అక్షర ప్రపంచం : ఆలోచనాత్మకాలు : ఎ. గజేందర్ రెడ్డి

నాకీ చదువు ఇష్టం లేదంటే ‘నువ్వు అదే చదవాలి’ అన్నారు. నాకీ ఊరు వద్దంటే నువ్వు అక్కడే ఉండాలి అన్నారు. కన్న అమ్మానాన్నే నన్ను చదువు పేరుతో నరకకూపంలాంటి జైలులో తోసేస్తే ఇక నేనెవరితో చెప్పుకోవాలి? నేను మనిషినా? యంత్రాన్నా? తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేస్తే రాత్రి పడుకునేది పదకొండుకే. అప్పటిదాకా ఉరుకులు పరుగులు. చదువు.. చదువు.. చదువు. ఇదే లోకం. అరమార్కు తగ్గితే అవమానం.

ర్యాంకుల స్థాయిలో రోజూ టెస్ట్​ల్లో మార్కులు రావాల్సిందే. లేదంటే తిట్లు, దెబ్బలు. నేర్చుకోవడం అనేది చాలా సహజంగా, విత్తనం నుంచి మొలక బయటికొచ్చినట్లు, మొలక మొక్కగా ఎదిగినట్లు ఉండాలి కాని బూరకు గాలి ఊదినట్లు అది కూడా కెపాసిటీని మించి ఊదినట్లు ఉండకూడదు. ఇది సుంకోజి దేవేంద్రాచారి రాసిన ‘ఆత్మసాక్షిగా’ కథలో విద్యార్థుల ఆక్రందన. ఇంకా ఇందులో మహిళల,  రైతుల...- మరెందరివో ఆత్మఘోషలు ప్రశ్నల పరంపరను గుప్పిస్తాయి. సమాజాన్ని గుక్క తిప్పుకోకుండా చేస్తాయి.


గాజోజు నాగభూషణం ‘ఋణం’ కథలో ‘‘అదేమిటో రైతులకు చేతికందేంత దూరంలోనే, పురుగు మందు డబ్బాలు మృత్యువు రూపంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి’’ వంటి వాక్యాలు గుండెల్ని పిండి వేస్తాయి. తల్లడం మల్లడం, అగులు బుగులు వంటి పదబంధాలు సహజంగా ఒదిగినాయి.

బి.నర్సన్ రాసిన ‘ఈ శిక్ష మాకొద్దు’ కథ తలారికీ బాధలు, భయాలు, సెంటిమెంట్లు ఉంటాయని తెలియజేస్తుంది. తలారి జమాల్, ఉరి తీశాక నిద్రపట్టక రాత్రంతా ఎన్నిసార్లు ఏడ్చాడో? అటువంటి వాళ్ల ఇంటికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ప్రాణం తీయడం మహా పాపమని, కుటుంబానికేమైనా అవుతుందేమోసని భయం. ఉరితీసి ప్రాణాలు తీసేవాడు వీడేరా అన్నట్లు జనం చూస్తారు.

‘వెయిటింగ్ ఫర్ వీసా’ కథలో - అపార్ట్​మెంట్​లో ఎవరికైనా ఆడవారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, డెలివరీ సమయంలోనూ ఆవిడే అన్నీ దగ్గరుండి చూసుకునేదని, నీతిగా నిజాయితీగా అందరి మేలు కోరుతూ బతికిందని అన్నవారే... ఇప్పుడామె చనిపోగానే ఆరునెలలు ఆ ఇల్లు ఖాళీ చేయాలంటున్నారు. ఇన్నాళ్ళూ పవిత్రురాలైన ఆవిడ మసలిన ఇల్లు అపవిత్రమవుతుందా? వంటి ప్రశ్నల శరాలను రచయిత ఎం. సుగుణారావు సమాజానికి ఎక్కుపెడుతున్నాడు.

‘శిక్ష’ కథలో - “అద్భుతమైన సూర్యోదయాల్ని, పడమటి గాలి పైర్ల మీదుగా మోసుకొచ్చే పచ్చివాసనల్ని, ఆత్మీయంగా అల్లుకునే వెన్నెల్ని, చినుకుల స్పర్శతో పులకించే మట్టి సువాసనల్ని, వన్నెవన్నెల సూర్యాస్తమయాల్ని, వీటన్నిటిని ఆస్వాదించకుండా ఎలా బతుకీడుస్తున్నామో’’ అని రచయిత సలీం వాపోతాడు. ‘‘స్టార్ హోటళ్లలో ఆర్భాటాలు, మనుషులు చూపించుకునే ధనదర్పాలు తప్ప ఆప్యాయతలు ఎక్కడుంటాయి? పాక హోటల్లో ప్రేమలు, పరిచయాలు, జీవితం ఉంటాయి’’ - అని వాస్తవాల్ని వెల్లడిస్తాడు.

