డిసెంబర్ 9న భూ పంపిణీ..త్వరలో భూమాత అమలు : మంత్రి పొంగులేటి

  • ఆర్ఓఆర్ చట్టంలోని తప్పులను సరిచేస్తం
  • పైలెట్ ప్రాజెక్ట్ గా తిరుమలగిరి సాగర్ మండలం 
  • ఇక్కడి సక్సెస్​తో రాష్ట్రం మొత్తం విస్తరిస్తం
  • నెలాఖరులోపు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేస్తామని వెల్లడి

నల్గొండ, వెలుగు : వచ్చే డిసెంబర్ 9 న పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే భూ మాతను తీసుకువచ్చి భూమి విషయంలో రైతుకు ఎలాంటి భయం లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. శనివారం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్లి గ్రామంలో నిర్వహించిన భూమాత సర్వే పైలెట్ ప్రాజెక్టు స్కీమ్​లో భాగంగా మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ సి. నారాయణరెడ్డితో కలిసి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పులను సరిచేసి దేశానికే రోల్ మోడల్​గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ ) చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. తిరుమలగిరి సాగర్ మండలంలో ధరణి తో అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు గానూ ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని చెప్పారు. ఇక్కడి సక్సెస్ తో రాష్ట్రం అంతా విస్తరిస్తామని తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. 

ధరణి పోర్టల్​తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలాడిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఎన్నికల ప్రచారం లో రేవంత్​రెడ్డి చెప్పారని, ఈ క్రమంలోనే ఇప్పుడు 2020 చట్టాన్ని సవరిస్తూ ఆర్ఓఆర్ చట్టాలు అమలు  చేస్తామని చెప్పారు. తిరుమలగిరి సాగర్ మండలం లో 4,300 ఎకరాల్లో 1,300 మంది రైతులకు  పట్టాలు ఉన్నా భూమి లేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అటవీ భూములు అధికంగా ఉన్నాయని, అసలు రైతులకు  న్యాయం జరగడం లేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. 

అటవీ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య  వివాదం ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామని, గత  ప్రభుత్వ తప్పిదాల వల్లే భూమి లేకున్నా  పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుబంధు  పొందారని అన్నారు. గతంలో తెచ్చిన 2020 రెవిన్యూ చట్టం, ధరణితో  రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. 2020 చట్టాన్ని, అలాగే ధరణిలోని  తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ  చట్టాలను పరిశీలించి 

మేలైన  చట్టం తీసుకొచ్చేందుకు  ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్​లో ఉంచిందని తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, ప్రజలకు అనువైన ఆర్ఓఆర్ చట్టం అమలు చేస్తామని, ఈ చట్టాల విషయంలో ప్రతిపక్ష  పార్టీల సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని చెప్పారు.

అర్హులందరికీ  సీఎం చేతులమీదుగా భూమి

అర్హులైన పేదవారికి  ప్రభుత్వ భూములు అందాలన్నదే సర్కారు లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి, ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని వెల్లడించారు. తిరుమలగిరి సాగర్​లోని 3,500 నుంచి 4  వేల ఎకరాలు అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. తిరుమలగిరి సాగర్​లో కొంతమంది పొజిషన్ ‌‌లో ఉన్నప్పటికీ పట్టాలు లేవని, పట్టాలున్న వారికి భూమిలేదని

అలాగే ఎవాక్యువేషన్ ప్రాపర్టీకి సంబంధించి, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత  సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. తిరుమలగిరి సాగర్​లో సుమారు 13 వేల ఎకరాలకు బోగస్  పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వాస్తులన్నీ పేదవాడికి చెందాలని, పేదవాడికి చెందేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

సాగర్​కు 5 వేల ఇందిరమ్మ ఇండ్లు

గతంలో చెప్పినట్లుగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, నెలాఖరు లోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు  మొదటి విడత 3,500  చొప్పున  ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై గృహనిర్మాణ శాఖలో హక్కు పత్రాలు పెండింగ్​లో ఉన్నాయని

ఆ పెండింగ్​ను క్లియర్ చేసి లబ్ధిదారులంద రికీ ఆ హక్కు పత్రాలు ఇచ్చేలా గృహ నిర్మా ణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీలకు అధికారం లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి పొంగులేటి అన్నారు.