వెలుగు సక్సెస్: రాష్ట్రాల ఏర్పాటు

స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలోని 11 రాష్ట్రాలు, నాలుగు చీఫ్​ కమిషనరేట్​ ప్రాంతాలు, విలీనమైన 554 సంస్థానాలను కలుపుతూ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చేశారు. 1950లో రాజ్యాంగం అమలు నాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు. గతంలో బ్రిటీష్​ పాలిత ప్రాంతాలుగా ఉన్న వాటిని పార్ట్​ ఏ రాష్ట్రాల విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. ప్రత్యేకమైన శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను పార్ట్​ బి రాష్ట్రాల జాబితాలో చేర్చారు.

వీటి సంఖ్య 9. కొన్ని స్వదేశీ సంస్థానాలు, గతంలో చీఫ్​ కమిషనరేట్​ ప్రాంతాలు ఉన్న వాటిని పార్ట్​ సి రాష్ట్రాల జాబితాలో చేర్చారు. వీటి సంఖ్య 10. అండమాన్ నికోబార్​ దీవులను పార్ట్​ డి రాష్ట్రాల జాబితాలో చేర్చారు. అయితే, దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, వివిధ రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని భారత భూభాగాన్ని పరిపాలన సౌలభ్యం కోసం సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై కచ్చితమైన సూచనలు చేయడానికి 1953, డిసెంబర్ 22న జవహర్​లాల్​ నెహ్రూ ప్రభుత్వం ఫజల్​ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్​ నియమించింది. 


రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్​ 1955లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 1956లో రాష్ట్ర పునర్​వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్​ ఆమోదిస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 

15వ రాష్ట్రం గుజరాత్​

1960లో బొంబాయి రాష్ట్రాన్ని విభజిస్తూ గుజరాతీ భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్రను కలుపుతూ గుజరాత్​ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో మరాఠా ప్రాంతం మరాఠీయులకే చెందాలని కోరుతూ గుజరాత్​ భాష మాట్లాడే వారిని వేరు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1960లో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. బొంబాయి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మరాఠీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బొంబాయిని మహారాష్ట్రగా పేరు మార్చారు. 

16వ రాష్ట్రం నాగాలాండ్​

అస్సాం రాష్ట్ర పరిధిలోని నాగాలు తమ నాయకుడైన ఏపీ పిజో నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాన్ని నిర్వహించారు. 1962లో అస్సాం పరిధిలో అసోసియేటెడ్​ స్టేట్​ (సహరాష్ట్ర) ప్రతిపత్తిని కల్పించినా నాగాలు సంతృప్తి చెందకపోవడంతో  1963లో అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తూ నాగా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ నాగాలాండ్​ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 

17వ రాష్ట్రం హర్యానా

1966లో పంజాబ్​ రాష్ట్రాన్ని పునర్​వ్యవస్థీకరణ చేశారు. మాస్టర్​ తారాసింగ్​, సంత్​ఫతేసింగ్​ల నేతృత్వంలో పంజాబ్​ రాష్ట్రం పంజాబీయులకే(సిక్కులు) మాత్రమే చెందాలని, హిందీ మాట్లాడే వారిని వేరు చేయాలని ఉద్యమం జరిగింది. షా కమిషన్​ సూచనలు అనుసరించి 1966లో హిందీ మాట్లాడే వారి కోసం హర్యానా పేరుతో 17వ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. పంజాబ్​, హర్యానాలకు ఉమ్మడి రాజధాని చండీగఢ్​ అయినందున దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్​కు చెందిన కొన్ని కొండ ప్రాంతాలను హిమాచల్​ప్రదేశ్​​లో చేర్చారు. 

18వ రాష్ట్రం హిమాచల్​ప్రదేశ్​

1956లో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన హిమాచల్​ప్రదేశ్​, బిలాస్​పూర్​ ప్రాంతాన్ని కలిపి 1971లో హిమాచల్​ప్రదేశ్​ను 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 

19, 20, 21వ రాష్ట్రాలుగా మణిపూర్​, త్రిపుర, మేఘాలయ

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన మణిపూర్​ను 19వ రాష్ట్రంగా, త్రిపురను 20 వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతోపాటు అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తూ కొంత భాగాన్ని వేరు చేసి మేఘాలయ 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అస్సాం రాష్ట్రాన్ని పునర్​వ్యవస్థీకరణ చేసే ఈ సందర్భంలోనే అరుణాచల్​ప్రదేశ్​, మిజోరాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. 

