమిళంలో బాలాజీ మోహన్, నళన్ కుమారస్వామి, కార్తిక్ సుబ్బరాజ్​ల ప్రభావం ఉండేది. వాళ్ల సినిమాల చూశాకే నాకు షార్ట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన వచ్చింది. నా మొదటి సినిమా ‘కుంజిరామాయణం’ (2015) వాళ్ల ఇన్​ఫ్లుయెన్స్​తో తీసిందే. అలా సినిమా గ్రామర్ కొంచెం కొంచెం ఒంటబట్టించుకున్నా. కానీ, నేను సినిమాలు తీసే టైంకి వెస్టర్న్​ సినిమాలను ఫాలో అవ్వడం మొదలుపెట్టా. ఫిల్మ్​ మేకింగ్​లో నన్ను ఇన్​స్పైర్ చేసింది స్టీవెన్ స్పీల్ బర్గ్, ఎడ్గర్ రైట్, గయ్ రిచీ, చార్లీ చాప్లిన్​ల సినిమాలు. 

డైరెక్టర్​గా నిలిపింది ఆ మూడు సినిమాలే 

 ‘తీర’ సినిమాకి అసిస్టెంట్​ డైరెక్టర్​గా 2013లో వినీత్ శ్రీనివాసన్​ దగ్గర పనిచేశా. డైరెక్టర్​గా నా మొదటి సినిమా కుంజిరామాయణం (2015). అందులో వినీత్​ శ్రీనివాసన్​ హీరో. ఆ తర్వాత 2017లో టొవినో థామస్​​ హీరోగా ‘గోధ’ అనే సినిమా తీశా. ఆ సినిమా తర్వాత డైరెక్షన్​కి చాలా గ్యాప్ వచ్చింది. 2021లో మళ్లీ టొవినో థామస్​తోనే ఫిక్షన్​ మూవీ చేశా. అదే ‘మిన్నళ్ మురళి’ (మెరుపు మురళి). దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్​ టైం నేను గ్రాఫిక్స్ వాడి తీసిన సినిమా అది. అందులో వీఎఫెక్ట్స్​కి సూపర్ విజన్ చేశా. ఫ్రేమ్​ టు ఫ్రేమ్​ అన్నీ దగ్గరుండి చూసుకున్నా. ఈ మూడు సినిమాలు నన్ను దర్శకుడిగా నిలబెట్టాయి. 

స్పెషల్ అప్పియరెన్స్​

యాక్టర్​గా నా ప్రయాణం 2013లో మొదలైంది. ‘అప్ అండ్ డౌన్ : ముకలిల్​ ఒరలుండు’, ‘సైలెన్స్’ అనే సినిమాల్లో గెస్ట్ రోల్​లో కనిపించా. ఆ తర్వాత నా సినిమాలతోపాటు ‘హోమ్లీ మీల్స్’, ‘మాయానది’లలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చా. 2018లో ‘రొసాపో, పడయొట్టమ్​, నిత్యహరిత నాయకన్’ లలో క్యారెక్టర్స్ చేశా. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించా. 2021లో ‘మిన్నళ్ మురళి’ సినిమా డైరెక్ట్ చేశా. కానీ, ఆ ఏడాది కూడా ఇదికాక ఐదు సినిమాల్లో యాక్ట్​ చేశా. అయితే, తీసిన మూడు సినిమాల్లో స్పెషల్​ అప్పియరెన్స్ ఇచ్చా. 

నెగెటివ్​ రోల్​ కోసం వెయిట్ చేసి..

