సిటీల్లో ఉండే ప్రతి మధ్య తరగతి కుటుంబానికి షాపింగ్ స్పాట్ డీ మార్ట్ అంటే అతిశయోక్తి కాదు. మిగతా మార్ట్స్‌తో పోలిస్తే.. చాలావరకు సరుకులు డీ మార్ట్‌లో తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే ఆదివారం వచ్చిందంటే.. ఈ మార్ట్‌ల ముందు క్యూ కడతారు జనాలు. కొన్ని స్టోర్లలో అయితే బిల్లింగ్ కౌంటర్ల దగ్గర జనాలు ‘క్యూ’ కట్టే పరిస్థితి. తక్కువ ధరకు సరుకులు అమ్ముతుంటే లాభాలు ఎలా? అదే అసలు రహస్యం. డీ మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని మాస్టర్ మైండ్‌తో ఈ బిజినెస్ మోడల్ తయారుచేశాడు. ఇందులో జనాలతోపాటు స్టోర్ యజమానికి కూడా లాభమే.
రాధాకిషన్ దమాని.. ఇండియాలోనే అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన డీ మార్ట్ వెనుకున్న మాస్టర్‌మైండ్. ఆయన దూరదృష్టి వల్లే ఈ మార్ట్ లాభాల్లో నడుస్తోంది. వ్యాపారాన్ని నిలబెట్టడానికి రాధాకిషన్ ఎన్నో కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు. కస్టమర్‌ని శాటిస్ఫై చేయడమే ధ్యేయంగా నిబద్ధతతో వ్యాపారాన్ని నడిపించాడు. రిటైల్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని తక్కువ ధరలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే డీ మార్ట్ ఇండియాలోని అతిపెద్ద హైపర్‌మార్కెట్‌లలో ఒకటిగా ఎదిగింది. డీమార్ట్‌లో అనేక రకాల ఫుడ్స్, బట్టలు, ఇంట్లో రెగ్యులర్‌గా వాడే వస్తువులు దొరుకుతాయి. మిగతా మార్ట్‌లు లాభాలను పెంచుకోవడంలో పోటీ పడితే.. డీ మార్ట్ మాత్రం ధరలను తగ్గించడంలో పోటీ పడుతోంది.
సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్
రాధాకిషన్ వ్యాపారవేత్తగానే కాదు.. సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. రాధాకిషన్ పూర్తి పేరు రాధాకిషన్ శివకిషన్ దమానీ. అందరూ ఆర్.కె. దమాని అని పిలుస్తారు. డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్)తోపాటు బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌ని కూడా స్థాపించాడు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. దీని ద్వారా దమానీ తన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మేనేజ్ చేస్తుంటాడు. ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్’ ప్రకారం.. 2021లో ప్రపంచంలో సంపన్న వ్యక్తుల జాబితాలో ఈయన 98వ అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపుపొందాడు.
రాజస్తాన్‌లోని బికనీర్‌లో మహేశ్వరి మార్వాడీ కుటుంబంలో పుట్టాడు రాధాకిషన్. ఈయన పుట్టుకతో ధనవంతుడు కాదు. తండ్రి ముంబైలోని దలాల్ స్ట్రీట్‌లో పని చేసేవాడు. అప్పట్లో వాళ్లు ఒక అపార్ట్‌మెంట్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఉండేవాళ్లు. రాధాకిషన్ ముంబై యూనివర్సిటీలో కామర్స్ చదివాడు. చదువు మధ్యలోనే మానేసి తండ్రి మొదలుపెట్టిన మెటల్ రోలర్స్ వ్యాపారంలో చేరాడు.
స్టాక్ మార్కెట్‌లో...
రాధాకిషన్ తండ్రి చనిపోయాక స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్‌తో.. స్టాక్ బ్రోకర్‌గా కెరీర్ మొదలు పెట్టాడు.1980లో ‘మిస్టర్ వైట్ అండ్ వైట్’ అనే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత షార్ట్ సెల్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. వాస్తవానికి1990ల్లో హర్షద్ మెహతా స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు దమానీ షార్ట్ సెల్లింగ్ ద్వారా చాలా లాభాలు పొందాడు.1999లో దమానీ ‘అప్నా బజార్’ అనే కో–ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్నాడు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ స్టోర్ పెట్టాలనే ఆలోచన మాత్రం అలాగే ఉంది. దాంతో 2002లో ముంబైలోని పోవైలో డీమార్ట్ స్టోర్ మొదలుపెట్టాడు. 2010 నాటికి డీమార్ట్ 25 స్టోర్‌లతో హైపర్ మార్కెట్స్ చైన్‌గా మారింది. 2017లో ఐపీవోకి వెళ్లింది. డీమార్ట్ పెట్టిన తర్వాతే 2020లో16.5 బిలియన్ల అమెరికాన్ డాలర్ల నెట్ వ్యాల్యూతో ఇండియాలోనే నాలుగో అతిపెద్ద ధనవంతుడు అయ్యాడు దమాని.