22వ రాష్ట్రం సిక్కిం

1975లో సిక్కిం భారతదేశంలో విలీనం జరిగేంత వరకు చోగ్యాల్​ అనే రాజవంశీకుల పరిపాలనలో ఉండేది. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని అనుసరించి సిక్కింను భారతదేశంలో సహరాష్ట్రంగా (అసోసియేటెడ్​ స్టేట్​) విలీనం చేస్తూ దీనికోసం ప్రత్యేకంగా 10వ షెడ్యూల్​ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల నుంచి వచ్చిన విమర్శలు, సలహాలు, సూచనలను ఆధారంగా చేసుకొని 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేసి మొదటి షెడ్యూల్​లో చేర్చారు. 

23వ రాష్ట్రం మిజోరం 

1972లో అస్సాం నుంచి వేరుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన మిజోరంను రాజీవ్​గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరానికి రాష్ట్రప్రతిపత్తిని కల్పిస్తూ 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

24వ రాష్ట్రం అరుణాచల్​ప్రదేశ్​

మిజోరంతోపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన అరుణాచల్​ప్రదేశ్​ను 1986–87లో రాజీవ్​గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తూ 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 

25వ రాష్ట్రం గోవా

1961లో ఆపరేషన్ విజయ్​ పేరుతో పోర్చుగీసువారి నుంచి విముక్తం చేసిన గోవా, డయ్యూ డామన్​లను 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1987లో 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. కానీ డయ్యూ డామన్​లను కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగిస్తున్నారు. 

ఎన్​డీఏ హయాంలో 3 రాష్ట్రాలు

2000లో ఎన్​డీఏ ప్రభుత్వ కాలంలో జరిగిన రాష్ట్రాల పునర్​ వ్యవస్థీకరణ ద్వారా మన దేశంలో మూడు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్​ప్రదేశ్​లోనూ బిహార్​లోనూ మధ్యప్రదేశ్​లోనూ జరిపిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని ఈ మూడు రాష్ట్రాలను వాజ్​పేయీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఛత్తీస్​గఢ్​: మధ్యప్రదేశ్​ పునర్​వ్యవస్థీకరణ ద్వారా నవంబర్​ 1న ఏర్పడింది.

ఉత్తరాంచల్: ఉత్తర్​ప్రదేశ్​ పునర్​వ్యవస్థీకరణ ద్వారా నవంబర్​ 9న ఏర్పడింది.

జార్ఖండ్: బిహార్​ పునర్​వ్యవస్థీకరణ ద్వారా నవంబర్​ 15న (సంతాలీలు ఎక్కువగా ఉన్న చోటానాగ్​పూర్​ ప్రాంతం జార్ఖండ్​) ఏర్పడింది.

29వ రాష్ట్రం తెలంగాణ

1956లో రాష్ట్రాలను పునర్​వ్యవస్థీకరణ చేసే సందర్భంలో తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్​గా ఏర్పాటు చేసిన నాటి నుంచి అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని అనేక ఉద్యమాలు నిర్వ హించారు. 1969లో మర్రిచెన్నారెడ్డి నేతృత్వంలో అతి పెద్ద ఉద్యమం తెలంగా ణ కోసం జరిగింది. కానీ ఇందిరాగాంధీ తన రాజకీయ చతురతతో ఆ ఉద్యమం మధ్యలోనే ముగిసింది. 2001 తర్వాత జరిగిన మలిదశ ఉద్యమంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014, జూన్​ 2న తెలంగాణ రాష్ట్రాన్ని 29 వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 

370వ అధికరణ రద్దు: నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం జమ్ము కశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. 370 అధికరణలోని మూడో క్లాజ్​ను అనుసరించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆర్డినెన్స్​ ద్వారా రద్దు ప్రకటన చేశారు.  2019లో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్​కు గల రాష్ట్ర హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసినందున ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి.