ఓటు వేయడానికి ఓటర్ కార్డ్ ఎంత ముఖ్యమో.. విదేశాలకు వెళ్లడానికి వీసా కూడా అంతే ముఖ్యం. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నాయి కొన్నిదేశాలు. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా మా దేశానికి రావచ్చు అని వెల్కం చెప్తున్నాయి. పాస్‌పోర్ట్ మాత్రం ఎందుకు అంటారా? డబ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కి వెళ్లాలా? డెబిట్ కార్డ్ ఉంటే చాలు కదా. అలానే పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. అందులోనే కావాల్సిన వివరాలన్నీ ఉంటాయి. పైగా ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్ట్ చాలా బలంగా మారింది. ప్రపంచ దేశాల్లో 83వ స్థానానికి చేరింది. దాంతో ప్రపంచంలోని 60 దేశాలకు వీసా లేకుండా విజిట్ చేసేయొచ్చు. ఆ దేశాలు ఏవి? అక్కడి రూల్స్ ఏంటి? చూడదగ్గ ప్రదేశాలేంటి? ఎంత ఖర్చవుతుంది? వంటి ఇంట్రెస్టింగ్ విశేషాలే ఇవి.
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఆ పాస్‌పోర్ట్ ఉంటేనే వీసాలు మంజూరు చేస్తాయి ఆయా దేశాలు. విదేశాల్లో అడుగుపెట్టాలంటే కావాల్సిన ఈ పాస్‌పోర్ట్ కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ ప్రూఫ్‌గా పనికొస్తుంది కూడా. పాస్‌పోర్ట్‌తో పాటు వీసా కూడా ఉంటే విదేశాలను చుట్టి రావచ్చు. ఈ వీసాలు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటిలో ఎంట్రీ వీసాతోపాటు టూరిస్ట్, బిజినెస్, ఎంప్లాయిమెంట్, స్టూడెంట్, ట్రాన్సిట్, మెడికల్, కాన్ఫరెన్స్ వంటి రకరకాల వీసాలు ఉంటాయి.
ఇప్పటికే మనవాళ్లు చాలామంది ఆయా దేశాలకు వెళ్లారు. వెళ్తున్నారు. అలా వెళ్లిన వాళ్లలో చదువుకోవడానికి వెళ్లి, జాబ్ తెచ్చుకుని అక్కడే సెటిల్ అయిన వాళ్లు ఉన్నారు. ఎక్కువకాలం అక్కడ ఉండడం వల్ల ఆ లైఫ్‌స్టయిల్‌కి, అక్కడి వాతావరణానికి అలవాటు పడినవాళ్లు అక్కడే స్థిరపడ్డారు. జాబ్ చేస్తూనో, బిజినెస్ చేస్తూనో, వలస వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూనో ఇతర దేశాల్లో బతుకుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే... చాలామందికి విదేశాలు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కొందరు ఏడాదికి ఒకసారైనా ఫారెన్ టూర్ వేయాలనుకుంటారు. ఇంకొందరు లైఫ్‌లో ఒక్కసారైనా ఫారిన్ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్లు విదేశాలకు వెళ్లాలంటే ఎంట్రీ వీసా లేదా టూరిస్ట్ వీసా కావాలి. కానీ, అవేవీ లేకుండానే కొన్ని దేశాలకు వెళ్లేందుకు ఇప్పుడు ఛాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు టికెట్ బుక్ చేసుకుని ట్రిప్‌కి వెళ్లొచ్చు. నిజానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
భారతీయ పాస్‌పోర్ట్ బలమైనదిగా మారడమే ఇందుకు కారణం. ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) విడుదల చేసిన వీసా – ఫ్రీ దేశాల లిస్ట్‌లో ప్రపంచ దేశాల్లో 83వ స్థానంలో ఉంది భారత్. ఇంతకుముందు విదేశాలకు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్ వీక్‌గా ఉండడం వల్ల కొన్ని దేశాలకు వెళ్లడానికి పర్మిషన్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్ట్ స్ట్రాంగ్ అయిందన్నమాట. కాబట్టి వీసా లేకపోయినా పాస్‌పోర్ట్ చూపించి ఎగిరిపోవచ్చు.
