నిజాం కాలంలో నిర్మాణాలు

ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలంలో హైదరాబాద్​ నగరంలో ఎన్నో నిర్మాణాలను చేపట్టారు. వీటిలోని చాలా భవనాలు నేటికీ ఆఫీస్​ కార్యాలయాలుగా, హాస్పిటల్స్​​గా సేవలు అందిస్తున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్​ చేపట్టిన నిర్మాణాల్లో దివాన్ దేవిడి, కింగ్​ కోఠి, ఉస్మానియా హాస్పిటల్,​ మొజంజాహీ మార్కెట్​, ఈఎన్​టీ హాస్పిటల్​, రాష్ట్ర హైకోర్టు భవనం, చిరాన్​ ప్యాలెస్​, అజాఖాన్​ ఇ జహ్ర, యునాని హాస్పిటల్​, పత్తర్​గట్టి, బెల్లావిస్టా ముఖ్యమైనవి. పోటీ పరీక్షల దృష్ట్యా ఈ నిర్మాణాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

మొజంజాహీ మార్కెట్​:  దీనినే ఎంజే మార్కెట్​ అని కూడా పిలుస్తారు. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ చిన్న కుమారుడు ప్రిన్స్ మొజంజా బహదూర్​ పేరిట మొజంజాహీ మార్కెట్​ను 1935లో పూర్తి చేశారు. ఈ మార్కెట్​ను గ్రానైట్​ స్టోన్​ బూడిద రంగు రాయితో నిర్మించారు. 

దివాన్​ దేవిడి : దివాన్​ దేవిడి అంటే ప్రధాని అధికార నివాసం. అసఫ్​జాహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన పలువురు ప్రధాన మంత్రుల అధికార నివాసంగా దివాన్​ దేవిడి ఉండేది. ఇందులో ఐనాఖానా, లఖడ్​ కోట, చీనాఖానా, నిజాంభాగ్​, నూర్​ మహల్​ వంటి అందమైన భవనాలు ఉండేవి. సాలార్​జంగ్​–1, సాలార్​జంగ్​–2లు సేకరించిన అనేక కళారీతులను మొదట దివాన్​ దేవిడిలోనే ప్రజా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. బర్మాటేకుతో చేసిన లక్కడ్​ కోట భవన సముదాయం, నిలువెత్తు అద్దాలు, షాండిలియర్లు కలిగిన ఐనాఖానా హాలు మొదలైన వాటిని అద్భుతంగా నిర్మించారు. 

ఉస్మానియా హాస్పిటల్​: మూసీ నదీ తీరంలో 1866లో రెండు అంతస్తుల హాస్పిటల్​ భవనాన్ని నిర్మించి, అత్యంత ఆధునిక వైద్య సేవలు అందించేవారు. ఆ కాలంలో ఈ హాస్పిటల్​ను అఫ్జల్​గంజ్​ దవాఖానా  అని పిలిచేవారు. 1908లో మూసీనది వరదల తాకిడికి ఈ భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఏడో నిజాం 1920లో తిరిగి అదే ప్రాంతంలో హాస్పిటల్​ కోసం కొత్త భవనాన్ని నిర్మించాడు. ఇది 1925లో పూర్తయింది. అప్పటి నుంచి ఈ హాస్పిటల్​ను ఉస్మానియా హాస్పిటల్​గా పిలుస్తారు. 

ఈఎన్​టీ హాస్పిటల్​: ప్రస్తుత ఈఎన్​టీ హాస్పిటల్​ భవనాన్ని ప్రఖ్యాత పార్సీలు బ్యాంకింగ్ రంగంలో నిష్ణాతులైన పెస్తోజీ అండ్​ కంపెనీ అవసరాల కోసం నిర్మించారు. 1839–45 మధ్యకాలంలో పెస్తోజీ కంపెనీ వారు నిజాం ప్రభువుల రెవెన్యూ రికార్డులు, లెక్కలు పరిశీలించేవారు. పెస్తో​జీ నిర్మించిన ప్రస్తుత ఈఎన్​టీ భవన సముదాయాన్ని ఆనాటి నిజాం కొలువులో ఉన్నత ఉద్యోగి రాజా ప్రతాపగిరి కొనుగోలు చేశారు. హాస్పిటల్​ ప్రధాన ద్వారం దాటాక హాస్పిటల్​ లోపల నుంచి ఉన్న పాలరాతి మెట్లు, ఆ మెట్లకు రెండు వైపులా ఉన్న 10, 11 అడుగుల ఎత్తులో ఉన్న పాలరాతితో చేసిన హెర్క్యులస్ భంగిమలు భవనం మొత్తాన్ని తామే మోస్తున్నట్లు భ్రమింపజేసేలా ఉంటాయి. ​

చిరాన్​ ప్యాలెస్​: ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ రాజ్​ప్రముఖ్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను నివాసం ఉండే కింగ్​ కోఠి ప్రాంతం జనసమర్థతతో ఉన్నదని, తనకు నగర శివారులో ఎక్కడైనా తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాల్సిందగా కోరగా రాష్ట్ర ప్రభుత్వం జూబ్లిహిల్స్​లోని రిజర్వ్​ ఫారెస్ట్​లో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడే ఏడో నిజాం తన కోసం చిరాన్​ ప్యాలెస్​ను ఫ్రెంచ్​ శైలిలో నిర్మించారు. 

