తెలంగాణలో రాజకీయ పార్టీలకు లోకల్ పరీక్ష

ఎన్నికలవేళ పైకెగిసిన ధూళి నేలకు చేరుతుంటే... దృశ్యం క్రమంగా స్పష్టమౌతోంది. నాయకులకు ఇప్పుడిప్పుడే ప్రజాతీర్పు తత్వం బోధపడి, నిజాలను అంగీకరిస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రజలే తప్పు చేశారన్న మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ‘ప్రజాతీర్పు శిరోధార్యం’ అంటుంటే, సరితూగే అభ్యర్థులు లేక ఇంకొన్ని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్థానాలు కోల్పోయామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అంగీకరిస్తున్నారు. ‘మోదీ’ చరిష్మా వల్ల తప్ప సొంతబలం పెరగని బీజేపీలో అంతర్గత కలహాలు, పార్టీ సంస్కృతికి  విరుద్ధంగా ఎన్నికల తర్వాత వీధిన పడుతున్నాయి. కనుమరుగు దశలో కాలం అంచున నిలిచిన కమ్యూనిస్టులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఏపీ గెలుపుతో మత్తు కమ్మిన తెలుగుదేశం, జనసేనలు తెలంగాణలో బలపడతామని కొత్త గొంతెత్తుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కలగాపులగంగా ఉన్నా ప్రజాక్షేత్రం సుస్పష్టంగానే ఉంది. ప్రభుత్వం మారి ఆరు మాసాలు పూర్తయిన వేళ.. అసలు జనం ఏమనుకుంటున్నారు? అది మన రాజకీయ వ్యవస్థకు అర్థమౌతోందా? ప్రజాభీష్టం ప్రకారమే పార్టీలు నడుస్తున్నాయా? అదే ఇప్పుడు పార్టీల ముందున్న ఎజెండా!

తెలంగాణ రాష్ట్రమిప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. కదిలిస్తే జనం మనసు విప్పుతున్నారు. ఎన్నికల తీర్పు,  భారీ మార్పుతో ప్రజలు తమను పాలించే  ప్రభుత్వాన్ని మార్చుకుని అప్పుడే ఆరు మాసాలు దాటింది. కడుపులో ఊపిరి పోసుకునే పిండం కూడా, నవజాత శిశువుగా నేలమీదకి రావడానికి తొమ్మిది నెలల కాలం పడుతుంది. అప్పుడే, కొత్త సర్కారుపై మంచి-చెడుల బేరీజేంటి? అనే ప్రశ్న ఉదయించడం సహజం. కానీ, కాపురం చేసే కళ కల్యాణ వేదికపై కాళ్లు తొక్కినపుడే తెలుస్తుందన్నట్టు ఆరు మాసాల్లో స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. పరిణామాలను  ప్రజలు జాగ్రత్తగా  గమనిస్తున్నారు. 

సర్కారుకు ‘జనం’ రాయితీ

ఆశించిన స్థాయిలో పాలనలో వేగం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆరు నెలల్లో  కొత్త సర్కారు ఇల్లు సర్దుకోవడం, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ,- ఎమ్మెల్సీ ఎన్నికలు,  ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వంటి పరిణామాల వల్ల పాలనపై దృష్టి కేంద్రీకరించలేదనే గ్రహింపు జనంలోనూ ఉంది. అందుకే, ‘చూద్దాం.. ఇప్పుడిప్పుడే కదా! పాలన పగ్గాలు చేపట్టారు.  మాట నిలబెట్టుకుని హామీలు ఏమేరకు నెరవేరుస్తారు?  ఏం మంచి పాలన అందిస్తారో వేచిచూద్దాం’ అనే ధోరణితో సర్కారుకు జనం కొంత ‘రాయితీ’ ఇస్తున్నారు. మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని ఆస్వాదిస్తున్నా, దాని తాలూకు ప్రతికూల ప్రభావాలనూ ఎక్కువగా జనం ప్రస్తావిస్తున్నారు. పెన్షన్ల మొత్తాల పెంపు, సకాలంలో అందించడం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అని ప్రభుత్వం ప్రకటించినా.. అది ఎప్పుడు? ఎలా వస్తుందోననే అదుర్దా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డుల పంపిణీ, జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వాటి కోసం జనం ఆశావహ నిరీక్షణలో ఉన్నారు. లేదని ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. జనం ‘కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను చవిచూస్తున్నారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి ‘పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వెళ్లినపుడు ప్రజలు నిర్మొహమాటంగానే తమ భావాలు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్​కు కార్యాచరణే ముఖ్యం

