నీట్​లో దక్షిణాదికి అన్యాయం

నీట్ పరీక్ష ఆఫ్ లైన్లో జరుగుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని పేపర్ లీక్ పరీక్ష కేంద్రాల్లో వైద్యవిద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రం లీకవ్వడం, ఇన్విజిలేటర్స్ సహాయం చేయడం వంటి అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనివల్ల ఆల్ ఇండియా కోటాలో దక్షిణ రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని వైద్యవిద్య నిపుణులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

భా రతదేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలో అర్హత కోసం ప్రతి యేటా నిర్వహిస్తున్న నీట్ పరీక్ష వల్ల గత ఐదేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మోసపోతున్నట్టుగా అనేక లోపాల మూలంగా  అనుమానాలు ఉన్నాయి. అది ఎలాగంటే, ఐదేళ్ల నీట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలను గమనిస్తే 2018 లో 13.26 లక్షల అభ్యర్థులు నీట్ కు నమోదు చేసుకోగా, 2024 లో 24.06 లక్షల అభ్యర్థులు నీట్ పరీక్షకి నమోదు చేసుకున్నారు. గత రెండు మూడు ఏళ్లుగా టాప్ 100 లోపు ర్యాంకులో ఉత్తరాది విద్యార్థుల కంటే దక్షిణాది వారు తక్కువ ఉన్నారు. ఉదాహరణకి ఈ ఏడాది టాప్ 100 జాబితా చూస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తక్కువ కనిపించేవారు కాదని టాప్ 100 లో తెలుగు వారు ఎక్కువగా ఉండేవారని వైద్యవిద్య నిపుణులు చెప్తున్నారు. ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లు ఉంటాయి ఎక్కువ స్కోరు చేసిన వారికే ఎయిమ్స్ లోను ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కే అవకాశం ఉంటుంది. ఈసారి ఉత్తరాది వారే ఎక్కువగా నీట్ లో స్కోరింగ్ చేశారు. అందువల్ల ఆల్ ఇండియా కోటా సీట్లలో మెజారిటీగా ఉత్తరాది వారికి లభించాయనే వాదన వినిపిస్తున్నది. 

నీట్​ రాసే ఉత్తరాది విద్యార్థుల సంఖ్య పెరిగింది

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నీట్ రాసే విద్యార్థుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో రెట్టింపు అయింది. ఆయా రాష్ట్రాల నుంచి 2018లో 4,78,255 మంది నీట్ కు హాజరు కాగా, 2024 లో అవే రాష్ట్రాల నుంచి 11,57,180 మంది నీట్ రాశారు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ పదేళ్లలో వైద్య కళాశాలలు పెరిగాయి కానీ నీట్ రాసే విద్యార్థుల సంఖ్య  ఉత్తరాది రాష్ట్రాల స్థాయిలో పెరగలేదు. 2018లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 4,24,523 మంది నీట్ కు హాజరు కాగా 2024 నాటికి ఆ సంఖ్య 5,82,845 పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా 2018 నాటికి 499 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో 70012 ఎంబీబీఎస్​ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో 1,08,940 సీట్లు ఉన్నాయి. 

ఒకప్పుడు తెలుగు విద్యార్థులదే హవా!

మరొక కీలక అంశం ఏమిటంటే, జూన్ 18వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజైన జూన్ 4వ తేదీన విడుదల చేయడం పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హడావిడిగా లోక్ సభ ఫలితాల రోజున నీట్ ఫలితాలు వెల్లడించారని ఆరోపణలు వస్తున్నాయి. మెడిసిన్ ర్యాంకులు అంటే రెండు మూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల విద్యార్థులే హవా ఉండేది, కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఆల్ ఇండియా టాప్ 100 జాబితాలో  దక్షిణాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. నీట్ పరీక్ష ఆన్ లైన్లో జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోరని అనేకమంది వైద్యవిద్య నిపుణులు చెప్తున్నారు. 

ప్రధాని స్పందించకపోవడం..

పరీక్షలు ఏ విధంగా రాయాలో విద్యార్థులు భయపడకుండా ఎలా పరీక్షలని ఎదుర్కోవాలో పరీక్షా పే చర్చ పెట్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 24 లక్షల విద్యార్థులకు సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ విషయంలో స్పందించకపోవడం బాధాకరమైన అంశం. ఏది ఏమైనా భవిష్యత్తులో అయినా భారతదేశంలోని వైద్యవిద్యకు సంబంధించిన అర్హత పరీక్షను సమర్థవంతంగా నిర్వహించి, మన దేశ అంతర్గత విషయాలని బలహీనం చేసుకోకుండా దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు గొప్పగా చాటిచెప్పుకునేలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

టాప్​100లో దక్షిణాది వారు తగ్గుతున్నారెందుకు?

ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లోని కాలేజీలు, సీట్లు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 270 మెడికల్ కాలేజీలు ఉండగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 436 వైద్య కళాశాలలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం మెడికల్ కాలేజీల్లో 38% దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక సీట్ల విషయానికొస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో 43,525 సీట్లు ఉండగా, మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 65,415 సీట్లున్నాయి. గడచిన మూడేళ్లుగా దక్షిణాదికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నీట్ టాప్ 100 జాబితాలో తగ్గుతూ వస్తున్నారు. గతంలో టాప్ 100 లో మనోళ్లు కనీసం 25 లేదా 30 మంది ఉండేవారు. నిరుడు 687 పైగా మార్కులు సుమారు 1000 మంది సాధించగా, అందులో 40 మంది మాత్రమే తెలుగువారు ఉన్నారు. ఈసారి 687 పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య దాదాపు ఏడువేలు, అంటే ఏడు రెట్లు పెరిగింది.

ఒకే పరీక్ష కేంద్రం నుంచి 8 మంది టాపర్స్​!

నీట్​ రాసే కొందరి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు తీసుకొని 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ చేసినట్టుగా అనేక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో  వార్తలు వచ్చాయి. నీట్ పరీక్షలో నాలుగు పాఠ్యాంశాల్లో 200 ప్రశ్నలకుగాను 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. 2024లో ఎన్డీఏ నిర్వహించిన నీట్ పరీక్షలో 720 మార్కులకి 720 మార్కులు 67 మంది సాధించారు. అందులో అత్యధిక మార్కులు వచ్చిన వారిలో 8 మంది ఒకే పరీక్షాకేంద్రంలో పరీక్షరాశారు. అందులోనూ ఆరుగురు ఒకే గదిలో పరీక్ష రాయడం అనుమానాలకి దారి తీస్తోంది. 1563 మంది విద్యార్థులకు సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల పరీక్ష సమయం తగ్గిందని అందుకు పరిహారంగా గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. పరీక్ష సమయం తగ్గితే పరిహారంగా అదనపు సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా గ్రేస్ మార్కులు కలపడంతో పెద్ద వివాదానికి దారి తీసినట్లయ్యింది.

 

- పుల్లెంల గణేష్, ధర్మ సమాజ్ పార్టీ, 
(స్టడీ & రీసెర్చ్ టీంరాష్ట్ర ఇన్​చార్జ్​)