పత్తర్​గట్టి: ఏడో నిజాం 1911లో గట్టి ఎర్రని గ్రానైట్​ రాళ్లతో రెండంతస్తుల రాతి భవనం నిర్మించారు. పత్తర్ అంటే ఉర్దూ భాషలో రాళ్లు అని అర్థం. కాబట్టి పూర్తిగా ఎర్రని గ్రానైట్​ రాళ్లతో నిర్మించిన ఈ భవనాన్ని పత్తర్​గట్టి అని పిలుస్తారు. 

బెల్లా విస్టా: బిల్లా విస్టా అంటే ఏ బ్యూటిపుల్​ వ్యూ అని అర్థం. ఏడో నిజాం ప్రధాని సర్​ అలీ ఇమామ్​ 1919లో ఓ చిన్న నివాసంగా బెల్లావిస్టా నిర్మించారు. సర్​ అలీ ఇమామ్​ 1922లో తన పదవికి రాజీనామా చేసి హైదరాబాద్​ విడిచిపెట్టి వెళ్లిపోయారు. బెల్లా విస్టా భవనాన్ని ఏడో నిజాం పెద్ద కుమారుడు మీర్​ హిమాయత్ అలీఖాన్​ నివాసం కోసం ఆధునికీకరించారు. నిజాం పెద్ద కుమారుడికి ప్రిన్స్ ఆఫ్​ బేరారా, కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆఫ్​ స్టేట్​ ఆర్మ్​డ్​ ఫోర్స్​ హోదాలో ఈ బంగ్లాను కేటాయించారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం బెల్లావిస్టాను ఖాళీ చేయించి పంజాగుట్టలోని బైత్​ – ఉల్​– అజీజ్​ అనే బంగ్లాకు ప్రిన్స్​ మీర్ హిమాయత్​ అలీఖాన్​ను మార్చారు.

అజాఖానా ఇ జహ్ర: మూసీ నదీ తీరంలో దారుల్​ షిఫా దగ్గరలో నిర్మించిన ప్రార్థన మందిరం అజాఖానా ఇ జహ్ర. ఈ అషుర్​ఖానా నిర్మాణాన్ని 1942లో ఏడో నిజాం చేపట్టారు. నిజాం నవాబులు  సున్నీ తెగకు చెందినవారు. అయినా నిజాం నవాబులు షియాల కోసం ప్రత్యేక మందిరమైన అషుర్​ఖానా ఏర్పాటులో సహకరించారు. ఏడో నిజాం తల్లి జోహ్ర బేగం మరణానంతరం నిజాంకు తన తల్లిపై గల ప్రేమ, గౌరవంతో జోహ్రాబేగం పేరిట అజాఖాన్​ ఇ జహ్ర అషుర్​ఖానాను నిర్మించారు. 

కింగ్​కోఠి: ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ నివసించిన ప్యాలెస్​ కింగ్​ కోఠి. ఈ ప్యాలెస్​ను కమల్​ఖాన్​ నిర్మించాడు. ఇందులోని అద్దాలు, దర్వాజాలు, గోడ​లపై కమల్​ఖాన్​ తన పేరిట కేకే అని చెక్కించుకున్నాడు. కానీ, ఏడో నిజాం కేకే అంటే కింగ్​ కోఠి అని మార్చాడు. దాదాపు 21 ఎకరాల్లో కింగ్​ కోఠి ప్యాలెస్ విస్తరించి ఉంది. ఏడో నిజాం పాలనా కాలంలో కింగ్​ కోఠి ప్యాలెస్​లో ముబారక్​ మాన్షన్, ఉస్మాన్​ మాన్షన్​, నియాజ్​ఖానా, మేజ్​ఖానా ఇలా పలు భవనాలను నిర్మించారు.

ముబారక్​ మాన్షన్​ ఎత్తయిన ప్రధాన సింహద్వారాల దగ్గర ఒక పెద్ద పరదా వేలాడుతూ ఉంటుంది. ఏడో నిజాం ప్యాలెస్​లో లేని సమయంలో ఈ పరదాను ఎత్తి ఉంచేవారు. ముబారక్​ మాన్షన్​ తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్​ గేట్​ అంటారు. ఇందులో నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుడి కార్యాలయాలు ఉండేవి. కింగ్​ కోఠి ప్యాలెస్​ యూరోపియన్​ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1967, ఫిబ్రవరి 23న కింగ్​ కోఠి ప్యాలెస్​లో మృతిచెందారు. 

యునాని హాస్పిటల్​: ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ పాలనా కాలంలో రూ.5 లక్షలు ఖర్చు చేసి 1929లో చార్మినార్​ సమీపంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో యునాని ఆయుర్వేద హాస్పిటల్​ నిర్వహిస్తున్నారు. ఈ భవనాన్ని ఇండో సార్సనిక్​ ఆర్కిటెక్చర్​ విధానంలో నిర్మించారు. 

రాష్ట్ర హైకోర్టు: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ 1915, ఏప్రిల్​ 15న హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. రాజస్తాన్​ రాష్ట్రం జైపూర్​కు చెందిన శంకర్​లాల్​ ప్లాన్​ రూపొందించగా నిజాం ఆస్థానంలోని మెహెర్​ అలీ ఫజిల్​ అనే ఇంజినీర్ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్​ 1920, ఏప్రిల్​ 20న హైకోర్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనంపై రాం రహీం అని రాసి ఉండి మత సామరస్యానికి ప్రతీక అన్నట్లుగా ఉంటుంది.