సంక్రాంతి నాటికి ఇందిరమ్మ మోడల్ హౌస్‌‌ నిర్మాణం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి వెల్లడి

కూసుమంచి/ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం, వెలుగు : సంక్రాంతి నాటికి రాష్ట్రంలో 580 ఇందిరమ్మ మోడల్‌‌ హౌస్‌‌లను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌ ఆవరణలో ఇందిరమ్మ మోడల్‌‌ హౌస్‌‌ నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ముజమ్మీల్‌‌ ఖాన్‌‌, సీపీ సునీల్‌‌ దత్‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగేండ్లలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 

ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌‌ను డిసెంబర్ 5న సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది అప్లై చేసుకున్నారని, వీటిలో అర్హులను ఎంపిక చేసి మొదటి విడత కింద నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తామన్నారు. అనంతరం ఖమ్మం రూరల్‌‌ మండలంలోని కొండాపురం, గొల్లగూడెం, ఆటోనగర్‌‌, శ్రీరాంనగర్​, ఇందిరమ్మ కాలనీ, సాయిగణేశ్‌‌ నగర్‌‌లో సీసీ రోడ్లు, సైడ్‌‌ డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 

తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌‌ కమిటీ చైర్మన్లు సీతారాములు, హరినాథబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్‌‌, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మండల ప్రత్యేక అధికారిణి శ్రీలత, హౌజింగ్ ఈఈ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకట్‌‌రెడ్డి, కూసుమంచి మండల ఇన్‌‌చార్జి తహసీల్దార్‌‌ కరుణశ్రీ 
పాల్గొన్నారు.