ఏ పండుగైనా ఏడాదికి ఒకసారి వస్తుంది. ఏ పండుగొచ్చినా ఖర్చు తప్పదు. కానీ.. ఇది మాత్రం ఐదేండ్లకు ఒకసారి వచ్చే పెద్ద పండుగ. ఈ పండుగకు పూజించే దేవుళ్ల సంఖ్య మనకున్న దేవుళ్ల సంఖ్య కంటే ఎక్కువే. ఆ దేవుళ్లే ఓటర్లు. వాళ్లను పూజించేది ఎలక్షన్స్‌లో పోటీ చేసే నాయకులు. అది కూడా నెల రోజులు మాత్రమే. అయితే.. ఈ ఓట్ల పండుగప్పుడు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పూజలు చేస్తుంటారు అభ్యర్థులు. వాళ్ల దర్శనాలు చేసుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. చివరికి వాళ్ల జేబుల హుండీల్లో డబ్బులు కూడా వేస్తుంటారు.
అన్ని పండుగలకు జనాల డబ్బు ఖర్చు అవుతుంది. కానీ.. ఎన్నికల పండుగకు మాత్రమే ఖర్చు ఉండకపోగా కొందరికి పైసలు వస్తుంటయ్. ఇక ఎన్నికల్లో పోటీచేసే లీడర్ల విషయానికి వస్తే... ప్రారంభోత్సవాలు, ఉత్సవాలు, శంకుస్థాపనలప్పుడు తప్పితే మిగతా రోజుల్లో ప్రజలకు దర్శనమివ్వడం కాస్త కష్టమే. అందరూ ఇలాగే ఉంటారని కాదు. అధికారం ఉన్నా, లేకపోయినా.. ఎప్పుడూ ప్రజల వెన్నంటి ఉండి.. వాళ్ల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించే నాయకులు కూడా ఉన్నారు.
సొంత డబ్బుతో ప్రజలకు మేలు చేసేవాళ్లూ లేకపోలేదు.
ఎలాంటి నాయకుడైనా ఓట్ల పండుగ వస్తుందంటే మాత్రం నాలుగైదు నెలల ముందే హడావిడి మొదలుపెడతాడు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, వీలైతే సాయం చేయడం, మండలాల వారీగా సమస్యలను తెలుసుకోవడం.. లాంటివి చేస్తుంటారు. అందుకోసం భారీగా ఖర్చు చేస్తారు. అంతటితో అయిపోతుందా.. అంటే అది ఆరంభం మాత్రమే ఇంకా ఖర్చు చేయాల్సింది చాలా ఉంది.
ఎలక్షన్స్‌కి ముందు రెండు మూడు నెలల పాటు కార్యకర్తల ఖర్చులన్నీ లీడర్లే పెట్టుకుంటారు. ప్రచారానికి ప్రత్యేకంగా వెహికల్స్ రెడీ చేసుకుంటారు. పార్టీ కండువాల నుంచి జెండాల వరకు అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. ఇవి మాత్రమే గెలుపును తెచ్చిపెడతాయా? కాదు.. చివరి అంకంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడమే అసలైన పని. అందుకోసం ఇవ్వని హామీ అంటూ ఉండదు. కొన్నిచోట్ల ఓటుకు నోటు ఇచ్చి ఓటర్లను తమ బుట్టలో వేసుకుంటారు. అయితే.. చాలా చోట్ల అమ్ముడుపోని ఓటర్లు, ఓట్లు కొనని లీడర్లు కూడా ఉంటారు. అయితే.. ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అలవాటు చేసింది మాత్రం లీడర్లే.
మన దేశంలో పేదలే ఎక్కువ. వాళ్లకు లీడర్లు డబ్బు ఇచ్చినప్పుడు ‘నో’ చెప్పకుండా తీసుకోవడానికి కారణం ఆ పేదరికమే. లీడర్లు ఇచ్చే డబ్బుతో కొన్ని అవసరాలు తీరతాయి అనే ఉద్దేశంతో తీసుకుంటుంటారు. అలాగని అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉందని చెప్పడం లేదు. ఇప్పటికీ పైసా తీసుకోకుండా సరైన లీడర్‌కు ఓటు వేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయానికి వస్తే.. ఇదివరకటితో పోలిస్తే వాళ్లు పెట్టే ఖర్చు ఇప్పుడు చాలా పెరిగింది. ఎన్నికలు మొదలైన రోజుల్లో అంటే 1952 ప్రాంతంలో గెలవాలంటే ఆ అభ్యర్థికి ప్రజాభిమానం ఉంటే చాలు. కానీ, ఇప్పుడు... డబ్బు కూడా ఉండాలి. కోట్లు కుమ్మరిస్తే గానీ.. కుర్చీ దక్కడం లేదు. కండువాలు, జెండాలు కొనడం నుంచి ఓట్లను కొనడం వరకు ఎంతో ఖర్చు చేయాలి. ఈ మధ్య లోకల్ లీడర్ల మద్దతు కోసం కూడా భారీగానే ముడుపులు ముట్టజెప్పుతున్నారు అభ్యర్థులు. ఇంతకీ వీళ్లు డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఈ ఖర్చు ఎంత? దీనికి అంతం ఎక్కడ?
