‘‘ఈ నేలలో నా కుటుంబ రక్తం ఉంది. నేను తల వంచను. వెనక్కి తగ్గను. విలువలకు కట్టుబడే ఉంటా” అంటూ ఒక సందర్భంలో మాట్లాడారు ప్రియాంక గాంధీ. నిజంగానే ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 4.1 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆమె మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతారు. ముందుండి నడిపిస్తారు. నానమ్మ ఇందిరా గాంధీ రూపం, తెగింపు ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందుకే అందరూ అచ్చం ఇందిరా గాంధీని చూసినట్టే ఉందంటారు. కొన్నేండ్లుగా కార్యకర్తలు, నాయకులకు తోడు, నీడలా ఉన్న ప్రియాంక గాంధీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..
ప్రియాంక గాంధీ వాద్రా.. ఇందిరా గాంధీకి మనవరాలు. నెహ్రూకి ముని మనవరాలు. నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇప్పుడు వయనాడ్ ఎంపీగా గెలిచారు. ఆమె 1972లో పుట్టారు. వయసులో రాహుల్ గాంధీ కంటే రెండున్నరేళ్లు చిన్న. డెహ్రాడూన్‌లోని వెల్హమ్ గర్ల్స్ స్కూల్ చదువుకున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ హత్యతో సౌత్ ఢిల్లీలోని డే స్కూల్‌లో చేర్పించారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల హోమ్ స్కూలింగ్ చేశారు. జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేశారు.
1997లో చిన్ననాటి ఫ్రెండ్, బిజినెస్ మెన్ రాబర్ట్ వాద్రాను పెండ్లి చేసుకున్నారు. ఆమెకు కొడుకు రైహాన్, కూతురు మిరాయ ఉన్నారు. వాళ్ల కోసమే చాలారోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రియాంకకు వంట చేయడం, ఫొటోగ్రఫీ లాంటివి బాగా ఇష్టం. అంతేకాదు.. ఆమె స్కూబా-డైవర్ కూడా. ప్రియాంకకు ప్రకృతి, వైల్డ్ లైఫ్ అంటే బాగా ఇష్టం. ఎక్కడ వన్యప్రాణులు కనిపించినా వెంటనే కెమెరా పట్టుకుంటారు.
రాజకీయాల్లోకి..
ఇందిరా గాంధీ చనిపోయిన నాలుగేళ్లకు ప్రియాంక గాంధీ జనాల్లోకి వచ్చారు. 1988లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రజలు మొదటిసారి ప్రియాంక గాంధీని చూశారు. అప్పుడామెకు 16 ఏళ్లు. అప్పటినుంచే ఆమె రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. కానీ.. ఆమె మాత్రం ఎప్పుడూ తెరవెనకే ఉన్నారు. 2004లో సోనియా అమేథీలో పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికి ప్రియాంక వయసు 27 ఏళ్లు. నేత చీర కట్టుకుని ఇందిరను గుర్తు చేసేలా మాట్లాడారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సోనియా, రాహుల్ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు.
తాను మాత్రం పోటీ చేయలేదు. కానీ.. 2014 నుంచి కాంగ్రెస్‌ని బలపరచడంలో తనదైన పాత్ర పోషించారు. ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలు పదే పదే డిమాండ్ చేస్తుండడంతో 2018లో సోనియా గాంధీ ‘‘ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారు’’ అని ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరమే ప్రియాంక గాంధీ తూర్పు ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్‌గా నియామకమయ్యారు. అప్పటినుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. సంవత్సరం తర్వాత ఆమెకు మొత్తం రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు.
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయినా.. పట్టుదలతో పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని నడిపించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. అయితే.. ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దింపుతారని అందరూ అనుకున్నారు. సంస్థాగత బాధ్యతల వల్ల పోటీలోకి దిగడానికి ఒప్పుకోలేదు.
కానీ.. ఆమె పర్యవేక్షణలో ఇండియా కూటమి –కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లలో 43 గెలుచుకుంది. అందువల్లే లోక్‌సభలో బీజేపీ మెజారిటీ మార్కు 272 దాటలేకపోయింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గెలవడంతో మొదటిసారిగా నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి పార్లమెంటు సభ్యులు అయ్యారు.