స్ట్రాంగ్ పాస్‌పోర్ట్ అంటే..
దౌత్య సంబంధాలు, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక బలం, ప్రాంతీయ ఒప్పందాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పాస్‌పోర్ట్ స్ట్రాంగ్‌గా ఉందని చెప్తారు. అయితే, ఆ విషయంలో ఇంతకుముందు కంటే ఇప్పుడు మనదేశం మెరుగ్గా ఉంది. అందుకే 90వ స్థానంలో ఉన్న ఇండియా 83వ స్థానానికి చేరింది. బలహీనమైన స్థితి నుంచి బలంగా మారిందన్నమాట. అసలు ‘బలమైనది’ అని ఎలా అంచనా వేస్తారంటే.. అందుకోసం హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ని పరిగణనలోకి తీసుకుంటారు.
వీసా నిబంధనలు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) డాటా ఆధారంగా పాస్‌పోర్ట్ బలాన్ని అంచనా వేస్తుంది. ఒక పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తి ఎన్ని వీసా – ఫ్రీ డెస్టినేషన్స్‌ను చూడొచ్చు? పాస్‌పోర్ట్ ర్యాంక్ ఏంటి? అనేవి ఈ ఇండెక్స్ లెక్కలోకి తీసుకుంటుంది. వీసా– ఫ్రీ డెస్టినేషన్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే పాస్‌పోర్ట్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఇప్పటివరకు ఉన్న డాటా ప్రకారం, జపాన్, సింగపూర్ దేశాలు స్ట్రాంగ్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాయి. ఆ తర్వాతి ప్లేస్ల్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెంబర్గ్, సౌత్ కొరియా, స్వీడన్ వంటివి ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు189 దేశాల వరకు వీసా–ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు.
ఆ రెండు ప్రయోజనాలు
బలమైన పాస్‌పోర్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే... వీసా ఫ్రీ, వీసా ఆన్– అరైవల్ అనే రెండు ఉపయోగాలున్నాయి. వాటిలో ఒకటి వీసా లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు. రెండోది అక్కడికి వెళ్లాక వీసా తీసుకోవడం. అయితే కొన్ని షరతులు ఉంటాయి. వీసా లేకుండా వెళ్లినా, అక్కడికి వెళ్లి వీసా తీసుకున్నా అది కొన్ని రోజులకు మాత్రమే పరిమితం. ఈ విషయాన్ని గుర్తుంచుకుని టూర్ ప్లాన్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్‌పోర్ట్ ఉన్న దేశాల వాళ్లకు ట్రావెల్ ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే వీసాలు లేకుండా ఎక్కువ ప్రదేశాలను చూసే అవకాశం కూడా ఉంటుంది.
పాస్‌పోర్ట్‌లో రకాలు..
ఒకటే రకం పాస్‌పోర్ట్ ఉండదు. అందులో కూడా రకాలున్నాయి. పాస్‌పోర్ట్ రకాన్ని బట్టి ఏ కేటగిరీకి చెందినవాళ్లు అనేది తెలిసిపోతుంది. అందులో మొదటిది ఆర్డినరీ పాస్ట్‌పోర్ట్. దీన్ని సామాన్యుడి పాస్‌పోర్ట్ అంటారు. ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇది చూసి విమానాల్లో ప్రయాణించేది సామాన్యులా లేదా దేశంలోని ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లా అనే తేడాను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు ఈజీగా గుర్తిస్తారు. మరొకటి భారతీయ దౌత్యవేత్తలతోపాటు సీనియర్ గవర్నమెంట్ అధికారులకు ఇచ్చే అఫీషియల్ లేదా డిప్లొమాట్ పాస్‌పోర్ట్. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు ఫారిన్ టూర్స్ వెళ్లినప్పుడు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ నుంచి ఈజీగా, ఫాస్ట్‌గా క్లియరెన్స్ వస్తుంది. మరో రకం ఆరెంజ్ పాస్‌పోర్ట్. దీన్ని గవర్నమెంట్ 2018 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇది మిగతా వాటికంటే చాలా డిఫరెంట్. పదో తరగతికి మించి చదవని వ్యక్తులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు ఇమ్మిగ్రేషన్ చెక్ తప్పక చేయించుకోవాల్సిన కేటగిరీలో ఉంటారు.
గవర్నమెంట్ అఫీషియల్స్‌కు మాత్రమే
తెల్లరంగులో ఉండే పాస్‌పోర్ట్ గవర్నమెంట్లో కీలక బాధ్యతలు చేపట్టిన అధికారులకు మాత్రమే ఇస్తారు. ఈ పాస్‌పోర్ట్ చాలా పవర్ఫుల్. అధికారిక పని మీద విదేశాలకు వెళ్లే గవర్నమెంట్ ఆఫీసర్లకే ఇది జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు గుర్తించి వాళ్లకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇలా మనదేశంలో మొత్తం నాలుగు రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయన్నమాట. పాస్ పోర్ట్ దగ్గర ఉన్నాక ఇక వీసాలేని పయనమే తరువాయి. అలా వీసాలేకుండా ఇండియన్ పాస్పోర్టుతో ఎక్కడెక్కడికి వెళ్లొచ్చో ఒక లుక్ వేద్దాం చలో...
మూడు నెలలు.. అంతకు మించి!
కరేబియన్ దేశాల్లో ఒకటి బార్బడోస్. ఇక్కడ తెల్ల ఇసుక బీచ్‌లు, లగ్జరీ హోటల్స్, అద్భుతమైన ఆతిథ్యం ఎంజాయ్ చేయొచ్చు. వీసా లేకుండానే భారతీయులు ఈ దేశానికి వెళ్లి 90 రోజులు ఉండొచ్చు. అలాగే మారిషస్ కూడా ఓ అందమైన ప్రదేశం. ఇక్కడ బీచ్‌లు, లగ్జరీ రిసార్ట్లు పాపులర్. టూరిస్ట్‌లు ఎక్కువగా వెళ్లే ప్రదేశాల్లో మారిషన్ కూడా ఒకటి. రెండు ద్వీపాల డెస్టినేషన్ ప్లేస్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ అనే దేశం వెళ్లినా మూడు నెలలు ఉండొచ్చు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో టూరిజం కూడా చాలా బాగుంటుంది. రకరకాల పక్షులు, వన్యప్రాణులకు ఇది నిలయం. యానిమల్ లవర్స్‌కి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇది. హైతీ దేశం వెళ్తే అక్కడి రంగుల ఇండ్లు, బీచ్‌లతో పాటు ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఇకపోతే, ఫిజీ.. ఇదొక ద్వీప దేశం. అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కట్టిపడేస్తుంది. ఇక్కడికి వెళ్తే ఏకంగా నాలుగు నెలలు (120 రోజులు) ఉండొచ్చు. అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. నీటి మధ్యలో చిన్న చిన్న గుడిసెలు కట్టుకుని జీవిస్తుంటారు ఇక్కడి వాళ్లు.
నెల రోజులు ఉండొచ్చు
కుక్ ఐలాండ్స్కు వెళ్తే మౌరీ బీచ్, కొబ్బరి తోటలు, బీచ్‌లు చూడొచ్చు. ఇక్కడికి వెళ్తే 31 రోజులు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సమోవా దేశంలో పగడపు దీవులు, అగ్నిపర్వతం, లావాకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. వీసా లేకుండా వెళ్లి 30 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
పద్నాలుగు రోజులు
భూటాన్ వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు. కానీ, చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి పాటిస్తూ టూర్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది ఈ దేశం. ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా పేరుగాంచింది ఇది. ఇక్కడ పొల్యూషన్ ఉండదు. అందమైన ప్రకృతి, హిమగిరుల సోయగాలు, అద్భుతమైన బౌద్ధారామాలు టూరిస్ట్‌లను ఆకర్షిస్తాయి. మరో దేశం కజకిస్తాన్. మామూలుగా అయితే ఇది ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్‌గా కనిపించదు.
