పరిచయం..నోట్స్​ రాసుకుంటా

బ్యూటిఫుల్ ఫేస్, గుడ్ ఎక్స్​ప్రెషన్స్, నేచురల్​ యాక్టింగ్​​... అన్నీ కలిపితే ఒక సక్సెస్​ ఫుల్​ యాక్ట్రెస్​. వాటికి తోడు పవర్​ఫుల్​ రోల్స్ చేసే ఛాన్స్​ వస్తే... అది అదృష్టమే. అలాంటి అదృష్టం వరించిన నటి... పార్వతి తిరువోతు. మాతృభాష మలయాళంతో మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్​లో కూడా నటించింది. కెరీర్​ మొదలుపెట్టి పదిహేనేండ్లు అయింది. నాగచైతన్య నటించిన మొదటి ఓటీటీ సిరీస్​ ‘దూత’తో తెలుగులో కూడా పరిచయ మైంది. అయితే పార్వతి యాక్టింగ్ కెరీర్​లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిని దాటుకుని తను నటించిన అన్ని భాషల్లో సక్సెస్​ ఫుల్​గా ఎలా రాణించ గలుగుతోందో  ఆమె మాటల్లోనే... 

‘‘మాది కేరళలోని కాలికట్ (కోళీకోడ్)​ సిటీ. నాన్న పి. వినోద్​ కుమార్. అమ్మ టి.కె ఉషా కుమారి. ఇద్దరూ లాయర్లే. ఒక తోబుట్టువు ఉన్నాడు. నా చిన్నప్పుడే మా ఫ్యామిలీ తిరువనంతపురం షిఫ్ట్​ అయింది. అక్కడే కేంద్రీయ విద్యాలయంలో చదివా. తర్వాత ఆల్ సెయింట్స్ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్​లో బి.ఎ. డిగ్రీ చేశా. చదువయ్యాక ‘కిరణ్ టీవీ’ అనే మలయాళ మ్యూజిక్​ ఛానెల్లో యాంకర్​గా పనిచేశా. నేను భరతనాట్యం డాన్సర్​ని కూడా. 

రీసెర్చ్ చేస్తా..

నా మొదటి సినిమా ‘అవుట్ ఆఫ్​ సిలబస్’. అందులో కాలేజీ స్టూడెంట్స్​లో ఒకరిగా నటించా. అప్పుడు నాకు రీసెర్చ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనే ఆలోచన లేదు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేశా. ఆ తర్వాత ‘నోట్​బుక్’ చేశా. మూడో సినిమా ‘వినోదయాత్ర’లో నా రోల్ పేరు రేష్మి. ఆ సినిమాలో లీడ్​ రోల్ మీరా జాస్మిన్. నా క్యారెక్టర్ బాగా నచ్చి దాని గురించి కొంత రీసెర్చ్ చేశా. డైరెక్టర్ ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా డిజైన్ చేశాడు? ఆమె గతం ఏమై ఉంటుంది? అని రీసెర్చి చేసి, నోట్స్​ ప్రిపరేషన్ చేసుకున్నా​. అప్పటినుంచి ప్రతి క్యారెక్టర్​కి సంబంధించి నా దగ్గర నోట్​ బుక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఎలా పుట్టింది? ఏం చేస్తుంది? వంటి రీసెర్చ్​ పాయింట్స్ నోట్​ చేసుకుంటుంటా. 

పులు’లో నేను చేసిన క్యారెక్టర్​కి లెక్కలు బాగా వచ్చు. కానీ నాకు లెక్కలంటే భయం. దాంతో ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి ఎక్కాలు నేర్చుకునేదాన్ని. అలా నేర్చుకోవడం వల్ల నేనేదో చేసేస్తా అని కాదు. కానీ, అలా నేర్చుకుంటే నటించేటప్పుడు ఈజ్​ వస్తుంది. అలాంటి క్యారెక్టర్స్​కి పేపర్​ కటింగ్స్ నుంచి నోట్స్​ తయారుచేసుకుంటా. అలా తయారుచేసుకున్న నోట్స్​ పుస్తకంలో పేపర్​ మీద రాస్తా. అంతేకానీ, ఆ సమాచారం ఫోన్, ల్యాప్​టాప్​ల్లో ఉండదు.