అలా మొదలైంది..
దమాని డీమార్ట్‌ని మొదలుపెట్టేటప్పటికే స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదించాడు. కానీ.. ఆ ఎక్స్‌పీరియెన్స్ రిటైల్ మార్కెట్‌లో లాభాలు తెచ్చిపెట్టదు. అందుకే లాభాల కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ చేశాడు. ఉదాహరణకు ఇతర రిటైల్ చైన్ కంపెనీల్లా స్టోర్స్ కోసం బిల్డింగ్స్‌ని అద్దెకు తీసుకుంటే స్టోర్ల సంఖ్య పెంచుకోవచ్చు. కానీ అదనపు ఖర్చులు పెరుగుతాయి. అందుకే వీలైనంత వరకు సొంత బిల్డింగ్స్‌లోనే మార్ట్స్ పెట్టాడు. కానీ.. అప్పటికే మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ‘బిగ్ బజార్’ లాంటి స్టోర్లు రెంట్ మోడల్‌లోనే ఉన్నాయి. అద్దె, ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. కాబట్టి అలాంటి వాటికోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనేది దమానీ ఆలోచన. అందుకోసం కొన్ని ప్లాన్స్ వేశాడు. అవేంటంటే..
హై వాల్యూమ్ లో మార్జిన్
డీ మార్ట్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు పోటీ చాలా ఎక్కువగానే ఉంది. అయినా దాన్ని తట్టుకునేందుకు ముందుగా తక్కువ మార్జిన్‌కు సరుకులు అమ్మడం మొదలుపెట్టారు. అంటే వాళ్ల లక్ష్యం ఎక్కువ లాభం కాదు. ఎక్కువ వాల్యూమ్ అమ్మడం. అందుకే తక్కువ ధరలకే సరుకులు అమ్మారు. దాంతో ఎక్కువ సరుకులు అమ్ముడయ్యాయి. దాంతో ఎక్కువ ధరకు అమ్మే స్టోర్లతో పోలిస్తే డీమార్ట్‌కే ఎక్కువ లాభాలు వచ్చాయి. డీమార్ట్ ఇతర కంపెనీల నుంచి సరుకులు కొనేటప్పుడు కూడా ఈ స్ట్రాటజీనే వాడుతుంది. ఎక్కువ వాల్యూమ్‌ని తక్కువ ధరకు కొంటుంది.
అద్దె కట్టే పనిలేదు
వారెన్ బఫ్ఫెట్‌లా దమానీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెడతాడు. రెగ్యులర్‌గా అద్దె కట్టడంతో పోలిస్తే ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టి భూమి కొంటే భవిష్యత్తులో ఆ భూమి వ్యాల్యూ పెరుగుతుంది. పైగా ప్రతినెలా అద్దె కట్టాల్సిన పనిలేదు. అందుకే దాదాపు అన్ని డీ మార్ట్‌లు సొంత స్థలాల్లో కట్టినవే.
చిన్నగానే..
‘అందినంత తీసుకోవాలి.. అందనిదాని కోసం ఆరాటపడకూడదు’ అంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని దమానీ కచ్చితంగా పాటిస్తాడు. అందుకే డీ మార్ట్‌లో లాభాలు రాగానే ఒక్కసారిగా కొత్త స్టోర్లను పెట్టలేదు. లాభాలు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెడుతూ వచ్చాడు. డీమార్ట్ పెట్టిన మొదటి 15 ఏండ్లలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది. 2017లో కంపెనీ పబ్లిక్‌గా మారిన తర్వాతే 11 రాష్ట్రాల్లో స్టోర్లు పెట్టారు. అంతేకాదు.. మొదటి పదహారేండ్లలో పెట్టింది119 స్టోర్లు మాత్రమే. నిదానమే ప్రధానంగా వ్యాపారాన్ని విస్తరించాడు. అందుకే డీ మార్ట్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క స్టోర్‌ని కూడా మూసేయలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 306 స్టోర్లు ఉన్నాయి.
