జాన్ డీర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని రైతులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే.. అన్ని దేశాల్లో జాన్ డీర్ కంపెనీ తీసుకొచ్చిన ఏదో ఒక పనిముట్టు లేదా మెషిన్ వాడే రైతులు ఉంటారు. అంతలా జనాలకు దగ్గరైన ఈ కంపెనీని స్థాపించింది ఓ సామాన్య కమ్మరి. సొంతూరిలో రైతులకు నాగళ్లు తయారు చేసి ఇచ్చే జాన్ డీర్.. ఆ తరువాత ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు!
అమెరికా, వెర్మోంట్‌లోని రట్లాండ్‌లో 1804 ఫిబ్రవరి 7న పుట్టాడు జాన్ డీర్. 1886 -మే 17న చనిపోయాడు. కానీ.. ఈ మధ్య కాలంలో ప్రపంచం ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే ఎన్నో పనులు చేశాడు. జాన్ తండ్రి విలియం రినాల్డ్ డీర్ ఒక చిన్న మర్చంట్ టైలర్‌గా పనిచేసేవాడు. జాన్‌కి నాలుగేండ్ల వయసులో తండ్రి సముద్రంలో తప్పిపోయాడు. దాంతో జాన్‌ని వాళ్ల అమ్మ పెంచింది.
జాన్ యుక్త వయసుకు రాగానే తల్లిని ఇక మీదట కష్టపెట్టకూడదు అనుకున్నాడు. అందుకే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి, 17 ఏండ్ల వయసులోనే ఒక కమ్మరి దగ్గర శిష్యరికం చేశాడు. నాగళ్లతో సహా అనేక వ్యవసాయ అనుబంధ వస్తువులు తయారుచేయడం నేర్చుకున్నాడు. నాలుగేండ్లలోనే అన్ని పనులు నేర్చుకుని, కొంత డబ్బు సంపాదించి సొంతగా చిన్న దుకాణం పెట్టుకున్నాడు. వ్యవసాయ పనిముట్లు తయారు చేసి ఆ దుకాణంలో అమ్మేవాడు. పనిముట్లు తయారుచేయడంలో అతని స్కిల్స్ వాడి అందరి మెప్పు పొందాడు. అందుకే జాన్ దుకాణం పేరు కొన్నేండ్లలోనే వెర్మోంట్‌లోనే టాప్ దుకాణాల లిస్ట్‌లో చేరిపోయింది.
కొత్త రకం నాగలి
జాన్ ఎప్పుడూ కొత్త రకం నాగళ్లు తయారుచేయడానికి ఎక్స్పరిమెంట్స్ చేసేవాడు. అందుకోసం అప్పటివరకు వాడుతున్న పాత కాలం నాటి నాగలిని అనేక రకాలుగా డెవలప్ చేస్తూ వచ్చాడు. ఒకరోజు ముగ్గురు రైతులు జాన్ దగ్గరకు వెళ్లి ‘‘నువ్వు తయారుచేసిన నాగలి మా భూముల్లో దున్నడానికి సరిపోవడం లేద’’ని చెప్తూ అందులోని సమస్యలను చెప్పారు. ముఖ్యంగా ఆ నాగళ్లు మిడ్‌వెస్ట్ ప్రేరీలోని బంకమట్టిలో వాడేందుకు పనికి రాలేదు. నాగలి కింది భాగానికి మట్టి అతుక్కుపోయి దున్నడం చాలా కష్టం అయింది.
పదే పదే దున్నడం ఆపి, మట్టిని తీయాల్సి వస్తుందని రైతులు చెప్పారు. దాంతో జాన్‌కు వాళ్లు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ.. స్టీలుతో ఒక కొత్త రకం నాగలిని తయారుచేసి ఇచ్చాడు. ఆ నాగలిని వాడిన రైతులు దాని పనితీరుని మెచ్చుకోవడంతో అలాంటి నాగళ్లు మరిన్ని తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా1837లో ఒక కొత్త రకం నాగలి ప్రపంచానికి పరిచయమైంది. అది అమెరికన్ మిడ్‌వెస్ట్ ప్రేరీలో నాగలి దున్నేటప్పుడు అక్కడి బంక మట్టిని నాగలికి అడ్డుపడకుండా చేయగలిగింది.