వాటిలో దాచుకుంటే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నోట్స్​లో అయితే నాతోనే ఉంటుంది. అందుకని నోట్స్ మెయింటెయిన్ చేస్తా. అలాగని వేరే వాళ్లు చూడకుండా ఉండాలని రాసుకున్న నోట్​ పుస్తకాన్ని ఎక్కడెక్కడో దాచి పెట్టను. కాకపోతే అలా రాసుకుని నా వరకు ఉంచుకోవడం నాకు అలవాటు అంతే. చాలా రోజుల తర్వాత చాలా నోట్​బుక్స్​ కనిపించాయి. వాటిలో ‘పో’ (తెలుగులో మల్లి వర్సెస్ రవితేజ) సినిమా నోట్​బుక్​ కూడా కనిపించింది. అందులో నా క్యారెక్టర్​ పేరు మారి. హీరోయిన్​గా నా మొదటి సినిమా అది. అందులో నేనేం రాశానో నాకు గుర్తులేదు. సినిమా పూర్తయ్యాక ఆ క్యారెక్టర్​ను అక్కడితోనే మర్చిపోతా. 

మొదట ఏడ్చేస్తా!

నేను ఒక షూటింగ్​లో ఉన్నప్పుడు నా కాస్ట్యూమ్​ చాలా టైట్​గా ఉంది. దాన్ని కొంచెం లూజ్ చేసి ఇవ్వమని టీమ్​ని అడిగా. ఆ విషయంలో అపార్థాలు వచ్చాయి. దాంతో నేను ఏడ్చా. అక్కడ నన్ను.. అపార్థం చేసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే బాగా ఫీలయ్యా. దాంతో ఏడుపొచ్చేసింది. ఎమోషన్స్ విషయానికొస్తే మనమంతా లోపల చిన్నపిల్లలమే కదా! పిల్లల్లాగ మనసు ఎప్పుడూ ప్రేమ, కేర్, అండర్​స్టాండింగ్​నే కోరుకుంటుంది. అందరూ కూడా అవతలి వాళ్లు మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మనం ఎందుకు అవతలి వాళ్లని అర్థం చేసుకోకూడదు అని కూడా ఆలోచించాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తాం.. మన స్ట్రగుల్స్ వేరు, బ్యాక్​గ్రౌండ్స్ వేరు. అంతమాత్రాన నా ఫీలింగ్స్​కి విలువ లేదంటే ఎలా? అందుకే ఆ విషయంలో నాకు బాధగా అనిపించి ఏడ్చా. ఆ తర్వాత నన్ను బాధపెట్టిన విషయం ఏంటని చాలా ఆలోచించా. వాళ్లు కాస్ట్యూమ్ లూజ్ చేయలేదు. అప్పుడు వాళ్లతో ఆ విషయం స్పష్టంగా చెప్పి దాని గురించి మాట్లాడాలి. అప్పుడు అలా చేయలేదు. అప్పట్నించి నాకు నేను ఆలోచించుకుని దేనికి ఎలా రెస్పాండ్​ అవ్వాలో నేర్చుకున్నా. మనం దేన్నీ మార్చలేం. కానీ, ఏం ఫీలవుతున్నామో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.   

ఐదేండ్లు డిప్రెషన్​తో బాధపడ్డా

డిప్రెషన్​ అనే మాటలను చాలామంది చాలా ఈజీగా వాడుతుంటారు. కానీ, నా వరకు డిప్రెషన్​ అనేది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఐదేండ్లు నేను డిప్రెషన్​తో బాధపడ్డా. మెడిసిన్ వాడి కోలుకున్నా. ఆ తర్వాత లాక్​డౌన్​ వచ్చింది. లాక్​డౌన్​లో చాలా డిప్రెసివ్​గా ఫీలయ్యా. కానీ, ఆ టైంలో ఎలాంటి మందులు లేకుండా నాకు నేనే కోలుకున్నా. ఆన్​లైన్​ థెరపీలు, క్లోజ్ ఫ్రెండ్స్​తో మాట్లాడడం వంటివి చేశా. ఎప్పుడూ రెండు మూడు సినిమాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటా. అయితే, ఒక్కసారిగా నన్ను నేను లాక్​ చేసుకుని కూర్చోవాలంటే నా వల్ల కాలేదు. లాక్​డౌన్​లో వారం రోజులు దానికి అలవాటుపడలేకపోయా. ఆ తర్వాత పూర్తిగా నా ఫోకస్ అంతా వర్క్​ మీద పెట్టా. నేను సొంతంగా డైరెక్ట్​ చేయడానికి ఒక కథ రాస్తున్నా.

