నిజాం కాలంలో పారిశ్రామీకరణ

హైదరాబాద్​ రాజ్యంలో జరిగిన పారిశ్రామికీకరణను మూడు దశలుగా వివరించవచ్చు. మొదటి దశను సాలార్​జంగ్​-1 దివాన్​గా ఉన్న 1870లో మొదలై 1919 వరకు అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేవరకు. రెండో దశను 1919లో మొదలై 1939లో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంగా, మూడో దశను 1939 నుంచి నిజాం పాలన అంతమయ్యే వరకు కొనసాగింది. ఈ మూడు దశలను హైదరాబాద్​ రాజ్య పారిశ్రామికీకరణలో ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​(ఐటీఎఫ్​) చేసే ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పనలతో విభజించవచ్చు.

మొదటి దశ (1870- 1919) 

1899లో హైదరాబాద్​ గోదావరి వ్యాలీ రైల్వే లైన్​ను మన్​మాడ్​ను కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతాలతో పత్తి, అందుకు సంబంధించిన స్పిన్నింగ్​, వీవింగ్​ మిల్స్ లిమిటెడ్​ (1877), మహబూబ్​శాయి గుల్​బర్గా మిల్స్​ (1884), ఔరంగాబాద్​ మిల్స్​ (1888) స్థాపించారు. ఈ దశలో డోర్నకల్​ జంక్షన్​ నుంచి సింగరేణి బొగ్గు గనుల వరకు వేసిన రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలసి 68 ఉండేవి. 1911-22 మధ్యకాలంలో పరిశ్రమలకు 121 నుంచి 200లకు పెరిగాయి. కార్మికుల సంఖ్య 24,317 నుంచి 32,587కు పెరిగింది. 

రెండో దశ (1919-39) 

ఈ దశలో నిజాం ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి సంస్థాగత సహాయం కల్పించింది. 1917లో ఇండస్ట్రియల్​ లేబరేటరీని ఏర్పరిచి పరిశోధనలు చేపట్టారు. 1918లో ప్రత్యేకంగా కామర్స్​ ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​ను రూపొందించారు. 1929వ సంవత్సరం హైదరాబాద్​ రాజ్య పారిశ్రామికీకరణలో ఒక మైలురాయి. ఎందుకంటే ప్రభుత్వమే కోటి రూపాయల నిధితో ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​ (ఐటీఎఫ్​)ను ఏర్పాటు చేసింది. చిన్న తరహా చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఐటీఎఫ్​ పారిశ్రామిక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. సాలార్​జంగ్​–1 కాలంలోపారిశ్రామిక వస్తువుల ప్రదర్శన ప్రారంభమైంది. 

ఉస్మానియా గ్రాడ్యుయేట్స్​ అసోసియేషన్ ద్వారా 1930 నుంచి ప్రతి ఏటా హైదరాబాద్​లో పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించడం ప్రారంభమైంది. ఈ సంస్థ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికే కాటేజీ ఇండస్ట్రియల్​ ఇన్​స్టిట్యూట్​ను ఏర్పాటు చేసింది. అనుబంధంగా చిన్న తరహా వస్తువుల క్రయవిక్రయ కేంద్రాన్ని స్థాపించి ఉత్పత్తిదారులకు, పట్టణ వినియోగదారులకు మధ్యవర్తిత్వం వహిస్తూ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేశారు. రైల్వే రవాణా, రోడ్డు విమానయాన వ్యవస్థలన్నీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే రైల్వే బోర్డు ఆధిపత్యంలోకి వచ్చాయి. ఈ దశలో నిజాంసాగర్​లో హైడ్రో ఎలక్ట్రిక్​ పవర్​ ఉత్పత్తి ప్రారంభమై 1938–39 వరకు 20 మిలయన్ల కిలోవాట్స్​కు చేరింది. 1931 నాటికి భారీ పరిశ్రమల సంఖ్య 387కు పెరిగాయి. మూడు దుస్తుల మిల్లులు, రెండు సిగరెట్​ ఫ్యాక్టరీలు చార్మినార్​, వజీర్​ సుల్తాన్​ టొబాకో, రెండు గ్లాస్​ పరిశ్రమలు, నిజాం షుగర్​ ఫ్యాక్టరీని నిజాం సాగర్​ కింద ఏర్పాటు చేశారు. 

మూడో దశ (1939-48)

చివరి దశలో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ పారిశ్రామిక విధానంలో పెను మార్పులు చేపట్టాడు. అందువల్ల ఈయన కాలంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. 

నిజాం షుగర్​ ఫ్యాక్టరీ (1937): ఈ పరిశ్రమను బోధన్​లో స్థాపించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం. 

ఆల్విన్ మెటల్​ వర్క్స్​: నిజాం ప్రభుత్వ ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​, మెసర్స్​ అల్లావుద్దీన్ అనే కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1942, జనవరిలో ఆల్విన్ లిమిటెడ్​ను ఆల్విన్​ మెటల్​ వర్క్స్​గా స్థాపించారు. 