ఆ మరుసటి ఏడాది దానికే చిన్న మార్పులు చేసి మరోటి తయారు చేశాడు. ఆ నాగలి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వందలాది మంది రైతులను ఒక పొలం దగ్గరికి తెచ్చి, నాగళ్లతో దున్ని డెమో ఇచ్చాడు. నాగలికి మట్టి అంటుకోకపోవడంతో దాన్ని కొనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. 1839లో 10 నాగళ్లు, 1840లో ఏకంగా 40 నాగళ్లు తయారు చేశాడు. ఈ నాగలి గురించి చుట్టుపక్కల తెలియడంతో దానికి డిమాండ్ బాగా పెరిగింది. దాంతో1846 నాటికి వార్షిక ఉత్పత్తి వెయ్యి నాగళ్లకు చేరుకుంది.
కంపెనీ
నాగళ్లకు బాగా డిమాండ్ పెరగడంతో డీర్ 1847లో ఒక చిన్న కంపెనీ పెట్టి ఉత్పత్తిని పెంచాలి అనుకున్నాడు. 1848లో డీర్ మిస్సిసిపీ నదికి తూర్పు ఒడ్డున ఉన్న ఇల్లినాయిస్‌లోని మోలిన్‌లో ఒక కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. ఈ యూనిట్‌లో ప్రొడక్షన్ కోసం వాడేందుకు పక్కనే ఉన్న నది నీళ్లని వాడాడు. ముడి పదార్థాలను తీసుకురావడానికి, నాగళ్లను మార్కెట్‌కు చేర్చడానికి రివర్ బోట్లను వాడుకున్నాడు. ఆ నాగలికి వాడే స్టీల్ ప్లేట్ క్వాలిటీని ఇంకాస్త మెరుగుపర్చడానికి పిట్స్‌బర్గ్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు.
దాంతో నాగలికి ఇంకా డిమాండ్ పెరిగింది.1857 నాటికి డీర్ కంపెనీ ఏటా10 వేల నాగళ్లను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత నాగలితోపాటు అనేక రకాల పరికరాలను తయారుచేయడం మొదలుపెట్టారు. అందులోభాగంగా హాకీ రైడింగ్ కల్టివేటర్‌ని మార్కెట్‌లోకి తెచ్చారు. దీన్ని గుర్రాలకు కట్టి వాడేవాళ్లు. దీన్ని మొదటగా1863లో అయోవా స్టేట్ ఫెయిర్‌లో ప్రవేశపెట్టారు. 1868లో కంపెనీకి ‘డీర్ అండ్ కంపెనీ’ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్ డీర్1873లో మోలిన్ సిటీకి రెండో మేయర్‌గా ఎన్నికయ్యాడు. అప్పటికే ఎంతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన 1886లో చనిపోయాడు. ఆ తర్వాత అతని వారసులు కంపెనీని డెవలప్ చేశారు.
అదే జోరు
జాన్ డీర్ చనిపోయాక కూడా కంపెనీ డెవలప్మెంట్ ఆగలేదు. అతని రెండో కొడుకు చార్లెస్ డీర్ కంపెనీకి1886 నుంచి ఛైర్మన్‌గా పనిచేశాడు. చార్లెస్ వ్యాపారాన్ని విస్తరించడానికి కన్సాస్ సిటీలో మరో బ్రాంచ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత కంపెనీ జాన్‌డీర్ అల్లుడు విలియం బటర్‌వర్త్ చేతిలోకి వెళ్లింది. ఈయన సారధ్యంలో కంపెనీ తక్కువ కాలంలోనే బాగా డెవలప్ అయ్యింది.
1912లో కంబైన్ హార్వెస్టర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.1918లో వాటర్‌లూ ఇంజిన్ గ్యాస్ కంపెనీ కొని ట్రాక్టర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినవాళ్లు కూడా కంపెనీని సమర్థవంతంగా నడిపారు. 1960,70ల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పనిముట్లలో పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా డీర్ అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. కంపెనీని విస్తరిస్తూ.. -జెయింట్ ట్రాక్టర్లు , బేలర్లు, విత్తనాలు, కోత యంత్రాలు.. లాంటివి తెచ్చారు.