తప్పు చేసిన వాళ్లను శిక్షించకుండానే శిక్షించడం ఎలాగో తెలుపుతాడు. వసుంధర రాసిన కథలో -అమెరికాలో ఉన్న వేణు, ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇల్లు వృద్ధాప్యంలో మనుషులు ఏయే సదుపాయాలు కోరుకుంటారో అవన్నీ ఉన్న, అవధులు ఎరుగని అరమరికలు లేని ఆలుమగల ప్రైవసీ ఉన్న ‘బృందావనం’. అనసూయ రాసిన ‘అంగన’ కథకు ఆ పేరు సంపూర్ణంగా సార్థకమైనది.

ఉమామహేశ్ కథ ద్వారా ‘పులి వన్నె మేక’ ఎవరో తెలుసుకుంటాం. మరి మేకవన్నె పులులెవరో తెలుసుకోవాలి అనుకుంటాం. ‘రాజవ్వ’ కథలో రాజవ్వ గుణగణాలు, దాతృత్వం, ధైర్యసాహసాలు ఆవిష్కృతమైనయ్. ‘వజ్రం’ నిజంగా వజ్రంలాంటి కథ. ‘సింగిడి’ లో దుర్మార్గుల భయంకరమైన దౌర్జన్యాలు కనిపిస్తయ్. నస్రీనాఖాన్ రాసిన ‘హద్దులకు ఆవల’ - లైంగిక వేధింపులకు గురి చేయాలని చూసిన అధికారిని, పెద్ద పోరాటం అక్కరలేకుండానే అత్యంత చాకచక్యంగా ఉద్యోగం నుంచే డిస్మిస్ చేయించిన ఉద్యోగిని కథ.

మహిళా ఉద్యోగులందరూ తప్పక చదవాల్సిన కథ. ‘కొలిమి’ లో ఇనుపముక్కను ఎర్రగా కాల్చి సుత్తితో కొట్టి సాగదీసి పదునైన కత్తిగా మార్చే భద్రాచారి, గయిరి పోరగాళ్లతోటి సోపతిగట్టి బడికి ఎగ్గొట్టిన తన కొడుకును పదునైన కత్తిలా మార్చే పనిలో ఉన్నాడు. ‘విశ్వాసం’ కథ నమ్మకాన్ని నిర్వచించింది. నమ్మడమంటే ఏమిటో నేర్పింది. చిన్నపిల్లలైన అక్కాతమ్ముళ్ల గొడవలోని ఆనందాన్ని చవిచూపింది.

‘‘క్షమించడంలో ఆడవాళ్లని ధరిత్రితో పోలుస్తారు కదా! నిజమే. లేకపోతే 80 శాతం మగవాళ్ల జీవితాలు దుర్భరమైపోయేవి’’ అని ‘ధరిత్రి’ కథ రుజువు చేస్తుంది. ‘చారు అన్నం’ కథలో సుందరయ్య పాకశాస్త్ర ప్రవీణుడు. పెద్ద భోజనశాలలో పెద్ద వంటగాడు. ఆ భోజనశాలలో రోజూ వందమంది సుష్టుగా భోజనం చేస్తారు. రుచులు అమోఘం. అయితే సుందరయ్య మాత్రం ఇంటికి వచ్చాక భార్య చేతి అన్నం లొట్టలేసుకుంటూ తింటాడు. ఎందుకని? మేం ఉండగా మీకు బయట తిండి అనే ఖర్మ ఏమిటి?  అంటుందిభార్య. ‘మేం ఉండగా’ పదం గొప్ప భరోసా, ధైర్యం, అభిమానం. అన్నింటికీ మించి ఓ ఆసరా. ఇది స్త్రీలు మాత్రమే ఇవ్వగలరు.

ఈ కథలు ఆలోచనాత్మకాలు. ‘‘ఒక తరం వేరొక తరానికి తమ అనుభవ పరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాన నిధులు పుస్తకాలు’’ అనే బండారు వందన సూక్తిని ఈ గ్రంథం కొంతవరకు నిజం చేసింది. 

‘అన్వీక్షకి’ ప్రచురించిన ‘సంగతి’. ‘తెల్సా’  పోటీలలో బహుమతులకు ఎంపికైన వాటిలో ఏరిన పదహారు కథల సంపుటి ఇది.


- ఎ. గజేందర్ రెడ్డి