ఇది సార్ మన ‘టీ’ రేంజ్.. భారతీయుల ఆల్ టైమ్ ఫేవరేట్ ‘టీ’కి FDA గుర్తింపు

భారతీయుల ఆల్ టైమ్ ఫేవరేట్ ‘టీ’ని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించింది. టీ ఆరోగ్యకరమైన లేబుల్‎కు అర్హత సాధించినట్లు 2024, డిసెంబర్ 19వ తేదీన యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్, ఇండియన్ టీ అసోసియేషన్ స్వాగతించాయి. ఈ గుర్తింపు గ్లోబల్ టీ పరిశ్రమకు మరింత ఊతమిస్తోందన్నారు.

టీకి యూఎస్ గుర్తింపు దక్కడంపై నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ సలహాదారు, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ ఛైర్మన్ బిద్యానంద బోర్కకోటి ఆనందం వ్యక్తం చేశారు. ఎఫ్డీఏ గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందన్నారు. టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ఈ గుర్తింపు నొక్కి చెబుతోందని అన్నారు. ఎఫ్డీఏ గుర్తింపు తేయాకు పరిశ్రమకు కీలకమైన క్షణమని అభవర్ణించారు. ఇది టీ యొక్క పోషక విలువలను ధృవీకరించడమే కాకుండా వినియోగదారులకు టీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తోందన్నారు.

Also Read:-క్రిస్మస్ కప్ కేక్స్.. ఇంట్లో ఇలా తయారు చేసుకోండి.. 

టీని ఒక వెల్నెస్, జీవనశైలి పానీయంగా ప్రోత్సహించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ దాని సభ్య కంపెనీలు నాణ్యమైన టీని ఉత్పత్తి చేయడంతో పాటు భారతీయ టీ ప్రయోజనాలను మరింత ప్రోత్సహించడానికి అంకితభావంతో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ గుర్తింపు ఇండియాతో పాటు విదేశాలలో ప్రతిష్టాత్మకమైన పానీయంగా టీ కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.