ప్రాగాటూల్స్​: సికింద్రాబాద్​లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో 1942, మేలో ప్రాగా టూల్స్​ కార్పొరేషన్​ను స్థాపించారు. ఈ సంస్థను ప్రాగాటూల్స్​ లిమిటెడ్​గా మార్పు చేసి 1963లో డిఫెన్స్​ మినిస్టరీకి అప్పగించారు. 

సర్​సిల్క్​ (1942): సిర్పూర్​ ​ కాగజ్​నగర్ ప్రాంతంలో సిర్పూర్​ పేపర్ మిల్లును ఏర్పాటు చేయడం వల్ల దీన్ని సిర్పూర్​ పేపర్​ మిల్లు (ఎస్పీఎం)గా పిలిచేవారు. భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో పేపర్ మిల్లుల్లో ఒకటి. 1942 నుంచి ఈ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైంది. 

హైదరాబాద్​ ఆస్​బెస్టస్​: హైదరాబాద్​ రాచరిక రాజ్యంలో 1946, జూన్ 17న ప్రారంభమై సిమెంట్ రేకులు లేదా షీట్స్​ ఉత్పత్తిని ప్రారంభించింది. దీన్నే తర్వాత కాలంలో హైదరాబాద్​ ఆస్​బెస్టస్​గా పిలుస్తున్నారు .

వజీర్ సుల్తాన్​ టొబాకో కంపెనీ (1930): వజీర్​ సుల్తాన్​ టొబాకో పరిశ్రమను 1916లో హైదరాబాద్​ విఠల్​వాడి ప్రాంతంలో వజీర్​ సుల్తాన్​ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న వీఎస్టీ ప్రాంతానికి ముషీరాబాద్​ – ఆజామాబాద్​గా మార్చారు. ఈ కంపెనీ చామ్స్​, చార్మినార్​, గోల్డ్​ మూమెంట్స్​ అనే సిగరెట్లను ఉత్పత్తి చేసేది. 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముషీరాబాద్​ ఆజామాబాద్​ ప్రాంతాన్ని 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు నిజాం ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కేటాయించింది. 

కార్ఖానా జిందా తిలస్మాత్​ (1920): హకీం మహ్మద్​ మొమినుద్దీన్​ ఫారూకి హైదరాబాద్​ నగరంలో కార్ఖానా జిందా తిలస్మాత్​ను స్థాపించాడు. 

ఆజామ్​జాహీమిల్స్​ (1934): ఇది దుస్తుల ఉత్పత్తి చేసే పరిశ్రమ. వరంగల్​లో స్థాపించిన పరిశ్రమల్లో ముఖ్యమైంది. 

హైదరాబాద్​ స్టేట్​ బ్యాంక్​ (1941): 1941లో మీర్ ఉస్మాన్​ అలీఖాన్​ ప్రభుత్వ బ్యాంక్​ను నెలకొల్పాడు. దీన్ని ఆ రోజుల్లోనే హైదరాబాద్​ స్టేట్​ బ్యాంక్​ అనేవారు. ప్రస్తుతం అదే బ్యాంక్​ స్టేట్​ బ్యాంక్​ హైదరాబాద్​గా కొనసాగి ఎస్​బీఐలో విలీనమైంది. ఇది స్టేట్​ సెంట్రల్​ బ్యాంక్​గా ఉస్మానియా సిక్కా కరెన్సీని తన అజమాయిషిలో నిర్వహించేది. స్వదేశీ సంస్థానాల్లో ఒక్క హైదరాబాద్​ రాజ్యానికి మాత్రమే సొంత కరెన్సీ చెలామణి చేసే హక్కు ఉండేది. ఆరో నిజాం కాలంలో 1869లో బ్యాంక్​ ఆఫ్​ బెంగాల్​ శాఖ హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఇది 1927లో ఇంపీరియల్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియాగా మారింది. నిజాం ప్రభుత్వ సహకారంతో 1918లో టాటా ఇండస్ట్రీయల్​ బ్యాంక్​ను స్థాపించారు. తర్వాత ఇది టాటా బ్యాంక్​ సెంట్ర్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాగా మారింది.

డి.బి.ఆర్. బిల్లు: దివాన్​ బహదూర్ రాంగోపాల్​ బిల్లు. దీన్నే డి.బి.ఆర్.మిల్స్ అంటారు. దీన్ని 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్​లోని లోయర్​ ట్యాంక్​బండ్​లో స్థాపించారు. ఇది ప్రైవేట్​ కంపెనీ. బయట నుంచి తీసుకువచ్చిన ముడిసరుకులతో దుస్తులు తయారు చేసేవారు. ప్రస్తుతం ఇది మూతపడింది.