ప్రజాతీర్పే శిరోధార్యం అనే వాస్తవానికి దిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అక్కసు, -ధీమా మధ్య నలుగుతున్నట్టున్నారు. ‘అయ్యో! అధికారాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగరేసుకుపోయిందే!’ అనే అక్కసు వెళ్లగక్కకుండా ఆయన పరివారం ఉండలేకపోతున్నది. అదే సమయంలో, ‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖచ్చితంగా విఫలమౌతుంది, ప్రజలు మళ్లీ మననే ఎన్నుకొని తీరుతార’నే భరోసాను పార్టీ నాయకులతో ఆయన వ్యక్తం చేస్తున్నారు. కానీ, కార్యాచరణ లేదు. పార్టీని ఎలా నడపదలచుకున్నారు? మళ్లీ కుటుంబ పాలనేనా?  ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందా? ప్రజా ఉద్యమాలెలా ఉంటాయి? పార్టీ పునర్మిర్మాణానికి స్పష్టమైన సంకేతాలిచ్చి కార్యాచరణ ప్రారంభించాలి.  ఒక మహోద్యమం నడిపి, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనకీర్తి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతాలోనే ఉంది. ఒకవైపు నిన్నటి ఓటమి, మరోవైపు కూతురు జైల్లో మగ్గడం కుంగదీస్తున్నా .. ఆయన ధైర్యం కూడగట్టుకుని శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు.  పార్టీ కార్యకర్తలకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంత ధైర్యం ఇవ్వగలుగుతున్నా,  నాయకులకు భరోసా కల్పించలేకపోతున్నారు. అందుకే, వారంతా ‘పొలో’మని వలసలు పోతున్నారు.

 ‘పోతే పోనీ’ అనుకోవాలి

‘బీ’ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని, బయటకు వెళ్లారు (కావ్య), సమీక్షా సమావేశానికి వచ్చి, వెళ్లారు (రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి). స్వయంగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి, అనునయింపు మాటలు చెప్పి తెల్లారేసరికి జారుకున్నారు (కాలె యాదయ్య).  ఏమిటిది? నిజానికిది, భవిష్యత్తుకు సంబంధించిన భరోసా కల్పించడం, కల్పించకపోవడం సమస్య కాదు. ఎన్నికైనవారూ విపక్షం వీడి, పాలకపక్షం వైపు పాకడమన్నది.. సమకాలీన రాజకీయాల్లో వచ్చిన అవకాశవాద -ప్రాథమిక లక్షణం.  ఈ లక్షణాన్ని తన హయాంలో బాగా ప్రోత్సహించిన పాపానికి, ఇప్పుడు వెళ్లేవారిని ‘ఏమీ అనలేని’ అశక్తత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది. అలాగే ఆ పార్టీ ముఖ్యులెవరికీ ఈ విషయంలో నైతిక హక్కు లేని దుస్థితి.  ‘రెండేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని, నైతికత కోసమే రాజ్యసభకు రాజీనామా చేస్తున్నా’ అన్న కే . కేశవరావు తన కూతురి నైతికత గురించి ఆలోచించలేదా?  పార్టీ మారిన ఆమె, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహానగర మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవికి రాజీనామా చేశారా? కేకే  ‘నైతికత’ నిర్ణయాన్ని స్వాగతిద్దామన్నా, ముఖ్యమంత్రి  రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఒక ఇబ్బంది! కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూడు చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, అదే ‘నైతికత’ను  వారో, ఆయనో.. చాటగలరా?  ‘ఉహూ..లేదు’.  

బీజేపీదో  సమస్య

తెలంగాణలో బీజేపీది ప్రత్యేక సమస్య. ఎన్ని చేసినా.. సంస్థాగతంగా పార్టీ బలపడటం లేదు. నిజానికి, ఆ దిశలో పార్టీ అధినాయకత్వం చేసింది కూడా శూన్యమే! అందుకే సుస్థిర ఫలితాలు లేవు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వపు ఆరు మాసాల పాలన గురించి జనం సగటు అభిప్రాయంలో.. ‘ఆరు గ్యారెంటీలని అరడజను హామీలిచ్చారు. చెప్పినవి చేస్తే ఓకే, వీళ్లు కాదంటే, మళ్లీ వాళ్లు (బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వస్తారు‘ అంటున్నారే తప్ప 8 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాలు (మొత్తంలో దాదాపు సగం) గెలిచిన బీజేపీ జనం స్మృతిపథంలో లేనే లేదు. ‘వారు రారా, మరి వారి సంగతేమిట?’ని నిర్దిష్టంగా అడిగినా..‘వారా, వారెప్పుడు రావాలి!’  అన్న పెదవి విరుపే సమాధానం. ‘8(అసెంబ్లీ), 8(లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ)... కలిపితే 88,  వచ్చేసారి రాష్ట్రంలో మాదే ప్రభుత్వం’ అని పార్టీ నాయకులు అందమైన కలలు కంటూనే ఉన్నారు.  నిన్న గెలిచిన 8 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల పరిధిలో కనీసం 8 జడ్పీటీసీలలో, 8 మున్సిపాలిటీలలో  గెలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా పాతాలి. అలా చేస్తేనే బీజేపీకి తెలంగాణలో స్థిరమైన ప్రగతి సాధ్యం. తమ వైఖరి, పనితీరే ప్రామాణికంగా రాజకీయ పార్టీలు, ఆరు మాసాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే గీటురాయిగా ప్రజల మనసు గెలిస్తే, తెలంగాణ సుక్షేత్రం.. దున్నుకున్నోళ్లకు దున్నుకున్నంత!

‘మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తోనే మార్పు సంకేతం!

ప్రతిష్టాత్మక మూసీ ప్రాజెక్టు ద్వారా తన ‘మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర పాలనలో ఇంకా రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మొదలుకాలేదని, ఇంకా ‘అధికారుల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పాలనే సాగుతోందని సగటు ఓటరు భావిస్తున్నాడు. ధరణి ఇంకా అపరిష్కృతంగానే ఉంది. రైతు, నిరుద్యోగ యువతను సంతృప్తి పరిచే విధాన నిర్ణయాలు, వాటి అమలు మాత్రమే గత, ప్రస్తుత పాలన మధ్య తేడాను చూపగలదనే అభిప్రాయం జనంలో ఉంది. ఎన్నికలు, కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనలు ముగిసినందున ఇకపై పాలనలో వేగం, ప్రజా సమస్యలపై సర్కారు నిలిపే దృష్టిని బట్టే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైకా? కిందికా? అన్నది ఆధారపడనుంది. ప్రస్తుతం సరిగ్గా ‘బాయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఉంది. ప్రభుత్వం, పార్టీ జోడెడ్ల స్వారీ ముగిస్తే, ఇక సీఎం పూర్తిగా పాలనకు సమయం వెచ్చిస్తారనే భావన ఉంది. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే కసరత్తు ఢిల్లీలో జరుగుతున్నట్టుంది. సీఎం 17 సార్లు ఢిల్లీకి తిరగటం, ప్రత్యర్థుల విమర్శలకు తావిస్తోంది. ఇన్నాళ్లూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించి, ఇప్పుడు అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకోవడాల్ని పార్టీ శ్రేణులూ తప్పుబడుతున్నాయి. కానీ, సగటు జనం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

-  దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి,
పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 
పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంస్థ