దళితబంధుపై ఎంక్వైరీ.. యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో?

  • యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో? 
  • లేదో? గుర్తించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • అవి వేరే వాళ్ల దగ్గరుంటే, తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి 
  • వారంలోగా ఊర్లన్నీ తిరిగి వివరాలు సేకరించండి 
  • దళితబంధు దారిమళ్లితే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరిక 
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పథకం అమలుపై సమీక్ష 

మధిర/ముదిగొండ, వెలుగు: దళితబంధు దారిమళ్లితే ఊరుకునేది లేదని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. దళితబంధు కింద మంజూరైన యూనిట్లు దారిమళ్లితే, వారంలోగా తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. దళితబంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందని అన్నారు. 

మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండల కేంద్రంలో శనివారం దళితబంధు అమలుపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. దళితబంధు పథకానికి చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపికైందని ఆయన చెప్పారు. 

‘‘స్పెషల్ ఆఫీసర్లు అన్ని గ్రామాల్లో పర్యటించి, దళితబంధు కింద లబ్ధి పొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలి. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అవి దారిమళ్లాయా? అనేది గుర్తించాలి. ఒకవేళ ఎవరైనా ఇతరులకు అమ్మినా, బదిలీ చేసినా.. వాటన్నింటినీ వారంలోగా గుర్తించి, తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి” అని ఆదేశించారు. 

దళితబంధు కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని చెప్పారు. లబ్ధిదారులు స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైతే ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేస్తామని తెలిపారు. చింతకాని మండలం శ్యాచురేషన్ పద్ధతిలో ఎంపిక కాగా.. నియోజకవర్గంలో మరో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని, వారి వివరాలను వారంలోగా సేకరించాలని ఆదేశించారు. 

బర్రెలు, గొర్రెలు ఏమైనయ్? 

దళితబంధు కింద మంజూరైన బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవుల యూనిట్లు ఏమయ్యాయని అధికారులను భట్టి ప్రశ్నించారు. ‘‘లబ్ధిదారులు వాటిని అమ్ముకున్నారా? లేదంటే చనిపోయాయా? చనిపోతే ఇన్సూరెన్స్ ఇప్పించారా? ఇన్సూరెన్స్ చేయించడం, ఇప్పించడం అధికారుల బాధ్యత” అని అన్నారు. దళితబంధు కింద లబ్ధిదారులకు ఇచ్చిన జేసీబీలు, ట్రాలీలను ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ పనులలో ఉపయోగించాలని... వాటి ఓనర్లు, కాంట్రాక్టర్లకు మధ్య అధికారులు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని సూచించారు. 

 ‘‘పథకం ఎలా అమలవుతున్నదన్న సమాచారం స్పెషల్ ఆఫీసర్ల వద్ద లేదు. లబ్ధిదారులు తమ యూనిట్లను ఎలా ఉపయోగించుకుంటున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు కలెక్టర్ కు అధికారులు అందించాలి. దళితబంధు యూనిట్లు కచ్చితంగా లబ్ధిదారుల వద్దే ఉండాలి. వాళ్లే వ్యాపారం చేయాలి” అని అన్నారు. 

మహిళలకు 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు.. 

రాష్ట్రంలోని మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని భట్టి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం మధిరలోని ముదిగొండలో శనివారం పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని చెప్పారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు బర్రెలు ఇచ్చి, వారిని పాడి పరిశ్రమలో వాటాదారులను చేస్తామన్నారు. 

దారిమళ్లితే చర్యలు తీసుకుంటం: కలెక్టర్ 

చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులు ఉన్నారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. వీరిలో 1,888 మంది లబ్ధిదారులకు వంద శాతం లబ్ధి చేకూరగా.. మిగిలిన 1,574 మందికి మొదటి దఫా యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ చేశామని చెప్పారు. మొదటి దఫా యూనిట్ల మొత్తం పోనూ రూ.28 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో, రూ.2 కోట్లు బర్రెలు, గొర్రెల యూనిట్ల కొనుగోలు కోసం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఖాతాలో నిల్వ ఉన్నాయని వెల్లడించారు.

 ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి.. మంజూరైన యూనిట్లపై వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. దళితబంధు పథకం దారిమళ్లితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.