డాటా సమీకరణ
నియోజకవర్గంలో ఏ కులం వాళ్లు ఎంతమంది? ఉన్నారు. వాళ్ల సమస్యలు ఏంటి? నాయకులనుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు జరగాలని కోరుకుంటున్నారు? ఏ ఊళ్లో ఏ నాయకుడి బలం ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో తనకు వ్యతిరేకత ఉంది? వంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఏండ్ల నుంచి ఆ నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రజాభిప్రాయం కూడా మారుతుంటుంది.
అందుకే ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం నాయకులకు చాలా అవసరం. అందుకే నాయకులు ఈ డాటా సేకరించడానికి ప్రత్యేకంగా డాటా టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ టీంతో ప్రత్యేకంగా సర్వే చేయించుకుంటారు. వాళ్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలు సదరు అభ్యర్ధి గురించి ఏమనుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని తీర్చడానికి మార్గాలు ఏమున్నాయి? బలమైన లీడర్లు ఎవరున్నారు? వాళ్ల లూప్‌హోల్స్ ఏంటి? వంటి విషయాల కూపీ లాగుతారు. వాళ్లు తెలుసుకున్న ప్రతి విషయాన్ని రికార్డ్ చేసి అభ్యర్థులకు పంపుతారు. ఆ డాటా ఆధారంగా ఎక్కడ ఎక్కువ ప్రచారం చేయాలి? ఎక్కడ ఓ మాదిరి ప్రచారం చేసినా ఓట్లు పడతాయి? అనేవి బేరీజు చేసుకుని ముందడుగు వేస్తారు. అయితే.. ఈ డాటా సేకరించడం కూడా చిన్న విషయమేమీ కాదు. లక్షల్లో వ్యవహారం. భారీ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రోజు రోజుకూ రిపోర్ట్స్
ఎన్నికల ముందు సర్వే చేయించేందుకే కాకుండా ప్రచారంలో కూడా ఈ టీంను వాడుకుంటున్నారు పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఉదాహరణకు.. ఒక అభ్యర్థి తన ప్రచార రోడ్ మ్యాప్‌ను డాటా టీంకు ముందుగానే పంపుతాడు. దాంతో సదరు అభ్యర్థి ఆ రోజు ఏ ఏ గ్రామాల్లో ప్రచారం చేయాలి అనుకుంటున్నాడో ఆ గ్రామాలకు ముందుగానే డాటా టీం వెళ్తుంది. అక్కడి లీడర్ల గురించి, సమస్యల గురించి తెలుసుకుని అభ్యర్థికి చెప్తారు.
అంతేకాదు.. అభ్యర్థి ఏం మాట్లాడితే ఓట్లు పడతాయనేది కూడా వాళ్లే చెప్తారు. ఆ అభ్యర్ధి ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రచారం ముగిసిన తర్వాత వాళ్లలో ఏమైనా మార్పు కనిపించిందా? లేదా? ప్రచారం వల్ల ఓట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా? లేవా? ఇలాంటి అనేక విషయాలను సర్వే టీం సేకరిస్తుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థికి ఆ డాటా ఇస్తుంది.
ఆ డాటాలో జనాలు పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదు. కానీ.. ఇంకా అభ్యర్థి మీద నెగెటివ్ ఇంప్రెషన్‌తో ఉంటే మరోసారి ఆ ఊరికి ప్రచారానికి వెళ్తాడు. ఓటర్లను నమ్మించడానికి మరికొన్ని ప్రయత్నాలు చేస్తారు. లేదంటే.. ఆ గ్రామంలో ఆపోజిట్‌గా ఉన్న లీడర్‌ను కలుపుకుని పోవడం, ఆకర్షించడం లాంటివి చేస్తుంటారు. ప్రచారం చేసేటప్పుడు డాటా అందడం వల్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే.. దానికోసం చాలా ఖర్చు చేస్తుంటారు.
