ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్‌లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప్రేమతో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు సంజయ్లీల భన్సాలీ తీసిన ‘హీరామండి’లో ఒక క్యారెక్టర్ చేశాడు. పేరు జేసన్ షా. దక్షిణాది సినిమాల్లోనూ మెరిసిన ఈ యాక్టర్ ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది.
టెలివిజన్‌లో ‘బిగ్‌బాస్ సీజన్ –10’లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా 2016లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పదేండ్లకు 2017లో కత్రినా కైఫ్ నటించిన ‘ఫితూర్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా అంతగా గుర్తింపు లేని పాత్ర. ఆ తర్వాత 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్‌గా ఛాన్స్ వచ్చింది. అదే ఏడాది ‘చంద్రశేఖర్’ అనే సీరియల్లో జాన్ నాట్–బోవర్ అనే పాత్రలో కనిపించా. ఆ తర్వాత వరుసగా సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. ‘ఝాన్సీ కీ రాణి’ (2019)లో హుగ్ రోస్ అనే క్యారెక్టర్ చేశా.
తర్వాతి ఏడాది ‘బారిస్టర్ బాబు’లో ఆఫీసర్ రోల్లో సర్ జాన్ గ్రీన్ వుడ్గా చేశా. సీరియల్స్ చేస్తూనే మధ్యమధ్యలో సినిమా అవకాశాలు వస్తే అవి కూడా చేశా. 2022లో ‘స్వరాజ్’ అనే సీరియల్లో వాస్కో డ గామా క్యారెక్టర్ చేశా. వీటితోపాటు 2017లో ‘దేవ్ డీడీ’ అనే సిరీస్‌లో ఫిలిప్‌గా, 2021లో ‘దేవ్ డీడీ’ పార్ట్ – 2లో కూడా చేశా. 2020లో ‘స్టేట్ ఆఫ్ సీజ్ : 26/11’ సిరీస్‌లో నటించా. ఇప్పుడు ‘హీరామండి: ది డైమండ్ బజార్’లో అలస్టైర్ కార్ట్ రైట్ పాత్రలో నన్ను చూడొచ్చు.
ఇన్నేండ్లలో జర్నీలో చేసింది నాలుగైదు సినిమాలే. వాటిలో రెండుమూడు ఊరు, పేరూ తెలియని పాత్రలు. మిగతావి పేరు, పొజిషన్ ఉన్నా అంతగా గుర్తింపు లేనివి. అయినా సినిమా మీద ఇష్టంతో మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉన్నా. క్యారెక్టర్ పెద్దదా? చిన్నదా? అని చూడకుండా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ వెళ్తున్నా. అలా వచ్చిందే హీరామండి వెబ్ సిరీస్ ఛాన్స్.
దక్షిణాదిలో చేయాలని..
తమిళంలో ‘ఆగస్టు16, 1947’ అనే సినిమా 2020లో చేశా. నాకు దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయాలని ఎప్పటి నుంచో కోరిక. వాళ్లు చాలా క్రియేటివ్‌గా తీస్తారు. తమిళంలో ‘1947’ ద్వారా నా కోరిక నెరవేరింది. ఈ ప్రాజెక్ట్ కోసం తమిళం నేర్చుకోలేదు. కానీ, కొడైకెనాల్ చాలా సార్లు వెళ్లా. అక్కడివాళ్లు మాట్లాడే యాస నాకు అర్థమయ్యేది. డైలాగ్స్ రికార్డ్ చేసి షూటింగ్‌కి కొన్ని నెలల ముందే నాకు పంపేవాళ్లు. నేను వాటిని విని డైలాగ్స్ నేర్చుకునేవాడిని. హీరామండిలో బ్రిటిష్ ఆఫీసర్ కొడుకు జస్టిన్ అనే క్యారెక్టర్ చేశా. నాది విలన్ పాత్ర.
‘కంజూరింగ్ కన్నప్పన్’ అనే తమిళ సినిమా 2023లో వచ్చింది. అందులో చేశా కానీ అది అంతగా గుర్తింపు లేని రోల్. పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో కూడా అవకాశం వచ్చింది. అందులో కన్సైన్మెంట్ ఓనర్‌గా చేశా. ఈ ఏడాది తమిళంలో విడుదలైన ‘మిషన్ : చాప్టర్ 1’ అనే మూవీలో సూపర్వైజింగ్ ఆఫీసర్ నీల్ జాన్సన్ రోల్లో కనిపిస్తా.