కానీ, ఇది కూడా చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడి నేచర్, ఆర్కిటెక్చర్, ఆల్మటీ అనే టూరిస్ట్ ప్లేస్ బాగా అట్రాక్ట్ చేస్తాయి. వాటిని చూడాలంటే కజకిస్తాన్ వెళ్లాల్సిందే. అంతేకాదు... డిస్నీలాండ్, ఓషన్ పార్క్ వంటి పాపులర్ టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్న హాంకాంగ్ వెళ్లడానికి కూడా వీసా అవసరం లేదు. అలాగే పిట్కయిర్న్ ఐలాండ్స్కు వెళ్తే అక్కడి చిన్న చిన్న ద్వీపాలు స్వాగతం చెప్తాయి. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్లకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చెప్పిన ఈ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా పద్నాలుగు రోజుల ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ రెండు వారాలే..
పురాతన కట్టడాలకు పాపులర్ జోర్డాన్ . ఎడారి ప్రాంతం కాబట్టి నీటి వనరులు తక్కువగా ఉంటాయి. అక్కడ ఒంటెలపై ప్రయాణాలు చేస్తుంటారు. ఈ దేశానికి వెళ్లగానే వీసా ఇస్తారు. కానీ అది రెండు వారాల వరకే. అలాగే చేతిలో 3000 అమెరికన్ డాలర్లు కచ్చితంగా ఉండాలి అనేది అక్కడి రూల్.
ఎన్ని రోజులైనా మీ ఇష్టం!
జమైకాలో అద్భుతమైన పర్వతాలు, రెయిన్ ఫారెస్ట్, బీచ్‌లు పాపులర్. అంతేకాదు, ఇది పాపులర్ సింగర్ జమైకా రెగె పుట్టిన స్థలం. ఇక్కడి ప్రజలు నీళ్ల మధ్యలో ఇండ్లు కట్టుకుని నివసిస్తుంటారు. ఇక్కడికి వెళ్లడానికి వీసా అవసరం లేదు. అక్కడ అడుగుపెట్టాక కూడా వీసాతో పనిలేదు. ఎన్ని రోజులు అయినా ఉండొచ్చు. ఇదిలా ఉంటే... ఆండోరా దేశం గురించి విన్నారా.. మంచు కొండలు, పర్వత శ్రేణులు ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు. అంతేకాదు.. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇలాంటిదే మరో దేశం కేప్ వెర్డే. ఈ ద్వీప దేశంలో టెంపరేచర్స్ ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. ఈ దేశానికి వెళ్లగానే వీసా ఇస్తారు. ఇక్కడ కూడా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నౌరు దేశంలో తెల్ల ఇసుక బీచ్‌లు స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడికి వెళ్లగానే వీసా ఇస్తారు. మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు. టాంజానియా దేశంలో పలురకాల జంతు జాతులు ఉంటాయి. అక్కడ సఫారీ చేస్తూ వన్యప్రాణుల్ని చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు వీలు ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. కానీ, అక్కడికి వెళ్లగానే వీసా మాత్రం తీసుకోవాలి.
ఆన్‌లైన్‌లో వీసా
ఇ-– వీసా అనేది ఎలక్ట్రానిక్ వీసా. పాస్‌పోర్ట్‌పై ఫిజికల్ స్టాంప్ అవసరం లేదు. టర్కీ, భారతదేశం, వియత్నాం వంటి అనేక దేశాలు ప్రయాణికులకు ఇ-–వీసాలను జారీ చేస్తున్నాయి ఈ దేశాల్లో ఎక్కువగా వెళ్లేవి, అక్కడి ఫేమస్ ప్లేస్‌లు, టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇవి...
ఎల్ సాల్వడార్ : ఇది సెంట్రల్ అమెరికాలోని ఒక దేశం. అమెరికాలో వీసా లేకుండా వెళ్లే ఏకైక దేశం ఇది. అగ్నిపర్వతాల భూమిగా ప్రసిద్ధి ఇది. ఇక్కడికి వెళ్లాలంటే రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. అక్కడికి వెళ్లాక 90 రోజులు ఉండేందుకు పర్మిషన్ ఇస్తూ టూరిస్ట్ కార్డ్ పేరుతో ఒక లెటర్ ఇస్తారు.
డొమినికా : ఈ దేశంలో చెట్లపై రిసార్టులు, నదీ తీరాలను ఆనుకుని ఉండే ఇండ్లు స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడికి వెళ్లగానే 6 నెలల వీసా ఇస్తారు.