కమ్యూనికేషన్
ఎమ్మెల్యే క్యాండిడేట్లలో చాలామంది ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి నియోజకవర్గ పార్టీ లీడర్లతో కమ్యూనికేషన్ పెంచుకునేందుకు ఖర్చు పెడుతుంటారు. మండలాల వారీగా మీటింగ్‌లు పెట్టి బలం, బలహీనతలు తెలుసుకుంటారు. నాయకులను పెద్ద హోటల్స్‌కి పిలిపించి పార్టీలు ఇచ్చి, వాళ్ల అవసరాలు తీర్చి లోకల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే.. ఇలా కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల ఎలక్షన్స్ ముగిసే వరకు ఏ ఊరిలో చీమ చిటుక్కుమన్నా అభ్యర్థులకు తెలిసిపోతుంది. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కూడా ఆ లీడర్లకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఓటర్లకు ఏ అంశాలను చెప్పాలి? ఏ అంశాలను కప్పిపుచ్చాలి? అనే విషయాలు ఆ అభ్యర్ధులకు తెలుస్తాయి.
హై–క్వాలిటీ కంటెంట్
ఈ మధ్య అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు, సభలు పెట్టినప్పుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం.. ఆ వీడియోలు మాత్రమే కాదు. వాటి గ్రాఫిక్ డిజైనింగ్ కూడా. ఆ వీడియో కంటెంట్‌ని అందంగా మార్చేందుకు చాలామంది లీడర్లు సెపరేట్‌గా ఒక టీమ్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఆ టీం సభ్యుల్లో కొందరు ప్రచారంలో అభ్యర్థి వెంటే ఉంటూ హై క్వాలిటీ వీడియోలు, ఫొటోలు తీసి, ఎప్పటికప్పుడు ఆఫీస్‌కి పంపుతుంటారు. ఆఫీస్‌లో ఉండే వీడియో ఎడిటర్లు వాటికి మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా ఆ అభ్యర్ధి మీద ఉన్న పాటను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
ఇదంతా చేయడానికి ఒక్కో లీడర్ దగ్గర ఐదు నుంచి పది మంది వరకు పనిచేస్తుంటారు. ఫొటోగ్రాఫర్‌కు 30 వేలు, వీడియో గ్రాఫర్‌కు 50 వేల రూపాయల వరకు ఇస్తున్నారు. వీడియో ఎడిటర్లకు కూడా బాగానే డబ్బులు ముడుతున్నాయి. నాయకుల అభిమానులు, ఫాలోవర్లు వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకునేందుకు, ఇన్‌స్టాలో రీల్స్ పోస్ట్ చేసేందుకు, ఫేస్‌బుక్ పోస్ట్‌ల కోసం కూడా కంటెంట్‌ని క్రియేట్ చేస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా కొందరు కంటెంట్ క్రియేటర్లను ఈ టీంలో చేర్చుకుంటారు. వీళ్లు ఫొటోలకు మంచి క్యాప్షన్స్ రాయడం, కొటేషన్స్ రాయడం లాంటివి చేస్తుంటారు. ఈ పనులతో పాటు మీడియా హౌస్‌లకు వీడియోలు, ఫొటోలు పంపుతుంటారు.
లైవ్ స్ట్రీమింగ్: కొందరు నాయకులైతే ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ సెటప్‌ని కూడా పెట్టుకుంటారు. అందుకోసం హై క్వాలిటీ కెమెరాలతోపాటు లైవ్ స్ట్రీమింగ్ కోసం పూర్తి సెటప్‌ని కొంటారు. వాళ్లు ఎక్కడ సభ పెట్టినా, ప్రచారానికి వెళ్లినా వీడియా రికార్డ్ చేస్తూ.. దాని స్ట్రీమింగ్ లింక్ క్రియేట్ చేసి న్యూస్ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు పంపుతుంటారు. దీని కోసం కొన్ని లక్షలు ఖర్చు చేస్తుంటారు.
పాటల సందడి
ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు పొలిటికల్ పాటలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ తమ గొప్పలను పాటగా పాడిస్తే.. మరో పార్టీ వాళ్ల లోపాలను చెప్తూ.. పాట పాడించింది. ఈ రెండు పాటలు రాష్ట్రం, దేశం దాటి విదేశాల్లోని తెలుగువాళ్లకు కూడా చేరాయి. అక్కడ వాళ్లు కూడా ఈ పాటల మీద డాన్స్‌లు చేస్తున్నారు. ఇది కూడా ప్రచారంలో భాగమే. ఇలా పాటలు పాడించడానికి నాయకులు, పార్టీలు బాగానే ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు పాటల రచయితలను పిలిపించుకుని వాళ్ల పేరుతో పాటలు రాయించుకుంటున్నారు. ఆ పాటలను ఫేమస్ ఫోక్ సింగర్లతో పాడిస్తున్నారు. వీళ్లతోపాటు మ్యూజిక్ డైరెక్టర్లకు.. రికార్డింగ్, ఎడిటింగ్ చేసేవాళ్లకు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు.
