నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్

  • మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తం: మంత్రి పొంగులేటి 
  • రెండు నెలల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని వెల్లడి
  • భూపాలపల్లి జిల్లా గాంధీనగర్​లో ఐటీ పార్క్‌‌ కు శంకుస్థాపన
  • పాల్గొన్న మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను స్టార్ట్‌‌ చేస్తామని హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి తెలిపారు. తొలి విడతలో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, రాబోయే రెండు నెలల్లో అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌‌‌‌ బుక్కులు అందించే కార్యక్రమం కూడా చేపడతామని పేర్కొన్నారు. 

శనివారం మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, సీతక్కతో కలిసి ఆయన భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. గణపురం మండలంలోని గాంధీనగర్‌‌‌‌ వద్ద రూ.50 కోట్లతో 60 ఎకరాలలో చేపట్టిన ఐటీ ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్‌‌‌‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లోకల్‌‌‌‌ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. 

పేదోళ్ల ఆలోచనలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందన్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి.. పదేండ్లలో కేవలం 1.50 లక్షల ఇండ్లు మాత్రమే కట్టిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ధరణి వల్లనే వాళ్ల కొంప మునిగిందన్నారు. ఎమ్మెల్యేలు కోరిన విధంగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామన్నారు.    

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం: సీతక్క

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉద్యోగ వేటలో చాలా మంది యువత పట్టణాలకు వెళ్తున్నారని, అందుకే మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు నిరుద్యోగుల గోస పుచ్చుకుందని మంత్రి ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించారని చెప్పారు.

 స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. రూ.31 వేల కోట్లతో దేశం గర్వించే రీతిలో రుణమాఫీ చేస్తుంటే కొందరు తట్టుకోలేక నిందలు వేస్తున్నారని మంత్రి ఫైర్​అయ్యారు. భూమాత స్కీం ద్వారా  రైతులు పట్టాల కోసం నాయకులు, ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్‌‌‌‌ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంస్థల చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఐత ప్రకాశ్‌‌‌‌ రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. 

అంతకుముందు భూపాలపల్లి జిల్లా హాస్పిటల్‌‌‌‌లో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ స్టోర్‌‌‌‌ను, డాక్టర్స్‌‌‌‌ క్యాంటిన్‌‌‌‌ను మంత్రులు ప్రారంభించారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై డాక్టర్స్‌‌‌‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ శర్మ అధ్యక్షతన జిల్లాస్థాయి ఆఫీసర్లతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

పారిశ్రామిక అభివృద్ధిని పల్లెలకు తీసుకొస్తం: శ్రీధర్‌‌‌‌బాబు

పారిశ్రామిక అభివృద్ధిని పల్లెలకు తీసుకొస్తామని ఐటీ మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు అన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతమైన భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల 200కు పైగా పారిశ్రామిక సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర యువతకు నైపుణ్యం పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీని హైదరాబాద్​లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు రాకుండా చూడాలని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు, పోలీసులను ఆదేశించారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం 93 వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ ద్వారా పక్కనే ఉన్న భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలలో ఒక్క ఎకరానికైనా నీరందించారా? అని ఆయన ప్రశ్నించారు. అశాస్త్రీయంగా బ్యారేజి కడితే అది కుంగిపోయిందని, అయినా తప్పు ఒప్పుకోక పోగా కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు అంటున్నారని మంత్రి మండిపడ్డారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలలో సాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.