‘జయ జయ జయ జయహే’ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. అప్పటివరకు నెగెటివ్​ రోల్​ చేయలేదు. నిజానికి అలాంటి క్యారెక్టర్​ కోసం నేను వెయిట్ చేశా. అలాగే కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ చూస్తారు. ‘జాన్​–ఇ– మ్యాన్’, ‘జయ జయ జయ జయహే’, ‘ఫాల్తూ జాన్వర్’​లో అదే జరిగింది. స్క్రిప్ట్​ సెలక్ట్ చేసుకునే విషయంలో నాలోని దర్శకుడు నాకు సాయం చేస్తాడు. అలాగని మంచి సినిమా చేస్తే లాభం లేదు. కాన్సెప్ట్ నుంచి థియేటర్​ వరకు సినిమాని బాగా ప్రమోట్​ చేయాలి. అందుకే ‘జయ..’ సినిమా కోసం రీల్ చేశాం. అది బాగా వైరల్ అయింది. 

అది నా కంఫర్ట్​ జోన్​ 

‘జోజి’ సినిమాలో సీరియస్ క్యారెక్టర్​ చేశా. అయితే, దానికి ముందు నేను చేసినవన్నీ కామెడీ, సపోర్టింగ్​ రోల్స్. అవి నా కంఫర్ట్​ జోన్​. దాన్నుంచి బయటకొచ్చి ఈ రోల్ చేశా. ఆ తర్వాత ఆడియెన్స్​ కూడా నన్ను అలాంటి రోల్స్​లో చూడ్డానికి ఇష్టపడ్డారు. ఇమేజ్​ని బ్రేక్​ చేసినవాడిగా నాకు మంచిగా అనిపించింది. నేను లీడ్​ రోల్​లో చేసిన మొదటి సినిమా ‘జాన్​ –ఇ– మ్యాన్’. అందులో కూడా నాది కామెడీ పాత్ర. ‘ఫాల్తూ జాన్వర్’​ సినిమా కొస్తే అది కంప్లీట్ ఫన్నీ క్యారెక్టర్​ కాదు. అది కూడా ఇమేజ్​ని బ్రేక్​ చేసే పాత్రే. నేను నా కంఫర్ట్​జోన్​లో ఉండలేను. 

సూపర్​ హీరో సినిమా ఎందుకంటే..

అమెరికన్లు కామిక్స్​లో, సినిమాల్లో సూపర్​ హీరోస్​ రోల్స్ వాడారు. మన కల్చర్​లో శక్తిమాన్​ ఉంది. అలాగే పురాణాల్లో హనుమాన్, రామ్ సూపర్​ హీరోల్లా చూస్తాం. ఎక్కడా కూడా ఆ దేశంలో పుట్టినవాళ్లు, ఇంట్లో పెరిగిన సూపర్​ హీరోగాకనపడడు. నేను చిన్నప్పుడు మొదటిసారి చూసిన ఇండియన్ త్రీడీ మూవీ ‘మై డియర్ కుట్టిచేతన్’ (1984). అలాగే సూపర్​ హీరోల సినిమాలు చాలా చూశాం. ‘మిన్నళ్ మురళి’ అలా ఉండకూడదు. కొత్త సూపర్​ హీరో క్యారెక్టర్​ పరిచయం చేయాలనుకున్నా. బడ్జెట్​ లిమిట్ ఇంతవరకే అని టార్గెట్​ పెట్టుకుని ఒక సూపర్ హీరో సినిమా చేయడం అనేది నిజంగా ఛాలెంజింగ్​. థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ కూడా. ఈ సినిమా కోసం సెట్​లో  ప్రాక్టికల్స్ చాలానే చేశాం. 

కొవిడ్ టైంలో...

ఈ సినిమా మొదలు కాకముందే కొవిడ్ వచ్చింది. కానీ, పెద్ద బడ్జెట్​ సినిమా, ఇంపార్టెంట్ పోర్షన్స్ చేయాలి. ఆ టైంలో నాకు స్ట్రెస్​, టెన్షన్ విపరీతంగా పెరిగాయి. ఫస్ట్ లాక్​డౌన్​ తర్వాత ఎలాగో అన్ని సెగ్మెంట్స్, క్లైమాక్స్​తో సహా పూర్తి చేశాం. ఇక చివరిగా మూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా క్రూ మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు కేరళలో కేసులు పెరగడంతో రెండోసారి లాక్​డౌన్​ పెట్టారు. దాంతో చాలాకాలం గ్యాప్​ తర్వాత మూవీని పూర్తి చేశాం.

అయితే, కరోనా టైంలో టొవినో థామస్ జుట్టు, గడ్డం పెంచాడు. కాస్త బొద్దుగా అయ్యి, మళ్లీ తగ్గాడు. ఆ టైంలో నేను అతన్ని రకరకాల గెటప్స్​లో చూపించడానికి పనికొచ్చింది. అలాగే అలువ మణప్పురంలో మేం వేసిన సెట్​ కాలిపోవడంతో కర్నాటకకు మార్చాం. అది మంచిదే అయింది. అక్కడ క్లైమాక్స్​ కోసం అద్భుతమైన లొకేషన్​ దొరికింది. స్క్రిప్ట్​ రాసుకునేటప్పుడే వీఎఫెక్ట్స్ ఎక్కడ వాడాలో కూడా ప్లాన్ చేసుకున్నా. 

ఎన్నో సవాళ్లు 

ట్రైన్డ్​ ఫైట్​ మాస్టర్స్ వేరే దేశాల నుంచి వచ్చి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ టైంలో ప్రొటోకాల్స్ పాటిస్తూ వాళ్లు వచ్చి చేయడం అనేది కత్తి మీద సాములాంటిదే. కొన్ని సీన్స్​లో జనాలు ఎక్కువగా ఉంటారు. అయినా నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. అంతేకాదు.. మొదటి భాగంలో యాక్ట్ చేసిన ఇద్దరు యాక్టర్స్ సినిమా పూర్తికాక ముందే చనిపోయారు. వాళ్ల డబ్బింగ్ పార్ట్​ అలానే ఉంది. టొవినో థామస్​కి యాక్సిడెంట్ అయింది. అలా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.  ఆ టైంలో ప్రొడ్యూసర్స్ మాత్రం మూడేండ్లు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిజంగా వాళ్ల నమ్మకానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే” అని తన ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాడు బేజిల్​.

నా కల నెరవేరింది

నేను ఇప్పటివరకు చేరుకున్న మైలురాళ్లు నా కలను నెరవేర్చాయి. మొదటి సినిమా నా కలను నిజం చేసింది. రెండో సినిమా ఊహించినది ఏదైనా ఎలా జరుగుతుందో గ్రహించా. ఎందుకంటే అదంతా ప్లాన్​ చేయలేదు. కానీ, నా ఎఫర్ట్స్​ నేను పెట్టా. ఇప్పుడు ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ముఖ్యం. ప్రస్తుతం నేను అవకాశాల కోసం ఎదురుచూడడం కంటే ‘ఎలా బతకొచ్చు?’ అనే విషయం గురించి ఆలోచిస్తున్నా. 

ఫ్యాలిమి’ ముచ్చట్లు

ఫ్యాలిమి సినిమా కూడా ఆడియెన్స్​కి గుర్తుండిపోతుంది. కామెడీతో పాటు మంచి కంటెంట్​ ఉన్న స్క్రిప్ట్​ ఇది. షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేశాం. ఈ సినిమాలో సీనియర్ నటులు జగదీశ్, మంజు నటించారు. పాత్ర పట్ల వాళ్లకు ఉన్న కమిట్​మెంట్​కి ఫిదా అయిపోయా. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. రాజస్తాన్, వారణాసి వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇంకాస్త దూరమైనా వెళ్లడానికి  రెడీగా ఉన్నారు వాళ్లు. కొన్నిసార్లు వేడికి తట్టుకోలేకపోయేవాళ్లం. కానీ, వాళ్లు మాత్రం చాలా యాక్టివ్​గా ఉండేవాళ్లు.

-ప్రజ్ఞ