వోక్స్(ఫోక్స్)వ్యాగన్... ఇది ఒక దేశ గవర్నమెంట్ పెట్టిన కంపెనీ. ఆ దేశ ప్రజలకు ఉపాధి కల్పించి, మధ్య తరగతి వాళ్లకు కూడా కారుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెచ్చిన బ్రాండ్. కానీ.. ఆ దేశం, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్త అమ్మకాలతో నెంబర్ వన్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు మధ్య తరగతి వాళ్లే కాదు.. ప్రపంచ కుబేరులు కూడా ఈ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ కార్లు వాడుతుంటారు. కార్లు ఒక్కటే కాకుండా కమర్షియల్ వెహికల్స్, బైక్స్ తయారీలోనూ అడుగుపెట్టి సక్సెస్ అైయ్యింది.
వోక్స్‌వ్యాగన్ కంపెనీ మెయిన్ బ్రాంచ్ జర్మనీలోని లోయర్ సాక్సోనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ఉంది. కొన్నేళ్ల క్రితం అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసి.. టాప్ ఆటోమేకర్‌గా వోక్స్‌వ్యాగన్ గ్రూప్ నిలిచింది. ఈ గ్రూప్‌కి అతిపెద్ద మార్కెట్ చైనాలో ఉంది. అక్కడి నుంచే ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి.వోక్స్‌వ్యాగన్‌ది దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. రెండో ప్రపంచయుద్ధానికి ముందే ఈ కంపెనీ ఏర్పాటయ్యింది.
అప్పటినుంచి ఇప్పటివరకు దీని జర్నీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంజనీరింగ్ స్కిల్స్ వాడి తక్కువ ధరలో కారుని తేవటం దగ్గరి నుంచి లేటెస్ట్ ఆటోమోటివ్ టెక్నాలజీ, డిజైన్‌తో మార్కెట్‌లో పెద్ద కంపెనీలకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈ కంపెనీని1937లో జర్మనీలో గవర్నమెంట్ నడుపుతున్న నాజీ పార్టీ ఆధ్వర్యంలోని ‘‘జర్మన్ లేబర్ ఫ్రంట్”స్థాపించింది. ఈ కంపెనీ పెట్టే ఆలోచన అడాల్ఫ్ హిట్లర్‌దే అని కూడా కొందరు చెప్తుంటారు. కంపెనీ ప్రారంభించినప్పుడు వాళ్ల అసలు లక్ష్యం మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో కారు ఇవ్వడం. అందుకు ఈ కంపెనీకి వోక్స్‌వ్యాగన్ అనే పేరుపెట్టారు. వోక్స్‌వ్యాగన్ అంటే.. జర్మన్ భాషలో ‘‘ప్రజల కారు”అని అర్థం.
పోర్ష తయారు చేసిన కారు
ఫెర్డినాండ్ పోర్ష పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది స్పోర్ట్స్ కార్లకు పర్యాయపదంగా చెప్పుకునే ‘పోర్ష’ బ్రాండ్. ఈ కంపెనీ నుంచి వచ్చినవి అన్నీ లగ్జరీ స్పోర్ట్స్ కార్లే. ఈ కంపెనీని ఫెర్డినాండ్ పోర్ష స్థాపించాడు. అతనే వోక్స్ వ్యాగన్ కోసం ఒక బడ్జెట్ కారుని కూడా తయారు చేశాడు. అప్పటికే పోర్ష ఒక బడ్జెట్ కారు తయారుచేయాలని రీసెర్చ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో హిట్లర్ పోర్షని పిలిచి బడ్జెట్5 సీటర్ కారు తయారీ ఐడియా చెప్పాడు. దాంతో వెంటనే కారు తయారీ పనిలో పడ్డాడు పోర్ష. డిజైన్ ఫైనల్ చేసి, దానికి ‘బీటిల్’ అని పేరు పెట్టాడు. పోర్ష తయారు చేయడం వల్లే ఆయన కంపెనీ నుంచి వచ్చిన మొదటి కారు పోర్ష టైప్–12కి, బీటిల్ కారుకి దగ్గరి పోలికలు ఉంటాయి. వోక్స్ వ్యాగన్ ఈ కారుని మార్కెట్‌లోకి తీసుకొచ్చిన కొన్నాళ్లకే ఫుల్ సక్సెస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందింది.
