ఇన్​స్పిరేషన్.. చిక్‌.. ఓ చిన్న ఐడియా

ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటుంటారు. కానీ.. చిన్ని కృష్ణన్ ఐడియా ఇండియాలో షాంపూ బిజినెస్‌‌‌‌నే మార్చేసింది. పేదవాళ్లకు షాంపూని చేరువ చేసింది. ఆ ఐడియా వల్లే చిన్ని కృష్ణన్‌‌ కొడుకు 15 వేల రూపాయలతో పెట్టిన కంపెనీ సక్సెస్‌‌ అయ్యింది. ఏటా వందల కోట్ల లాభాలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆ ఐడియా ఏంటి? దాని వల్ల సామాన్యుడికి వచ్చిన లాభమేంటి?

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మేనేజ్‌‌మెంట్ స్కూల్స్‌‌లో ‘చిక్ షాంపూ’ స్టోరీని కేస్‌‌ స్టడీగా చెప్తుంటాయి. ఈ షాంపూ సక్సెస్‌‌ స్టోరీ తమిళనాడులోని కడలూర్‌‌‌‌లో మొదలైంది. చిన్ని కృష్ణన్‌‌ కడలూర్‌‌‌‌ పట్టణంలో వ్యవసాయంతోపాటు చిన్న వ్యాపారాలు చేసేవాడు. ఆ తర్వాత చిన్నికృష్ణన్ చిన్న -స్థాయి ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ బిజినెస్‌‌ మొదలుపెట్టాడు. 1970ల్లో షాంపూలు, టాల్కమ్‌‌ పౌడర్స్‌‌, పర్​ఫ్యూమ్స్‌‌ లాంటివి డబ్బున్నవాళ్లే వాడేవాళ్లు. 

అందుకే అవన్నీ పెద్ద సైజ్‌‌ ప్యాక్‌‌ల్లో మాత్రమే దొరికేవి. వాటిని ఎక్కువగా ఎమ్మెన్సీ కంపెనీలే తయారుచేసేవి. కానీ.. ఇండియాలో డబ్బున్నవాళ్ల కంటే పేదవాళ్లే ఎక్కువ. అందుకే వాళ్లకు కూడా షాంపూలు, టాల్కమ్‌‌ పౌడర్స్‌‌ అందేలా చేయాలి అనుకున్నాడు చిన్ని కృష్ణన్‌‌. అలా చేయడం వల్ల బిజినెస్‌‌ పెరగడంతోపాటు పేదవాళ్లు ఆ ప్రొడక్ట్స్‌‌ వాడేలా చేయొచ్చని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సాచెట్‌‌ ప్యాకింగ్‌‌ తీసుకొచ్చాడు. టాల్కమ్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్‌‌లను సాచెట్ రూపంలో ఇండియన్​ మార్కెట్​కి మొట్టమొదట పరిచయం చేసింది ఇతనే. 

అంతేకాదు.. సాచెట్‌‌లో లిక్విడ్‌‌ని కూడా ప్యాక్‌‌ చేయొచ్చని షాంపూ సాచెట్‌‌ తెచ్చి మరీ నిరూపించాడు. పౌడర్‌‌‌‌ని అందరూ100 గ్రాముల ప్యాక్‌‌లో అమ్ముతుంటే చిన్ని కృష్ణన్‌‌ మాత్రం 20 గ్రాముల సాచెట్‌‌ తీసుకొచ్చాడు. అప్పట్లో అందరూ ఎప్సమ్ సాల్ట్​ని100 గ్రాముల ప్యాకెట్లలో అమ్మేవాళ్లు. 

అలాంటిది చిన్ని కృష్ణన్‌‌ 5 గ్రాముల పొట్లాలు అమ్మాడు. రోజూవారీ కూలీలు, రిక్షా నడిపేవాళ్లు కూడా తన ప్రొడక్ట్స్‌‌ వాడాలి అనుకున్నాడాయన. కానీ.. తన మార్కెటింగ్‌‌ సరిగా చేయకపోవడంతో వాటి గురించి ఎవరికీ పెద్దగా తెలియక... నష్టాలు వచ్చాయి. అంతలోనే ఆయన చనిపోయాడు. 

తండ్రి ఐడియా... కొడుకు బిజినెస్‌‌ 

చిన్ని కృష్ణన్‌‌కు నలుగురు కొడుకులు. వాళ్లలో సీకే రంగనాథన్ తప్ప మిగతా ముగ్గురు ఇంగ్లిష్‌‌ మీడియంలో చదువుకున్నారు. వాళ్లలో ఇద్దరు డాక్టర్లు, మరొకరు లాయర్‌‌. రంగనాథన్ మాత్రం ఇంగ్లిష్ రాకపోవడంతో తమిళంలో చదువుకున్నాడు. పెద్దగా చదువు అబ్బలేదు. దాంతో చిన్ని కృష్ణన్‌‌ అతన్ని వ్యవసాయం లేదా వ్యాపారం చేయాలని చెప్పేవాడు. 