హీరామండి విశేషాలు
నాకు హీరామండీలో అవకాశం వెరైటీగా వచ్చింది. ఒకసారి నేను ఆడిషన్స్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి ఒక గదిలో కూర్చున్నా. అదే గదిలోకి సంజయ్ వచ్చాడు. ఇద్దరం ‘హలో’ చెప్పుకున్నాం. అతను కబోర్డ్‌లో ఏదో వెతుకుతున్నట్టు చేస్తూ... నా వైపు రెండు మూడు సార్లు చూశాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది.. తను కబోర్డ్‌లో ఏదో వెతకడానికి రాలేదు. అతని కళ్లు హీరామండిలో ఇంగ్లిష్ ఆఫీసర్ అలిస్టర్ కార్ట్‌రైట్ పాత్ర కోసం వెతుకుతున్నాయని. ఆ తర్వాత ఏజెంట్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది.
హీరామండి’లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సంజయ్లీల భన్సాలీ గురించి చెప్పక్కర్లేదు. ఆయన చాలా అమేజింగ్ డైరెక్టర్. ఇంతమంది బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి పనిచేయడం నా కల నెరవేరినట్టే అనిపించింది. అంతేకాదు నా స్క్రీన్ టైం కూడా బాగానే ఉంది. దానివల్ల ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా కనిపించడానికి హెల్ప్ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మంచి ఎక్స్‌పీరియెన్స్.
ఆఫీసర్ పాత్రలు చాలా చేశా
నేను ఇప్పటికే బ్రిటిష్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చాలా చేశా. చాలావరకు ఆఫీసర్స్ అంటే.... సిక్స్ ప్యాక్‌తో, పెద్ద గొంతుతో మాట్లాడుతుంటారు. అయితే ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తా. దానికి కారణం ఇతను రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేయడు. అర్ధరాత్రుళ్లు ఆలస్యంగా తిండి తినడం, ఆల్కహాల్ తాగడం వంటివి చేస్తాడు. నిద్ర కూడా సరిగా పోడు. అందుకని అలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటే సరిపోతుంది అన్నారు. నేను అలాగే కనిపించడానికి ట్రై చేశా. అది స్క్రీన్ మీద కూడా వర్కవుట్ అయింది.
అంతేకాకుండా ఇప్పటికే నేను చాలా నెగెటివ్ రోల్స్ చేశా. కాబట్టి ఈసారి కూడా నెగెటివ్ రోల్ వచ్చినందుకు బాధపడలేదు. నిజానికి స్క్రీన్‌లో కనిపించినంత సేపు ఒక అధికారి పాత్రలో ఉన్నందుకు ఎంజాయ్ చేశా. అయితే, బై సెక్యువల్ క్యారెక్టర్ చేయాలన్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డా. కానీ, సంజయ్ డైరెక్షన్లో పనిచేస్తున్నా. అతను స్టాండర్డ్‌కి తగ్గట్టు తీస్తాడు. నాకు రోల్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదని బలంగా నమ్మి ఆ రోల్ చేశా.
పనిని ప్రేమిస్తా
ఇప్పటివరకు నా జర్నీలో ఎలాంటి రిగ్రెట్స్ లేవు. నిజానికి జర్నీ అంటే ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ, అవేవీ ఎక్కువ కాలం ఉండవు. దేవుడిపై నమ్మకం ఉంచితే వాటిని ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. మనం కోరుకున్నవన్నీ తీరుస్తాడు. నేను నా పనిని ప్రేమిస్తా. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలి, ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే.. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. అలాగే, పరిమితులు అనేవి వాటిని విధించుకునే వాళ్ల మైండ్‌ని బట్టి ఉంటాయి. ఆ విషయంలో నేను చాలా లక్కీ. టీవీ, వెబ్ సిరీస్, మూవీస్‌లో వర్క్ చాలా వస్తుంది. ప్రస్తుతానికి రెండు ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి.
చేసేదే చెప్తా!