రెండో ప్రపంచ యుద్ధం
కారు ప్రొడక్షన్ మొదలైన కొన్ని రోజులకి... 1939లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో జర్మనీ గవర్నమెంట్ ఈ కంపెనీలో కార్లకు బదులు యుద్ధ సామాగ్రి తయారు చేయడం మొదలుపెట్టింది. అందుకే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ శత్రు దేశాలు ఈ కంపెనీని నాశనం చేశాయి. కానీ.. బీటిల్ కారు ప్రొటో టైప్ మాత్రం నాశనం కాలేదు. యుద్ధం తర్వాత మళ్లీ ఫ్యాక్టరీని బాగు చేయించారు. కానీ.. ప్రొడక్షన్‌కి సరిపడా డబ్బు జర్మన్ గవర్నమెంట్ దగ్గర లేదు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల వల్ల అప్పటికే బ్రిటన్ ఆర్మీ వెహికల్స్ దెబ్బతిన్నాయి.
దాంతో ఆర్మీ కోసం 20 వేల బీటిల్ కార్లు తయారు చేసి ఇవ్వాలని ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ ఆర్డర్‌కి అడ్వాన్స్‌గా వచ్చిన డబ్బుతో కార్లను తయారు చేసి, మళ్లీ వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ కంపెనీ తీసుకొచ్చిన ఎన్నో కార్లు సక్సెస్ అయ్యాయి. దాదాపు ఐరోపా అంతటా వోక్స్ వ్యాగన్ కార్లు తిరగడం మొదలైంది. ఆ తర్వాత కంపెనీ టైప్–2 పేరుతో ఒక కమర్షియల్ కారు కూడా తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువమందిని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఈ వెహికల్‌ని తయారు చేసింది. కంపెనీని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్‌కు ఈ కంపెనీలోని 80 శాతం వాటాను అమ్మేసింది.
అమెరికాకు
వోక్స్‌వ్యాగన్1950ల నాటికి తన అమ్మకాలను అనేక దేశాల్లో మొదలుపెట్టింది. ముఖ్యంగా అట్లాంటిక్ దాటి యునైటెడ్ స్టేట్స్‌లో పాతుకుపోయింది. అందరినీ ఆకట్టుకునే విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, బీటిల్ పేరుతో తెచ్చిన కారు గురించి ప్రచారం చేయడం దాని క్వాలిటీ, ఫీచర్స్ గురించి చెప్పడం వల్ల వోక్స్‌వ్యాగన్ ఖ్యాతి అన్ని దేశాలకు వ్యాపించింది.
దాంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్‌కు పరిపడా కార్లను తయారుచేసే కెపాసిటీ కంపెనీకి లేదు. సరిగ్గా అదే టైంలో అమ్మకానికి ఉన్న ఆటో యూనియన్ కంపెనీని(ఈ కంపెనీయే తరువాత ఆడీ అయ్యింది.) కొని ప్రొడక్షన్ పెంచింది. అంతేకాదు.. 1972లో బీటిల్ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
బెస్ట్ సెల్లర్
వోక్స్‌వ్యాగన్ ‘గోల్ఫ్’ పేరిట మరో కారుని1970వ దశకంలో మార్కెట్‌లోకి తెచ్చింది. అది అతితక్కువ టైంలోనే బెస్ట్ సెల్లర్‌గా మారింది. బీటిల్ కంటే కొత్త టెక్నాలజీతో గోల్ఫ్‌ను తయారు చేశారు. పైగా దానికంటే చాలా స్టయిలిష్‌గా ఉంది. క్వాలిటీలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దాంతో తక్కువ ధరలో క్వాలిటీ కార్లను అందించే కంపెనీగా వోక్స్‌వ్యాగన్‌కి పేరొచ్చింది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చిన కార్లలో బీటిల్, గోల్ఫ్, పస్సాట్, టిగ్వాన్, ట్వరెగ్ చాలా జనాదరణ పొందాయి.