టెక్నాలజీ
కంపెనీలో టెక్నాలజీ వాడకం కూడా పెంచుకుంటూ వచ్చింది. డీర్ కంపెనీ1981లో అయోవాలో 1.5 బిలియన్ల అమెరికన్ డాలర్లతో ఒక ఫ్యాక్టరీ పెట్టింది. అందులో కంప్యూటర్లు, రోబోల వాడకం బాగా పెంచింది. ఆ తర్వాత కూడా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూనే ఉంది. కొన్ని దేశాల్లో అధునాతన వెహికల్స్‌ని అందుబాటులోకి తెచ్చింది.
2022 జనవరిలో కంపెనీ వార్షిక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్‌ను పరిచయం చేసింది. ఇది చిన్న తరహా వ్యవసాయం కోసం తయారుచేసిన ట్రాక్టర్. ఇవే కాదు.. ఈ కంపెనీ తెచ్చిన చాలా వెహికల్స్‌లో అధునాతన టెక్నాలజీని వాడింది. దానివల్ల పార్ట్స్ రీప్లేస్ చేయడానికి జాన్‌డీర్‌కు మాత్రమే యాక్సెస్ ఉంది. యజమానులు, థర్డ్ పార్టీ మెకానిక్‌లు రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. కొన్ని వెహికల్స్‌కు రిమోట్ లాకింగ్ కూడా ఉంది. 2022 రష్యా ఉక్రెయిన్ దాడి సమయంలో రష్యన్ దళాలు ఉక్రేనియన్ వ్యవసాయ పరికరాలను దొంగిలించాయి. అయితే పరికరాలను అమ్మిన డీలర్లు వాటిని రిమోట్‌గా లాక్ చేసేశారు.
ఎన్నో పరికరాలు
ప్రస్తుతం కంపెనీ వివిధ రకాల పరికరాలు, వెహికల్స్‌ని మార్కెట్‌లోకి తెచ్చినా ఇప్పటికీ కంపెనీ ఆదాయంలో 73 శాతం వ్యవసాయ ఉత్పత్తుల నుంచే వస్తోంది. 18శాతం నిర్మాణ, అటవీరంగ పరికరాల మీద వస్తుంది. కంపెనీ ప్రస్తుతం టర్ఫ్, యుటిలిటీ, పంట కోత, ఎండుగడ్డి, మేత, ట్రాక్టర్లు లాంటి అనేక రకాల పరికరాలు, వెహికల్స్‌ని అందుబాటులోకి తెచ్చింది.
ముఖ్యంగా ఈ కంపెనీ తెచ్చిన పత్తి హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, బేలర్లు, సైలేజ్ మెషిన్లు, స్ప్రేయర్లు, ప్లాంటర్లు, సీడర్లు, ఎక్స్‌కవేటర్లు, లోడర్లు, బ్యాక్‌హోలు, ట్రాక్డ్ లోడర్లు, స్కిడ్ స్టీర్లు, గ్రేడర్లు, ఫార్వార్డర్లు, స్కిడర్లు, స్నో త్రోయర్స్, లాన్ మూవర్స్, డీజిల్ ఇంజన్లు, పవర్ ట్రైన్‌లు, స్నో మొబైల్స్, ఆల్–టెరైన్ వెహికల్స్, గేటర్స్, డోజర్లు, లాగ్ స్కిడర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అంతేకాదు.. దాని జాన్ డీర్ క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ విభాగం ఏర్పాటు చేసి ఆర్థిక సేవలు కూడా అందిస్తోంది.
వంద దేశాల్లో...
ఒక చిన్న టౌన్‌లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు చేస్తోంది. అమెరికా, టర్కీ, స్పెయిన్, మెక్సికో, ఇటలీ, ఇండియా, రష్యా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అర్జెంటీనాతో సహా ప్రపంచవ్యాప్తంగా15 దేశాల్లో 20 వేర్ హౌజింగ్ లొకేషన్లు(డీర్ ప్లాంట్లు) ఉన్నాయి. ప్రపంచంలోని100 దేశాల్లో 700 ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాళ్ల కింద అనేకమంది డీలర్లు ఉన్నారు.
నిలిచి గెలిచింది
కంపెనీ జర్నీ మొదలై ఇప్పటికి 187 ఏండ్లు గడిచింది. ఇన్నేండ్లలో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా.. వాటన్నింటినీ తట్టుకుని నిలిచి గెలిచింది. ఆర్థిక మాంద్యం టైంలో కంపెనీ ఎన్ని నష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడింది. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. డీర్ అండ్ కంపెనీ మాత్రం సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంది.