డాగ్స్​ డే స్పెషాలిటీ, క్యూట్​ పప్పీస్​ గురించి కొన్ని ముచ్చట్లు

చాలామందికి పెట్స్ పెంచుకోవడమంటే ఇష్టం ఉంటుంది. అలా పెంచుకునేందుకు పక్షులు, జంతువులు చాలా ఉన్నాయి. కానీ, ఎన్ని రకాల పెట్స్ ఉన్నా కుక్కకి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్​ ఉంటుంది. పెట్ లవర్స్ అందరూ ఫస్ట్ ఓట్ వేసేది కూడా దీనికే. మనుషులతో కలిసిపోయి, ఇంట్లో ఒక మెంబర్​లా, ఫ్రెండ్​లా ఉంటుంది ఇది​. అందుకే శునకాలను పెంచుకునేవాళ్లు కూడా వాటిపై అంతే ప్రేమ కురిపిస్తారు. కుక్కలు విశ్వాసం గలవి అని తెలిసిందే.. అయితే అవి మనుషుల పట్ల చూపే ప్రేమ కూడా అంతే గొప్పది మరి. రేపు (ఆగస్టు 26న) ఇంటర్నేషనల్​ డాగ్స్​ డే. ఈ సందర్భంగా డాగ్స్​ డే స్పెషాలిటీ, క్యూట్​ పప్పీస్​ గురించి కొన్ని ముచ్చట్లు...

ముందుగా ‘ఇంటర్నేషనల్ డాగ్​ డే’ అని కుక్కల కోసం ఒక రోజును ఎందుకు పెట్టారో తెలియాలి.  రచయిత, యానిమల్ వెల్ఫేర్ లాయర్, పెట్స్ లైఫ్ స్టయిల్ ఎక్స్​పర్ట్​, డాగ్ ట్రైనర్ అయిన కొలీన్ పైజ్ అనే ఆయన ‘నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే’ కోసం చాలా కృషి చేశాడు. రెస్క్యూ చేసిన శునకాలసేఫ్టీ, కేర్​, దత్తత గురించి జనాల్లో అవగాహన పెంచాలనేది ఆయన ఉద్దేశం. 

ఈ ఆలోచన వెనక ఒక కారణం ఉంది.. కొలీన్​కు పదేండ్ల వయసులో వాళ్ల ఇంట్లో మొదటిసారి ఒక శునకాన్ని దత్తత తీసుకున్నారు. అది 2004 ఆగస్టు 26వ తేదీ. అందుకే అదే రోజుని డాగ్స్​ డేగా ఎంచుకున్నాడాయన. అప్పటి నుంచి ప్రతి ఏడాది వార్షికోత్సవం జరుపుకోవడం ఒక ట్రెడిషన్​గా మారింది.

ఈ విషయాలు గమనించారా?

నిస్వార్థమైన, నిష్కలంకమైన ప్రేమను పంచడంలో డాగ్స్​ కేరాఫ్​ అని చెప్పొచ్చు. బాధలో లేదా ఒంటరిగా ఉంటే..  పెంపుడు శునకం​ మనిషిలాగే అర్థం చేసుకుని దగ్గరకొస్తుంది. తన యజమానిని అస్సలు ఒంటరిగా ఉండనీయదు. బయటి నుంచి ఇంటికి రాగానే చిన్నపిల్లల్లా పరిగెత్తుకుంటూ దగ్గరకొస్తుంది. యజమానుల కోసం ఏదైనా చేస్తాయి. మన లోపలి బాధను పోగొట్టేందుకు వాటి ప్రయత్నం అవి చేస్తాయి. 

కుక్కలు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా పసిగట్టగలవని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. శునకాలు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్​ చేస్తాయట. ప్రతి రోజును కొత్తగా చూస్తాయట. అందుకే కాబోలు వయసు మీద పడ్డాక చాలామంది ఒక శునకం తోడుంటే ఆనందంగా గడపొచ్చు అనుకుంటారు.  

నాణానికి మరో వైపు..

కుక్కలపై ఒక్కరోజు ప్రేమ చూపించి.. కడుపు నిండా తిండి పెడితే చాలు.. అవి వాటి జీవితకాలం ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటాయి. కడుపు నింపిన వాళ్లను తమ యజమానిగా భావిస్తాయి! ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉంటాయి. అందుకే కుక్కల్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే నాణానికి మరో వైపు  చూస్తే రాష్ట్రంలో వీధి కుక్కలు ఎక్కువైపోయాయి. వాటి వల్ల మనుషులు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. 

పెట్ కేర్ సెంటర్స్​లో ఉండే వాటినైతే ఆ సెంటర్స్​ వాళ్లు చూసుకుంటారు. కుక్కల్ని కొని పెంచేవాళ్లు వాళ్ల ఇళ్లలో వాటిని జాగ్రత్తగానే చూసుకుంటారు. మరి ఈ వీధి కుక్కల మాటేమిటి? వీలైనంతవరకు వీధి కుక్కలకు షెల్టర్ కల్పించాలి. వాటికి టైంకి తగ్గట్టు ఇంజెక్షన్​లు వేయించాలి. తిండి అందేలా చూడాలి.

ఆఫీసర్ డాగ్స్

కుక్కల్ని ‘గ్రామ సింహా’లని కూడా పిలుస్తారు. ఎందుకంటే... ఊరంతా నిద్రపోయినా కుక్కలు నిద్రపోకుండా కాపలా కాస్తాయి. చిన్న అలికిడి వినిపిస్తే చాలు చటుక్కున లేచి అటు ఇటూ చూస్తాయి. అలా గ్రామాల్లో ప్రజల్ని కాపాడతాయి. అంతకంటే కూడా.. నేరస్తుల్ని పట్టించడంలో, బాంబుల్ని గుర్తించడంలో, ఆర్మీలో... ఈ జాగిలాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాదు నేరాలకు సంబంధించి పోలీసులకు క్లూలు కూడా ఇస్తుంటాయి. అలా ఎన్నో కేసులను ఛేదించారు కూడా.