ఇందిరలాగే..
ప్రియాంక అచ్చం ఇందిరాగాంధీలాగే ఉందని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే.. హెయిర్ స్టైల్, చీరకట్టు, పోలికలు, ఆహార్యం, హావభావాలు... ఇలా చాలా విషయాల్లో ఇందిరాగాంధీలాగే అనిపిస్తుంది. అందుకే కొందరు ఆమెని ‘ఇందిర’ అని కూడా పిలుస్తుంటారు. నానమ్మ లాగే హిందీ బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ మీద కూడా మంచి పట్టుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీతో కలిసి రోడ్‌షోను ప్రారంభించినప్పుడు ఆమెని చూసి అక్కడివాళ్లు ‘‘దూస్రీ ఇందిరా గాంధీ హై” అంటూ నినాదాలు చేశారు. ‘‘ఆమెలో ఇందిరాగాంధీని చూస్తున్నాం” అని పోస్టర్లు వేశారు.
ఆస్తులు
ప్రియాంక గాంధీ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ రూ. 12 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారంతో పాటు వారసత్వంగా వచ్చిన ఢిల్లీలోని వ్యవసాయ భూమి, సిమ్లాలోని ఇళ్లు ఉన్నాయి. భర్త రాబర్ట్ ఆస్తితో కలిపి మొత్తం రూ. 78 కోట్లకుపైగా విలువైన ఆస్తులు, రూ. 10 కోట్ల అప్పులు ఉన్నాయి.
పులులతో బంధం
‘మై ఫ్యామిలీ అండ్ అదర్ యానిమల్స్’ అనే పుస్తకంలో ఆమె రాసిన వ్యాసంలో తనకు పులులతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. 164 పేజీల మెగా–సైజ్ కాఫీ -టేబుల్ బుక్‌ని లగ్జరీ హోటళ్ల చైన్‌ని నడుపుతున్న అంజలి, జైసల్ సింగ్‌లతో కలిసి ప్రియాంక రాశారు. వాళ్లతో కలిసి ప్రియాంక రెగ్యులర్‌గా రాజస్థాన్‌లోని రణథంబోర్‌కి వెళ్లి పులుల ఫొటోలు తీస్తుంటారు. తన 13 ఏళ్ల వయస్సులో నాన్నతో కలిసి మొదటిసారి అక్కడికి వెళ్లారు. ఆ పుస్తకంలో “మా నాన్నకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమే నన్ను ప్రేరేపించింది”అని రాశారు. ఆ పుస్తకాన్ని రాజీవ్ గాంధీకి అంకితం చేశారు.
బౌద్ధం ఫాలోవర్
ప్రియాంక 2010లో బుద్ధిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. బౌద్ధం అంటే ఆమెకు బాగా ఇష్టం. బౌద్ధ ఫిలాసఫీ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. బౌద్ధ బోధకుడు ఎస్ఎన్ గోయెంకా ధ్యానంలో ఒక భాగమైన ‘విపాసన’ను ప్రాక్టీస్ చేయడంలో ఆమెకు గైడ్ చేశాడు. అప్పటినుంచి రెగ్యులర్‌గా విపాసన ప్రాక్టీస్ చేస్తున్నారు. దానివల్ల మనశ్శాంతి దొరుకుతుందని నమ్ముతారు.
‘భయ్యాజీ’ ఎందుకంటారు?
ప్రియాంక గాంధీ యంగ్ ఏజ్‌లో తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీతో కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ, రాయబరేలీకి వెళ్లేవారు. అప్పుడు అక్కడివాళ్లు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా ‘భయ్యా జీ’ అనేవాళ్లు. ఆ తర్వాత కూడా అలాగే పిలవడం అలవాటుగా మారింది. అలా పిలవడానికి ఆమె హెయిర్ స్టైల్, వేసుకునే బట్టలు, ఇందిరా గాంధీ స్టైల్ కూడా కారణమే.