కళాకారులకు
ఎన్నికల రోజుల్లో పల్లె ప్రజలకు గుర్తొచ్చేది ఆట, పాట. ఎన్నికల నెల రోజుల ముందు నుంచే ఊరూరా ప్రచార రథాలు తిరుగుతాయి. వాటిపై కళాకారులు డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ.. వాటి ద్వారా క్యాండిడేట్ల గొప్పతనాన్ని వివరిస్తుంటారు. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడంలేదు. ఇలా అందరూ కళాకారుల కోసం చూడడం వల్ల ఆ బృందాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ కళాకారులను రిజర్వ్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా జానపద గాయకులు, డాన్సర్లు, ఆర్కెస్ట్రా, డప్పు కళాకారులు, కోలాటాలు ఆడే మహిళలు, ఒగ్గుడోలు కళాకారులకు డిమాండ్ ఎక్కువ కనిపిస్తోంది. కొన్ని టీంలలో సభ్యులు ఒక్కొక్కరు రోజుకు ఐదు నుంచి10 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. వీళ్లలో రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు తీసుకునే జూనియర్ కళాకారులు కూడా ఉన్నారు. డబ్బుతోపాటు వీళ్లందరి భోజనం, వసతి బాధ్యత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులదే.
కార్యకర్తలు చాలా కాస్ట్‌లీ
పార్టీ కోసం, తనని నమ్ముకున్న నాయకుడి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులు ఇప్పుడు చాలా అరుదు. పైసల కోసం, పరిచయం పెంచుకోవడం కోసం నాయకుల వెంట ఉండే కార్యకర్తలే ఎక్కువ. ఇలాంటి వాళ్లు చాలా కాస్ట్‌లీ. ఎన్నికలు పూర్తయ్యేవరకు వాళ్ల పనులు వదులుకుని నాయకుడి వెంటే ఉన్నందుకు ఒకేసారి ఏక మొత్తంగా కొంత డబ్బు తీసుకుంటారు. అది ఎంతన్నది ఆ కార్యకర్త స్థాయిని బట్టి ఉంటుంది. వాళ్లు ప్రచారానికి వచ్చిన ప్రతి రోజూ.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెట్టిస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రోజుకు150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.
ప్రచార రథాలు, వెహికల్స్
నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి అభ్యర్థులు ప్రత్యేకంగా వెహికల్స్ అద్దెకు తీసుకుంటారు. కొందరు సొంతంగా వెహికల్స్ కొని, వాటికి మార్పులుచేర్పులు చేయిస్తుంటారు. ప్రచార రథాల చుట్టూ ఫ్లెక్సీలు అతికిస్తారు. ప్రతి వెహికల్‌కు ఒక మినీ జనరేటర్, డీజే సౌండ్ సిస్టమ్ ఉంటుంది. వీటన్నింటికీ కలిపి రోజుకు ఒక్కో వెహికల్‌కు ఆరు నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతేకాదు.. అభ్యర్థుల వెంట ఎప్పుడూ ముఖ్య కార్యకర్తలు, సన్నిహితులు ఉంటారు. వాళ్ల కోసం కొన్ని కార్లను అద్దెకు తీసుకుంటారు. లేదంటే.. కార్యకర్తల వెహికల్స్ వాడుకుంటారు. అలా వాడుకుంటే రోజూ ఫ్యుయెల్ కొట్టిస్తారు. అభ్యర్థి వెంట వచ్చేవాళ్ల కోసం ఏర్పాటు చేసిన వెహికల్స్‌తోపాటు అభ్యర్థి కోసం ఊళ్లలో ప్రచారం చేసే చోటా లీడర్ల వాహనాలు, వాళ్ల అనుచరుల బైక్‌ల ఫ్యుయెల్ ఖర్చు కూడా నాయకుడే భరిస్తాడు. ర్యాలీల టైంలో అయితే... వందల సంఖ్యలో కార్యకర్తలు బైక్‌లపై నాయకుడి వెంట నడుస్తారు. అలాంటప్పుడు నాయకుడి వెంటే కాదు.. పెంట్రోల్ బంక్‌ల్లో కూడా వెహికల్స్ ‘క్యూ’ ఉంటుంది. ఒక్కో వెహికల్‌కు వంద రూపాయల నుంచి ఐదొందల రూపాయల వరకు పెట్రోల్ కొట్టించే బాధ్యత ఆ నాయకుడిదే.