కొంతమంది నన్ను ‘ఫిట్‌గా, హ్యాండ్సమ్గా ఉండాలంటే ఏం చేయాలి?’ అని అడుగుతుంటారు. వాళ్లకు నేను చెప్పేదేంటంటే.. నేను సిగరెట్ కాల్చను. మందు తాగను. చక్కెర ఎక్కువ తినొద్దు. ఇండియాలో స్వీట్స్ ఎక్కువగా తింటారు. చక్కెరతో చేసినవి కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. వారానికి ఒకటి రెండు సార్లు తింటే పర్వాలేదు. అలాగే వాడిన నూనె మళ్లీ వాడడం, డీప్ ఫ్రైలు తినడం వంటివి తగ్గించాలి. అవి జుట్టు, స్కిన్‌కి మంచిది కాదు. నేను రెగ్యులర్‌గా వర్కవుట్ చేస్తా. అందుకు గంట టైం లేకపోతే పావుగంట అయినా వాకింగ్ చేయాలి. త్వరగా నిద్రపోవాలి. తెల్లవారుజామున లేవాలి. ఇలాంటి అలవాట్ల వల్ల చూసేందుకు బాగుండడమే కాదు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఫ్రస్ట్రేషన్, కోపం, ఒత్తిడి వంటివి ఉంటే ఫోకస్ ఉండదు. చివరిగా నేను చెప్పేదేంటంటే మీ కలలు నెరవేరే వరకు వాటి వెంట పరిగెత్తండి. మధ్యలో చేతులు ఎత్తేయొద్దు. ఇది నా స్వానుభవంతో చెప్తున్నా. చాలాసార్లు ఇంక వెళ్లిపోవడమే. నేనేదీ చేయలేను అనుకునేవాడిని. కానీ, అలా చేసుంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు. లక్ష్యం నెరవేరే వరకు గట్టిగా ఉంటే మనకంటూ ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఆ రోజు అనుకున్నది సాధిస్తావ్.
మా అమ్మ బ్రిటిష్, నాన్న గుజరాతీ కావడం వల్ల కల్చర్ పరంగా రెండు రకాల లైఫ్ చూశా. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఒక ఏడాది యాక్టింగ్ కోర్స్ చేశా. ముంబయి వచ్చాక అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో మూడు నెలల కోర్సు ఒకటి చేశా. బాలీవుడ్లో ‘పార్ట్నర్’ (2007) అనే సినిమాలో కత్రినా కైఫ్ ఫియాన్సీగా కనిపించడం ద్వారా సినిమా జర్నీలో నా అరంగేట్రం జరిగింది. చాలాకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ స్క్రీన్ మీద కనిపించా.
ఆ సీన్లో టెన్షన్ పడ్డా
మనీషా కొయిరాలాని చెంపదెబ్బ కొట్టే సీన్లో చాలా టెన్షన్ పడ్డా. ఫైట్ మాస్టర్ ఏమో రియలిస్టిక్‌గా ఉండాలి అన్నాడు. నేను చాలా జాగ్రత్తగా నా యాక్షన్స్ చూసుకున్నా. ఎందుకంటే ఒకసారి షాట్ చేస్తున్నప్పుడు చెయ్యి తగిలి ఆమె ముక్కు పుడక ఊడిపోయింది. దాంతో ఫైట్ మాస్టర్ దగ్గరకి వెళ్లి ‘మనిద్దరికీ కో–ఆర్డినేషన్ లేకపోతే కష్టం. పొరపాటు జరిగితే చెంపదెబ్బ గట్టిగా తగిలే ఛాన్స్ ఉంది. పైగా ఆమె వయసులో పెద్దావిడ. ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ’ అని చెప్పా.
‘ఝాన్సీ కీ రాణి’ నా లైఫ్‌ని మార్చేసింది. కాస్టింగ్ టీం నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను డైలాగ్స్ చదివి, ఆడిషన్ ఇచ్చా. వాళ్లకు నచ్చింది. నాకు హిందీ బాగా వచ్చు. ఆ పాత్రకు హిందీ బాగా వచ్చిన ఫారిన్ ఆఫీసర్ కావాలి. అందుకే నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఒకసారి సెట్లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా నుదుటి మీద పెద్ద గాయం అయింది.
ఆ గాయానికి 14 కుట్లు పడ్డాయి. ఆ దెబ్బ ముక్కు లేదా కంటికి తగిలితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ, ఆ టైంలో నా చుట్టూ ఏంజెల్స్ ఉండి నన్ను కాపాడారని నేను నమ్ముతా.