అన్ని సెగ్మెంట్లలో..
వోక్స్‌వ్యాగన్ బడ్జెట్‌లోనే కాకుండా లగ్జరీ కార్లను కూడా తయారు చేయడం మొదలుపెట్టింది.1986లో స్పానిష్ కార్ మేకింగ్ కంపెనీ సియెట్‌ని కొనేసింది. దాంతో స్పెయిన్‌లోనే అతిపెద్ద ఆటోమోటివ్ కంపెనీగా ఎదిగింది.1994లో స్కోడా కంపెనీని కొని యూరప్‌లో అతిపెద్ద కంపెనీల జాబితాలో చేరింది. స్పోర్ట్స్ కారు మార్కెట్‌లో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో1998లో బెంట్లీ, లాంబోర్గిని, బుగాట్టిని కొన్నది.
ఇప్పటికీ ఆ బ్రాండ్స్ పేరుతోనే కార్లను తయారు చేస్తోంది. 2008లో కార్ల తయారీతోపాటు ట్రక్కులను కూడా ప్రొడ్యూస్ చేయాలని స్వీడన్‌కి చెందిన స్కానియా, 2011లో జర్మనీకి చెందిన మ్యాన్ అనే కంపెనీలను కొన్నది. ఈ రెండు కంపెనీలు అప్పటికే మంచి పేరున్న కమర్షియల్ వెహికల్ మాన్యుఫ్యాక్చరర్స్. ఆ తర్వాత బైక్ తయారీ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2012లో డ్యుకాటీ అనే ఇటలీకి చెందిన టూవీలర్ కంపెనీని కొన్నది. అంతేకాదు.. ఇదే సంవత్సరంలో పోర్ష కంపెనీని కూడా వోక్స్‌వ్యాగన్ దక్కించుకుంది. అంతేకాదు... మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఈ కంపెనీల నుంచి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని కూడా తయారు చేస్తోంది.
ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ఆడి, పోర్ష, బెంట్లీ, బుగాట్టి, లంబోర్గిని, సియట్, స్కోడా బ్రాండ్స్ పేరిట హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్, నేచురల్ గ్యాస్‌తో నడిచే ప్యాసింజర్ కార్లు తయారుచేస్తోంది. అంతేకాదు.. ఈ కంపెనీ హైడ్రోజన్ ఫ్యుయెల్‌తో నడిచే ఇంజన్ మోడల్స్‌ని కూడా మార్కెట్‌లోకి తెచ్చింది. మ్యాన్, స్కానియాల నుంచి వోక్స్‌వ్యాగన్ కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తోంది.
150 దేశాల్లో...
వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో తన కార్లను సేల్ చేస్తోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా అంతటా ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది కంపెనీకి కొన్ని వందల కోట్ల లాభాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఎప్పుడూ కొత్త స్ట్రాటజీలతో అడ్వర్టైజింగ్ చేస్తూ అమ్మకాలు పెంచుకుంటోంది.
ప్రముఖుల ఎండార్స్‌మెంట్లు, స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా బ్రాండ్స్‌ని జనాల్లోకి తీసుకెళ్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కూడా ప్రమోషన్స్ చేయిస్తోంది! అంతేకాదు.. ఫిఫా ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్ల సమయంలో జట్ల ఇన్‌స్పిరేషన్‌తో కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ రిలీజ్ చేస్తోంది.