షెహనాజ్ హుస్సేన్ అనేది ఒక పేరు మాత్రమే కాదు.. బ్యూటీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. సాధారణ గృహిణిగా జీవితాన్ని మొదలుపెట్టిన షెహనాజ్.. పారిశ్రామికవేత్తగా ఎదిగి, తన పేరిట ఒక బ్రాండ్‌నే క్రియేట్ చేసుకోగలిగింది. ఆమె తీసుకొచ్చిన హెర్బల్ కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌కి దేశ, విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటి వరండాలో బ్యూటీ క్లినిక్‌తో మొదలైన జర్నీ .. ప్రపంచాన్నిచుట్టేసింది.
షెహనాజ్ హుస్సేన్ అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నసీరుల్లా బేగ్ కూతురు. ఆమె కుటుంబంలో కొందరు జడ్జిలు, మరికొందరు రాజకీయ నాయకులు. కానీ.. షహనాజ్ మాత్రం అందుకు భిన్నంగా ఆమె కెరీర్‌ను బ్యూటీ ఫీల్డ్‌లోకి మార్చింది. సమర్‌ఖండ్‌లో రాయల్ ముస్లిం కుటుంబంలో పుట్టడం వల్ల ‘ఐరిష్ కాన్వెంట్’ అనే ఒక పెద్ద స్కూల్‌లో చదివే అవకాశం దొరికింది ఆమెకు. చదువుకునే రోజుల్లో షహనాజ్ పోయెట్రీ, ఇంగ్లిష్ లిటరేచర్ను బాగా ఇష్టపడేది. అంత ఇష్టపడిన వాటి గురించి ఎక్కువగా తెలుసుకోకముందే ఆమెకు 14 ఏండ్ల వయసులో నిశ్చితార్థం, ఆ తర్వాత రెండేండ్లకు16 ఏండ్ల వయసులో పెండ్లి జరిగింది. ఏడాది తిరక్కుండానే కూతురు నీలోఫర్ పుట్టింది. కానీ.. ఆమె మనసులో మాత్రం ఏదో సాధించాలనే తపన ఉండేది. సాధారణ గృహిణిగా మిగిలిపోకూడదు అనుకునేది.
టెహ్రాన్‌లో జీవితం
పెండ్లి జరిగిన పదేళ్ల తర్వాత అంటే... ఆమె 27 ఏళ్ల వయసులో భర్త నాసిర్ హుస్సేన్‌కు టెహ్రాన్‌లో ఫారిన్ ట్రేడ్ హెడ్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆయనతోపాటు షహనాజ్ కూడా టెహ్రాన్ వెళ్లక తప్పలేదు. అక్కడ ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి. వచ్చిన డబ్బుతో చదువుకోవాలి అనుకుంది. తీరా అక్కడకు వెళ్లాక అక్కడి భాష తెలియదు. దాంతో ఉద్యోగం దొరకడం కష్టమైంది. అయినా ఆమె ఆగలేదు.
ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘ఇరాన్ ట్రిబ్యూన్’ పత్రికకు బ్యూటీ ఎడిటర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అందులో వారానికి ఒక సబ్జెక్ట్ మీద 500 పదాల వ్యాసం రాయడం ఆమె పని. మొదట్లో కాస్త ఇబ్బంది పడింది. కొన్నాళ్లకు వారానికి పదివేల పదాలు రాయగలిగే స్థాయికి ఎదిగింది. అలా ఆత్మవిశ్వాసంతో పాటు ఆమెకు వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అయితే ఆమె చేతిరాత చదవడం కష్టంగా ఉండడంతో ఆర్టికల్‌ని టైప్ చేసి ఇవ్వమని అడిగారు ఆ పత్రిక వాళ్లు. ఆమెకు టైపింగ్ రాదు. అయినా చదువుకోవాలనే సంకల్పం గట్టిగా ఉండడం వల్ల చేతి వేళ్లకు గాయమైనా లెక్క చేయకుండా టైప్ చేసి పంపేది.