ఎప్పుడూ స్టాక్..
చాలా మార్ట్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువుల స్టాక్ అయిపోగానే ‘ఔట్ ఆఫ్ స్టాక్’ బోర్డ్స్ పెడుతుంటారు. కానీ.. డీమార్ట్‌లో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. అందుకే డీమార్ట్‌కు వెళ్లే కస్టమర్స్ నిరాశతో తిరిగివెళ్లే పరిస్థితి ఎదురు కాదు.
తక్కువ ధరకు కొనండి.. చౌకగా అమ్మండి
సాధారణంగా చాలా స్టోర్లు కంపెనీల నుంచి వస్తువులను తీసుకుని అమ్మిన తర్వాత తిరిగి కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి. లేదంటే స్టాక్ కొని నెల లేదా రెండు నెలలకు డబ్బు ఇస్తాయి. అందువల్ల ఆ వెయిటింగ్ పిరియడ్‌లో నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలు కాస్త ఎక్కువ డబ్బు తీసుకుంటాయి. కానీ డీ మార్ట్ మాత్రం తమ సప్లయర్స్‌కు వారం రోజుల లోపే డబ్బు చెల్లిస్తుంది. అలా చెల్లించడం వల్ల కంపెనీలు ఇతర స్టోర్లతో పోలిస్తే డీమార్ట్‌కు తక్కువ ధరకే సరుకులు ఇస్తాయి.
చిన్న సప్లయ్ చెయిన్
ఏ రాష్ట్రంలో స్టోర్ పెడితే.. ఆ రాష్ట్రంలో దొరికే సరుకులే ఎక్కువగా అమ్ముతుంటారు. పెద్ద సప్లయ్ చెయిన్‌ని ఏర్పాటు చేసుకుని ఒకే చోటు నుంచి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే డీమార్ట్‌ల్లో లోకల్‌గా దొరికే ప్రొడక్ట్స్‌నే ఎక్కువగా అమ్ముతుంటారు.
మధ్య తరగతి స్టోర్స్
సాధారణంగా సూపర్ మార్కెట్లలో ఇటు మధ్య తరగతి వాళ్లకు అటు డబ్బున్నవాళ్లకు సరిపోయే ప్రొడక్ట్స్ ఉంచుతుంటారు. కానీ డీమార్ట్ ప్రత్యేకంగా మధ్య తరగతి వాళ్ల కోసం నడిచే స్టోర్. ఈ స్టోర్లలో నిత్యావసరాలే ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ వస్తువులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ. అంటే ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుల కోసమే డీ మార్ట్‌లో స్పేస్ వాడడం వల్ల ఎక్కువ రకాల వస్తువులు అమ్మేందుకు అవకాశం దొరికిందన్నమాట.
ఇంకా ఎన్నో..
- డీ మార్ట్ కోసం పెద్దగా పబ్లిసిటీ చేయరు. అంటే పబ్లిసిటీకి అయ్యే ఖర్చు తగ్గినట్టే.
- కరోనా తర్వాత అన్ని రకాల గ్రాసరీలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే డెలివరీ చేసే ట్రెండ్ మొదలైంది. దాంతో డీమార్ట్ కూడా ఆన్‌లైన్ డెలివరీ సర్వీస్ తీసుకొచ్చింది. అయినా ఆఫ్‌లైన్‌లో కొనేవాళ్లే ఎక్కువ.
- చాలా స్టోర్లలో వస్తువులను డిస్‌ప్లే చేయడానికి ఎక్కువ ప్లేస్ కేటాయిస్తారు. కానీ.. డీ మార్ట్‌లో మాత్రం తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెడతారు. కస్టమర్‌కు అవసరమైన వస్తువు ఎక్కడున్నా వెతుక్కొని తీసుకుంటాడనేది వాళ్ల సిద్ధాంతం.
- చిన్న స్టోర్లలో ఎక్కువ క్యాష్ కౌంటర్లు కనిపిస్తుంటాయి. కానీ.. డీ మార్ట్స్‌లో మాత్రం కొన్నిసార్లు బిల్లింగ్ దగ్గర ‘క్యూ’ కడుతుంటారు. అందుకు కారణం.. అవసరానికి మించి క్యాష్ కౌంటర్లు ఉండవు. దానివల్ల అదనంగా ఉద్యోగులు, మెయింటెనెన్స్ ఖర్చు తగ్గినట్టే.