నేమ్​ప్లేట్​ రాజకీయం..మున్సిపల్​ఎన్నికల్లో పోటీకి ఔత్సాహికులు సన్నద్ధం

  • కొత్త ఒరవడికి శ్రీకారం
  • ఇంటి యజమానుల వివరాలు సేకరణ
  • ఇండ్లకు నేమ్​ప్లేట్లను ఏర్పాటు చేయిస్తున్న వైనం
  • నేమ్​ప్లేట్లపై చర్చించుకుంటున్న ప్రజలు 

రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో  కౌన్సిలర్లుగా పోటీకి సన్నద్ధమవుతున్న ఔత్సహికులు, ప్రస్తుత కౌన్సిలర్లు కొత్త  ఒరవడికి శ్రీకారం చూట్టారు.  ప్రతీ ఇంటికి నేమ్​ బోర్డులు తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తున్నారు.  ఒకటికి రెండు నేమ్​ ప్లేట్లు ఉండటంతో వార్డుల్లోకి వచ్చిన కొత్తవారు వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే వారు ముందస్తుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా వినూత్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.   నేమ్​ ప్లేట్ల ఏర్పాటుపై   ఇప్పుడు కామారెడ్డిలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
  
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో ఇప్పుడు నేమ్​ప్లేట్​ రాజకీయం నడుస్తోంది.   తమను గుర్తుంచుకునేలా, గుర్తు పట్టేలా ఇంటి యజమాని పేరు, ఇంటి నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయిస్తున్నారు.  ఆశావహులు ఒకరిని చూసి మరొకరు నేమ్​ప్లేట్లు ఏర్పాటు చేయిస్తుండటం మున్సిపల్​ రాజకీయం ఆసక్తికరంగా మారింది.  ఆయా వార్డుల్లోకి  వెళ్లిన వారు ఒకే ఇంటికి  ఒకే పేరు, ఒకే  నంబర్​తో పక్కపక్కన  రెండు నంబర్ ప్లేట్లు కనిపిస్తుండటంతో  వింతగా చూస్తున్నారు.  

ఇప్పటికే కొన్ని వార్డుల్లో  కొందరు నేమ్​ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. మున్సిపల్​ ఎన్నికల పాలక వర్గం గడువు మరో ఐదు నెలలు ఉంది.  2020 జనవరిలో  మున్సిపల్​ ఎన్నికలు జరిగాయి.   సకాలంలో  ఎన్నికలు నిర్వహిస్తే  ఐదు నెలల్లో ఎన్నికలు జరిగే వీలుంది. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు  సిద్ధమవుతున్న వారు ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే  ప్రయత్నాలు  చేస్తున్నారు.  ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న వారు  ప్రజల్లో గుర్తింపు పొందాలనుకొని  కొత్త కొత్త ఐడియాలతో  ముందుకొస్తున్నారు. కామారెడ్డిలో 49 వార్డులు ఉన్నాయి.   

వివరాలు సేకరించి

ఆయా వార్డుల్లో పోటీకి  సిద్ధంగా ఉన్న వారు  ఓటర్ల వివరాలు, సెల్​ఫోన్​ నంబర్లు సేకరిస్తున్నారు.  ప్రజలు తమను గుర్తుంచుకునేలా,  గుర్తు పట్టే విధంగా ఉండేందుకు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే   ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతం కౌన్సిలర్లుగా ఉన్న వారు,  మాజీ కౌన్సిలర్లు,  కొత్తగా పోటీకి  ఆసక్తి చూపే వారు  వార్డుల్లోని సమస్యలపై స్పందిస్తున్నారు. 

ఇప్పటి నుంచే ప్రజలతో సన్నిహితంగా ఉండేందుకు గల్లీల్లో తిరుగుతున్నారు. పండుగల వేళ స్థానిక టెంపుల్స్​లో  నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నారు.   ఆయా వార్డుల్లోని ఓటర్ల వివరాలు సేకరించి వాట్సాప్​ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు.  కొందరు వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. 

ఇంటి యజమాని పేరుతో..

ఒకొక్కరు  ఒక్కో ఆలోచనతో  ముందుకు వెళ్తున్నారు.  అశోక్​నగర్​కాలనీ, స్నేహపురి కాలనీ, శ్రీరాంనగర్​ కాలనీల్లో ఇండ్లకు నేమ్​ ప్లేట్లు కనిపిస్తున్నాయి.  మరికొన్ని వార్డుల్లో ఏర్పాటుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో నేమ్​ ప్లేట్​కు రూ. 250 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నారు.  వార్డుల్లో 400 నుంచి 450 వరకు ఇండ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని  కొత్త అలోచనలతో   ముందుకు వస్తారో చూడాలి.