అప్పుడే తెలిసింది
ఆమె ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా బ్యూటీ గురించి రాయడంతో సింథటిక్ కాస్మొటిక్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తాయని తెలుసుకుంది. అప్పుడే ఆమెకు కాస్మొటిక్స్‌ని మూలికలు వాడి తయారు చేస్తే చర్మానికి హాని జరగదు కదా అనే ఆలోచన వచ్చింది. హెర్బల్ కాస్మొటిక్స్‌ని మార్కెట్‌లోకి తేవాలి అనుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ హెర్బ్స్ క్లినిక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అందుకే ప్రత్యేకంగా కాస్మొటాలజీ అండ్ ట్రైకాలజీలో రెండేండ్ల స్పెషలైజేషన్ కోర్స్ చేసింది.1977లో ఇండియాకు తిరిగి వచ్చేసింది. అప్పటికి ఆమె దగ్గర క్లినిక్ పెట్టడానికి సరిపోయేంత డబ్బు లేదు. తన తండ్రి దగ్గర 35,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఢిల్లీలోని తన సొంత ఇంటి వరండాలో బ్యూటీ క్లినిక్ పెట్టింది. అందుకు విదేశాల నుంచి లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ తెప్పించింది. ‘‘కేర్ అండ్ క్యూర్” అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేసింది. తర్వాత ప్రత్యేకంగా కొన్ని ఆయుర్వేద ప్రొడక్ట్స్ తయారు చేసి ‘షహనాజ్ హెర్బల్స్ ఇంక్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది.
నో-అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ
సాధారణంగా మార్కెటింగ్ చేయకుంటే ఏ ప్రొడక్ట్‌కి డిమాండ్ పెరగదు. షెహనాజ్ విషయంలో మాత్రం ఇది తారుమారైంది. ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇవ్వకుండానే బ్యూటీ క్లినిక్‌కు జనాలు ‘క్యూ’ కట్టారు. క్లినిక్ బయట ఒక బ్యానర్ మాత్రమే వేలాడదీసింది. అంతకుమించి ఎలాంటి ప్రచారం చేయలేదు. ఆ బ్యానర్‌లో ఆమె అర్హతలు, ఇచ్చే సర్వీస్‌ల గురించి వివరంగా రాయించింది.
ఆమె క్లినిక్‌కు కొన్ని రోజుల్లోనే జనాల రద్దీ పెరిగింది. ఆ రద్దీ ఎంతగా ఉండేదంటే ఒక్కోసారి ఆరు నెలల ముందుగానే ఆమె అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకునేంత. ఆ తర్వాత కూడా ఆమెది ‘నో-అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ’నే. అయినా ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.1980 నుండి 1982 మధ్యలో షెహనాజ్‌కు జనాదరణ విపరీతంగా పెరిగి... ఆమె క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరింది.1980లో న్యూయార్క్‌లో జరిగిన సిడిస్కో(సీఐడీఈఎస్‌సీఓ) వరల్డ్ బ్యూటీ కాంగ్రెస్‌లో షెహనాజ్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది.
అంతేకాదు.. కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ ప్రెసిడెంట్‌గా ఎంపికైంది. 1981లో ఐటీఈసీ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంగ్రెస్ ఛైర్మన్‌గా ఎన్నికైంది. అదే ఏడాది లండన్‌లో జరిగిన కాస్మొటిక్స్ ఫెయిర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 1982లో ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ థెరపిస్ట్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది.
సేల్స్ రికార్డ్ బ్రేక్
‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ అనే ప్రోగ్రామ్ లండన్‌లో 1980లో జరిగింది. అందులో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం ఆమె కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది. అక్కడ ఆమె చేసిన సేల్స్ అప్పటివరకు సెల్ఫ్ రిడ్జెస్(బ్యూటీ, విమెన్ ఫ్యాషన్, ఆర్నమెంట్స్ వంటి ప్రొడక్ట్స్ అమ్మే వేదిక)లో చేసిన కాస్మొటిక్ సేల్స్ రికార్డును బ్రేక్ చేశాయి. అప్పుడు డైలీ టెలిగ్రాఫ్‌లో ‘‘హెర్బల్ హెల్ బ్రేక్స్ లూజ్ ఎట్ సెల్ఫ్ రిడ్జ్” అనే హెడ్డింగ్‌తో ఫస్ట్ పేజీ కథనం వచ్చింది. దాంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత బీబీసీ కూడా ఆమెని ఇంటర్వ్యూ చేసింది. దాంతో ఆమె ప్రొడక్ట్స్ గురించి ప్రపంచమంతా తెలిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా ఆమె ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరిగింది. షెహనాజ్ క్లినిక్స్, అవుట్‌లెట్స్ చెయిన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో విస్తరించింది.