ర్యాలీల్లో మందికి గిరాకీ
నాయకుడు ముందు నడుస్తుంటే వెనుక పెద్ద గుంపు వెళ్తుంటుంది. అలా అతని వెంట నడుస్తూ... ‘జై’ కొట్టే వాళ్లలో సగం కంటే ఎక్కువమంది కూలీలే ఉంటారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొంటూ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు రోజూ ఉదయం గ్రామాల్లో ఉన్న తమ పార్టీ లీడర్లకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు. ఆ రోజు ప్రచార పనికి వచ్చిన జనాలకు కూలీ ఇవ్వడం, వారికి భోజనాలు పెట్టించడం, వాహనాల కిరాయి, సాయంత్రం లిక్కర్ దావత్ వంటివన్నీ ఈ డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు.
వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. మరుసటి రోజు పనికి వస్తారో, రారోనన్న అనుమానం ఉన్నచోట అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి మరీ పని చేయించుకుంటున్నారు. అభ్యర్థుల నడుమ ఉన్న పోటీని బట్టి ఒక్కో నియోజవర్గంలో ఒక్కో రేటు నడుస్తోంది. ఇంటింటి ప్రచారానికి వస్తే ఓ రేటు, పెద్ద నాయకుల మీటింగులకు వస్తే ఇంకో రేటు, జనాలను తీసుకొచ్చే వ్యక్తులకు ఓ రేటు, పాదయాత్రలో పాల్గొంటే ఓ రేటు. రాజకీయ పార్టీల ప్రచారానికి వచ్చేవాళ్లకు రోజుకు 200 రూపాయలు. చేతిలో బతుకమ్మతో వస్తే 300 రూపాయలు ఇస్తున్నారు. పెద్ద నాయకుల సభలు, ర్యాలీలకు వస్తే 300 రూపాయలతో పాటు బీరు లేదంటే క్వార్టర్ సీసా పంచుతున్నారు.
ప్రచారానికి 50 నుంచి 100 మందిని పట్టుకొచ్చే టీమ్ ఇంఛార్జ్‌కు రోజుకు రెండు వేల రూపాయలు. అన్ని పనులు నెత్తినేసుకుని ప్రచారం నిర్వహించే వార్డ్ మెంబర్ స్థాయి లీడర్‍కు డైలీ ఐదు వేల రూపాయలు. అయితే.. రిజర్వ్‌డ్ సీట్లలో ఈ రేట్లు కాస్త తక్కువగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ సీట్లలో కోట్లాది ఆస్తులు ఉన్నోళ్లు, వ్యాపారులు, రియల్టర్లు మాత్రమే పోటీలో నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే మండిపోతున్న రేట్లను తట్టుకోవాలంటే మామూలోళ్లకి సాధ్యం కాదు కదా!
చేరికల ఖర్చు
మామూలు ఓటర్లలాగే లోకల్ లీడర్లు కూడా ఏ పార్టీ నాయకుడు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఆ పార్టీలో చేరి ఆ నాయకుడికి ‘జై’ కొడుతున్నారు. దాంతో తమ పార్టీ లీడర్లను కాపాడుకోవడం కోసం, ఇతర పార్టీల నుంచి లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో గత రెండు ఎన్నికలతో పోలీస్తే..ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ లాంటి జనరల్ స్థానాల్లో గట్టి పోటీ ఉన్న వాటిగా చెప్పుకునే నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లకు ఫుల్ డిమాండ్ ఉంది.
పార్టీలు బలమైన లీడర్లకు ఓ రేటు ఫిక్స్ చేసి మార్కెట్‌లో సరుకులా కొంటున్నాయి. 500 నుంచి 700 ఓట్లు ఉండే చిన్న గ్రామాల సర్పంచులు తమ పార్టీలో చేరితే ఐదు లక్షల రూపాయలు.. పెద్ద గ్రామపంచాయతీ అయితే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ కండువా కప్పుకుంటే డిమాండ్ ఆధారంగా 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. టిక్కెట్ ఆశించి రానివాళ్లలో ఐదు వేలకు పైగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న లీడర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు కోటి రూపాయల వరకు ఇస్తున్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండే రెబల్ లీడర్లు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.