జగిత్యాల, జగిత్యాల రూరల్, వెలుగు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించినవారిని అభినందించారు. పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో యూత్ కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.
బీజేపీ చార్జిషీట్‌పై జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆ పార్టీ అధికారంలోని ఉన్న రాష్ట్రాల్లో రూ.500కే గ్యాస్‌సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. అంతకుముందు జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో విప్ అడ్లూరి పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, విజయలక్ష్మి, నందయ్య, శంకర్ యువజన కాంగ్రెస్ లీడర్లు, ఆర్టీసీ డీఎంలు, అధికారులు పాల్గొన్నారు.