కొవిడ్ టైంలో..
షెహనాజ్ ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయని చెప్పడానికి ఆమెనే బెస్ట్ ఎగ్జాంపుల్. అదెలాగంటే... మెరిసే చర్మం, ఒత్తయిన జుట్టుతో కనిపించడమే. అంతేకాదు.. బ్యూటీ ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా సేవలందించిన షెహనాజ్ కరోనా టైంలో కూడా కొత్త ప్రొడక్ట్స్ తెచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. కొవిడ్ వల్ల బ్యూటీ సెలూన్లు చాలాకాలం మూతపడ్డాయి. కాస్మొటిక్ ప్రొడక్ట్స్ అమ్మకాలు కూడా విపరీతంగా తగ్గిపోయాయి.
లిప్‌స్టిక్ లాంటి మేకప్ ప్రొడక్ట్స్ సప్లయ్ చెయిన్ మీద బాగా దెబ్బపడింది. ఇ–కామర్స్ సైట్లలో మాత్రమే ఇలాంటి వాటికి గిరాకీ ఉండేది. దాంతో షెహనాజ్‌కు నష్టాలు మొదలయ్యాయి. అయినా.. తన సెలూన్స్‌లో అన్ని కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించారు. రోజుకు రెండు మూడుసార్లు శానిటైజ్ చేసేవాళ్లు. బ్యూటీ థెరపిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, సెలూన్ సిబ్బంది అంతా మాస్క్, షీల్డ్, పీపీఈ సూట్, గ్లోవ్స్ వేసుకునేవాళ్లు.
దాంతో ఖర్చు ఎక్కువ లాభాలు తక్కువ పరిస్థితి ఎదురైంది. అదే టైంలో షెహనాజ్ హుస్సేన్ ‘జర్మ్ ఫైట్’ సిరీస్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. వాటిలో నేచురల్ ఇంగ్రెడియెంట్స్ మాత్రమే వాడారు. వాటితోపాటు హెర్బల్ హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్, సోప్, ఫేస్ వాష్, హ్యాండ్ మాయిశ్చరైజర్, హ్యాండ్ క్రీమ్, చ్యవన్‌ప్రాశ్ లాంటివి కూడా మార్కెట్‌లో విడుదల చేసింది.
కూతురే చూసుకుంటుంది
షెహనాజ్ హెర్బల్ క్లినిక్ పెట్టిన కొన్నేండ్లకే ‘ది షెహనాజ్ హుస్సేన్ గ్రూప్’ పేరుతో కంపెనీ పెట్టింది. ఈ కంపెనీ నుంచే ప్రొడక్ట్స్ తయారుచేసి, అమ్ముతోంది. షెహనాజ్ భర్త 1999లో గుండెపోటుతో మరణించాడు. బ్యూటీ రంగంలో ఆమె చేసిన సేవలకు 2006లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆమె కొడుకు సమీర్ హుస్సేన్ 2008లో చనిపోయాడు. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని కూతురు నీలోఫర్ తీసుకుంది. ఆమె షెహనాజ్ హుస్సేన్ ఆత్మకథను ‘ఫ్లేమ్’ పేరుతో రాసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా138 దేశాల్లో కొన్ని వందల క్లినిక్స్, ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఉమెన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్ తనలాగే ఆడవాళ్లంతా కూడా ఏదో
ఒక రంగంలో స్థిరపడాలని ఆమె బలంగా కోరుకుంటుంది. అందుకే మహిళలను ప్రోత్సహించడానికి ‘‘ఉమెన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్” పేరుతో బ్యూటీ స్కూల్ ఏర్పాటు చేసింది. ఈ స్కూల్‌లో ఆడవాళ్లలో ఇంట్లోనే బ్యూటీ సెలూన్ ఏర్పాటు చేసుకునేలా ట్రైనింగ్ ఇచ్చింది. దీనివల్ల ఆడవాళ్లు ఒకవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు డబ్బు కూడా సంపాదించొచ్చు అనేది ఆమె ఆలోచన.