రంగనాథన్‌‌కు కూడా చిన్నప్పటినుంచే బిజినెస్ చేయాలనే ఆలోచనే ఉండేది. ఆయనకు చిన్నప్పుడు పెంపుడు జంతువులపై ఆసక్తి ఎక్కువ ఉండేది. ఐదవ తరగతిలో ఉన్నప్పుడే 500కు పైగా పావురాలు, చేపలు, అనేక రకాల పక్షులు పెంచాడు. వాటి పిల్లల్ని అమ్ముతూ పాకెట్‌‌మనీ సంపాదించేవాడు. అలా అతనికి బిజినెస్‌‌ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. తండ్రి చనిపోయాక బిజినెస్​ బాధ్యతలు నలుగురు కొడుకులు తీసుకున్నారు. తర్వాత నలుగురు కలిసి1982లో ‘వెల్వెట్’ పేరుతో షాంపూని విడుదల చేశారు. 

తొమ్మిది నెలల్లోనే రంగనాథన్‌‌ అతని అన్నల ఆలోచనలతో విభేదించాడు. ఆ తర్వాత చిన్న చిన్న తేడాలు వచ్చాయి. దాంతో రంగనాథన్‌‌ ‘నాన్న సంపాదించిన ఆస్తి, వ్యాపారంలో తనకు ఎలాంటి వాటా అక్కర్లేద’ని బయటికి వచ్చేశాడు. కంపెనీలో అప్పటివరకు పనిచేసినందుకు తీసుకున్న జీతంలో సేవ్​ చేసుకున్న15 వేల రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. అప్పటివరకు కార్లలో తిరిగినా, సైకిల్ తొక్కడం అలవాటు చేసుకున్నాడు. 

నాన్న పేరు మీదే...

రంగనాథన్‌‌ ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్​లోనే ఎక్కువ కాలం పనిచేశాడు. దాంతో మార్కెటింగ్, ఫైనాన్స్ లాంటివాటి గురించి పెద్దగా తెలియదు. అయినా.. సక్సెస్‌‌ కావాలనే సంకల్పం మాత్రం బలంగా ఉంది. అందుకే అతని దగ్గర ఉన్న కొంత డబ్బుతోనే బిజినెస్​ చేయాలి అనుకున్నాడు. కానీ.. ఏ వ్యాపారం పెట్టాలో తోచలేదు. అతనికి షాంపూ తయారు చేయడం, పెంపుడు జంతువులను పెంచడం.. ఈ రెండు  మాత్రమే తెలుసు. 

దాంతో అతని దగ్గర ఉన్న డబ్బుతోనే ఒక చిన్న షాంపూ తయారీ యూనిట్ పెట్టాడు.1,000 రూపాయల అడ్వాన్స్‌‌, నెలకు 250 రూపాయల అద్దెతో ఒక బిల్డింగ్‌‌ తీసుకున్నాడు. దాన్నే ఇల్లు, ఆఫీస్‌‌గా వాడుకున్నాడు. తర్వాత1,200 రూపాయల అడ్వాన్స్‌‌తో ఫ్యాక్టరీ కోసం మరో స్థలం తీసుకున్నాడు. 3,000 రూపాయలతో షాంపూ ప్యాకింగ్‌‌ మెషిన్‌‌ని కొన్నాడు. 

వాళ్ల నాన్న ఇచ్చిన సాచెట్‌‌ ఐడియాతో కంపెనీ పెట్టాడు. కాబట్టి ఆయన పేరులోని అక్షరాలతోనే తన ప్రొడక్ట్‌‌కి ‘చిక్‌‌’ షాంపూ అని పేరు పెట్టాడు. 7 ఎంఎల్‌‌ సాచెట్‌‌కి 75 పైసలుగా ధర నిర్ణయించాడు. ప్రొడక్షన్‌‌ మొదలైన మొదటి నెలలో కేవలం 20,000 సాచెట్లు మాత్రమే అమ్మగలిగారు. మొదటి ఏడాది పెద్దగా లాభాలు రాలేదు. పెట్టుబడి మాత్రమే వచ్చింది. కానీ.. రెండో  ఏడాది నుండి లాభాలు మొదలయ్యాయి. 

అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు 

లాభాలు రావడమే కాదు.. ప్రొడక్ట్‌‌కి డిమాండ్‌‌ కూడా పెరిగింది. కానీ.. ప్రొడక్టివిటీ పెంచాలంటే యూనిట్‌‌ని అప్‌‌గ్రేడ్‌‌ చేయాలి. అందుకు కావాల్సిన డబ్బుకోసం బ్యాంక్‌‌కు వెళ్లాడు రంగనాథన్‌‌. కానీ.. కంపెనీకి ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో లోన్‌‌ మంజూరు కావడానికి మూడేండ్లు పట్టింది. కంపెనీ ఇన్‌‌కంట్యాక్స్‌‌ కడుతుందన్న ఒకే ఒక్క కారణంతో ఒక బ్యాంకు 25,000 రూపాయలు అప్పు ఇచ్చింది. అప్పటినుంచి ఏటా ప్రొడక్షన్‌‌ పెంచుతూ వచ్చారు. 

వ్యూహాలు 

సాచెట్లలో తీసుకురావడం, మంచి క్వాలిటీ.. మాత్రమే చిక్‌‌ షాంపూకి డిమాండ్‌‌ పెరిగేలా చేయలేదు. రంగనాథన్‌‌ మార్కెటింగ్‌‌ స్ట్రాటజీ కూడా చాలా ఉపయోగపడింది. చిక్ మార్కెట్‌‌లోకి వచ్చినప్పుడు ‘వెల్వెట్,  గోద్రెజ్ షాంపూలు’ గట్టి పోటీ ఇచ్చాయి. అప్పుడు రంగనాథన్ ఒక స్కీమ్‌‌ తెచ్చాడు. ‘ఏ కంపెనీ షాంపూ సాచెట్స్​ అయినా ఓ ఐదు కిరాణ షాపులో ఇస్తే.. ఒక చిక్‌‌ షాంపూ ఇస్తామ’న్నాడు. 

అలా ఎందుకు చేస్తున్నారో జనాలకు అర్థం కాలేదు. కానీ.. చాలామంది సాచెట్స్‌‌ ఇచ్చి చిక్‌‌ షాంపూని తీసుకెళ్లారు. అలా జనాలకు చిక్‌‌ షాంపూ వాడడం అలవాటు చేశాడు. తర్వాత కొన్నాళ్లకు చిక్‌‌ షాంపూ సాచెట్స్‌‌ ఇస్తేనే షాంపూ ఇస్తామని చెప్పారు. ఐదు షాంపూలు కొని, వాటి కవర్లను తిరిగి ఇచ్చేస్తే ఒకటి ఫ్రీగా వస్తుందనే ఉద్దేశంతో అందరూ చిక్‌‌ షాంపూలనే కొనడం మొదలుపెట్టారు. దాంతో అమ్మకాలు నెలకు 35,000 రూపాయల నుంచి12 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. 

మల్లె వాసనతో...

ప్రతి ఏడాది చిక్‌‌ లాభాలు పెరుగుతూ వచ్చాయి. అప్పుడు రంగనాథన్‌‌కు మరో ఐడియా వచ్చింది. ఇండియాలో ఆడవాళ్లు మంచి వాసన కోసం జడలో పూలు పెట్టుకుంటారు. పూలు పెట్టుకోకుండానే మంచి వాసన వచ్చే షాంపూని తయారుచేస్తే సేల్స్‌‌ పెరుగుతాయి అనుకున్నాడు. వెంటనే మల్లె, గులాబీ సువాసనలతో షాంపూలని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చాడు. 

పైగా యాక్టర్‌‌‌‌ అమలతో అడ్వర్టైజ్​మెంట్ చేయించాడు. ఆ దెబ్బతో అమ్మకాలు నెలకు 30 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పెరిగాయి. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కంపెనీ1992లో దక్షిణాదిలో నెంబర్‌‌‌‌ వన్‌‌ స్థానంలో నిలిచింది. తన అన్నల బిజినెస్‌‌ని ఓవర్‌‌‌‌టేక్‌‌ చేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందన్నమాట.

రూరల్‌‌ మార్కెట్‌‌ 

ఎమ్మెన్సీ కంపెనీలు తయారు చేసే షాంపూలను పెద్ద పెద్ద సీసాల్లో సిటీల్లోని ఫ్యాన్సీ స్టోర్లలో అమ్మేవాళ్లు. ఒకవేళ చిన్న ప్యాక్​లు వచ్చినా కూడా... అవి గ్రామీణ ప్రాంతాలకు చేరేవి కాదు. అందుకే రంగనాథన్‌‌ రూరల్‌‌ మార్కెట్‌‌పై పట్టు సాధించాలి అనుకున్నాడు. అందుకే పేదవాళ్లు కూడా కొనగలిగే విధంగా తక్కువ ధరకు చిన్న ప్యాక్‌‌లను తయారుచేసి రూరల్‌‌ ఏరియాల్లో చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో అమ్మాడు. దక్షిణాదిలోని చాలా గ్రామీణ ప్రాంతాలకు చిక్ షాంపూ చేరింది. అక్కడి ప్రజలకు షాంపూని ఎలా వాడాలో చూపించారు. 

అందుకోసం లైవ్‌‌ డెమాన్‌‌స్ట్రేషన్స్‌‌ ఇచ్చేవాళ్లు. అంతేకాదు.. చిక్ షాంపూ స్పాన్సర్ షోల్లో భాగంగా ఊళ్లలో హీరో రజనీకాంత్ సినిమాలు వేసేవాళ్లు. ఊరందరినీ ఒకచోటకి చేర్చి తెరపై సినిమా చూపించేవాళ్లు. మధ్యమధ్యలో చిక్ షాంపూ అడ్వర్టైజ్​మెంట్స్​ వచ్చేవి. ఆ షోలు చూసిన వాళ్లకు ఫ్రీగా షాంపూ సాచెట్లు ఇచ్చేవాళ్లు. దాంతో గ్రామీణ తమిళనాడు, ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌‌లో చిక్ షాంపూకి విపరీతంగా క్రేజ్ పెరిగింది. అమ్మకాలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి.

కెవిన్‌‌కేర్‌‌‌‌గా.. 

షాంపూతోపాటు మరికొన్ని బ్యూటీ కాస్మొటిక్స్‌‌ని కూడా మార్కెట్‌‌లోకి తీసుకురావాలి అనుకున్నాడు రంగనాథన్‌‌. అందుకే 1998లో కంపెనీకి ఒక మంచి పేరు పెట్టాలని ఉద్యోగుల మధ్య పోటీ పెట్టారు. వాళ్లలో ఒకరు ‘కెవిన్‌‌ కేర్‌‌’‌‌ అని సూచించారు. ఈ రెండు పదాల్లోని మొదటి రెండు అక్షరాలు వాళ్ల నాన్న పేరు చిన్న కృష్ణన్‌‌ పదాల్లోని మొదటి రెండు అక్షరాలు ‘సీకే’ కావడంతో దాన్ని ‘ఓకే’ చేశారు. ‘కెవిన్‌‌’ అంటే తమిళంలో ‘అందం, దయ’ అని అర్థం వస్తుంది.

ఇంకా ఎన్నో.. 

కంపెనీ డెవలప్‌‌ అవుతున్న కొద్దీ చాలా ప్రొడక్ట్స్‌‌ లాంచ్‌‌ చేశాడు.1993లో ‘నైల్ హెర్బల్ షాంపూ’, 1997లో ‘స్పింజ్ పర్​ఫ్యూమ్’​, ‘ఇండికా హెయిర్ డై’, 1998లో ‘ఫెయిరెవర్ ఫెయిర్‌‌నెస్ క్రీమ్‌‌’ని తీసుకొచ్చారు. అంతేకాదు.. ‘కార్తీక, మీరా షాంపూలు’ కూడా ఈ కంపెనీ ఉత్పత్తులే. 2008లో కాంచీపురంలో నష్టాల్లో కూరుకుపోయిన ఒక డెయిరీ యూనిట్‌‌ కొని, డెయిరీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు.

‘కెవిన్స్‌‌’ పేరుతో మిల్క్‌‌ షేక్‌‌, బటర్‌‌‌‌ మిల్క్‌‌, లస్సీ లాంటివి తీసుకొచ్చాడు. అంతేకాదు.. ‘మా’ పేరుతో ఫ్రూట్‌‌ డ్రింక్‌‌ కూడా తయారుచేస్తున్నారు. 2009లో ముంబైకి చెందిన గార్డెన్ నమ్‌‌కీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్నాక్స్, నమ్‌‌కీన్స్ తయారు చేసే కంపెనీని కొన్నాడు. ‘గార్డెన్’ పేరుతో శ్నాక్స్‌‌ అమ్ముతున్నాడు. ‘రుచి’ పచ్చళ్లను కూడా తీసుకొచ్చాడు. 

అద్దె బిల్డింగ్‌‌ నుంచి విదేశాలకు...

అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆఫీస్‌‌ పెట్టుకున్న రంగనాథన్ వ్యాపారం ఇప్పుడు భారతదేశం దాటిపోయింది. కెవిన్‌‌కేర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌ ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, సింగపూర్‌‌తో సహా అనేక దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. కెవిన్‌‌కేర్ బంగ్లాదేశ్ ప్రైవేట్ లిమిటెడ్, కెవిన్‌‌కేర్ లంక ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీకి రెండు విదేశీ అనుబంధ సంస్థలు ఉన్నాయి.