అభిప్రాయం ఏదైనా గౌరవిస్తా 

నేను కూడా తప్పులు చేస్తా. వాటి నుంచి నేర్చుకుంటా. కానీ, ఒకసారి జరిగిపోయాక వాటిని తవ్వుకోవడం అనవసరం. ఎవరికైనా నా వర్క్ నచ్చకపోతే వాళ్ల ఫీలింగ్స్​కి రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే ప్రతి మనిషీ ఒకేలా ఉండరు కదా. విమర్శిస్తున్నారంటే వాళ్లు నిజాయితీ మాట్లాడుతున్నట్టే. అందుకని వాటిని నేను తీసుకుంటా. ఈసారి ఇంకా బాగా చేయాలనుకుంటా. అంతేకానీ, ‘ఎంత పేమెంట్ ఇస్తే అంతే యాక్ట్ చేస్తా’ అని డీల్ పెట్టుకోను.  ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తేనే ఇంకా నేర్చుకుని ముందుకు వెళ్లగలం. 

వండర్ విమెన్​’ అందుకే నచ్చింది

‘వండర్ విమెన్​’లో నటించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ప్రెగ్నెంట్ విమెన్​ రోల్​ చేశా. కుల వివక్ష వల్ల మహిళలపై జరుగుతున్న హింస గురించి మాట్లాడుతుంది ఆ రోల్​. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అణచివేత కనిపిస్తుంది. కాబట్టి మొదట ఇంట్లో సమస్యలను సాల్వ్ చేద్దాం. తర్వాత అణచివేతను ఎదుర్కోవాలి. అప్పుడు అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ అవుతుంది. మా సినిమా విమెన్ ఎంపవర్​మెంట్ గురించి మాట్లాడుతుంది. అలాంటి సినిమాలో భాగం కావడం నా లక్. 

హిందీలో..

‘కడక్ సింగ్​’ లాంటి సినిమాలో అవకాశం రావడం చాలా రేర్. దీనికోసం నేను తొమ్మిది రోజులు షూటింగ్​కి వెళ్లా. హిందీలో 2017లో ఇర్ఫాన్​ ఖాన్​తో కలిసి ‘ఖరీబ్​ ఖరీబ్​’ సినిమా చేశా. ఆ తర్వాత మళ్లీ హిందీలో చేయలేదు. దానికి కారణం ఒక పని జరగకపోతే మరో పని వెతుక్కుంటాం కదా. అలాగే అవకాశం వచ్చినప్పుడే చేస్తాం. దాంతోపాటు నాకు క్యారెక్టర్ బాగా నచ్చితేనే చేస్తా. ‘కడక్ సింగ్​’లో నా రోల్​ బాగుంది అందుకే చేశా. 

దూత గురించి...

సూపర్​నేచురల్​ ఎలిమెంట్స్ ఉన్న మూవీలో నటించాలనేది నా కోరిక. దూతలో ఆ ఛాన్స్ దొరికింది. తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి జానర్స్​ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. చాలా ఎగ్జయిటింగ్​గా ఉంది. నాకు హారర్​ జానర్ అంటే చాలా ఇష్టం. అలాంటిది నేనే ఒక హారర్​ సిరీస్​లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్​ విక్రమ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ప్రతి  క్యారెక్టర్​ ఎలా ఉండబోతుందో కూడా చెప్పాడు. ఇందులో ప్రతి క్యారెక్టర్​ ఇంపార్టెంటే. తెలుగులో డెబ్యూ చేయడానికి నాకు 17 ఏండ్లు పట్టింది. ‘దూత’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  

 ప్రజ్ఞ