బొలీవియా : ఇక్కడ ఉప్పు తయారీ చూడొచ్చు. రంగు రంగుల కొండలు కనిపిస్తాయి. ఈ దేశానికి చేరుకున్నాక వీసా తీసుకోవచ్చు. ఇక్కడ 90 రోజులు ఉండొచ్చు.
గునియా బిస్సవ్ : ఇది తక్కువ జనాభాగల దేశం. అక్కడ ఉద్యానవనాలు, ఓడరేవులు, పార్కులు చాలా ఉంటాయి. ఈ దేశానికి వెళ్తే 90 రోజులకు వీసా ఇస్తారు.
ఇండోనేసియా : నీటి మధ్యలో విల్లాలు, ఆకట్టుకునే బీచ్‌లు, టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ 30 రోజులు ఉండొచ్చు.
పలావ్ : ఇక్కడికి వెళ్లగానే 30 రోజులకు వీసా ఇస్తారు. జెల్లీ ఫిష్ లేక్, పలావ్ నేషనల్ మ్యూజియం వంటివి పాపులర్ టూరిస్ట్ ప్లేస్‌లు.
సెషెల్స్ : ఈ దేశంలో వందకుపైగా దీవులు ఉన్నాయి. నీటి మధ్యలో నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవిస్తుంటారు ప్రజలు. సముద్రపు ఉత్పత్తులే ప్రధాన ఆహారం. ఇక్కడికి వెళ్లగానే నెలరోజులకు వీసా ఇస్తారు.
సెయింట్ లూసియా : అగ్నిపర్వత బీచ్‌లు ఉంటాయి. ఇక్కడ చెక్కతో శిల్పాలు తయారుచేసి అమ్ముతుంటారు. ఈ దేశానికి వెళ్లాక 6 వారాల వీసా ఇస్తారు.
మడగాస్కర్ : ఈ భారీ ద్వీపంలో అనేక జంతు జాతులు ఉంటాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా ఇస్తారు. గడువు 90 రోజులు.
మైక్రోనేసియా : ఈ దేశంలో బీచ్‌లు, శిలాజాల మ్యూజియం వంటివి స్పెషల్ అట్రాక్షన్. అరైవల్ వీసా ఇస్తారు. ఇక్కడ నెల రోజులు ఉండొచ్చు.
కంబోడియా : పురాతన బౌద్ధాలయాలు, కోటలు, బురుజులు చూడదగ్గవి. ఇక్కడకి వెళ్లాక 30 రోజుల గడువుతో వీసా ఇస్తారు.
సెర్బియా : ఇక్కడికి వెళ్లేందుకు వీసా అవసరం లేదు. కానీ, ఉండడానికి, తిరగడానికి అరైవల్ వీసా తీసుకోవాలి. అది 30 రోజులు పనిచేస్తుంది.
లేటెస్ట్గా వీసా – ఫ్రీ అనౌన్స్ చేసిన దేశాలు
భారతీయులకు 2020 వరకు కొన్ని దేశాలకు మాత్రమే వీసా లేకుండా ట్రావెల్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అది 60 దేశాలకు విస్తరించింది. అందులో లేటెస్ట్గా వీసా – ఫ్రీ ఎంట్రీ ట్రావెల్ కల్పిస్తున్న దేశాలు ఇవే. ఇరాన్ వీసా –ఫ్రీవిదేశీ టూరిస్ట్‌లను, విజిటర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం వీసా లేకుండా తమ దేశానికి రావచ్చని ప్రకటించింది. భారత్ సహా 33 దేశాల వాళ్లకు వీసా లేకుండా ప్రయాణించే వీలు కల్పిస్తోందని ఆ దేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్గామి చెప్పారు. ఇరాన్ మీద వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ల ఆలోచన. భారత్‌తోపాటు, రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతర్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలున్నాయి. ఈ దేశాల ప్రజలంతా వీసా లేకుండా ఇరాన్ వెళ్లొచ్చు.
థాయిలాండ్‌లో నెల రోజులు
వీసా లేకుండా థాయిలాండ్ వెళ్లడానికి ఈ ఏడాది నవంబర్10 నుంచి అనుమతించింది. అది మే10, 2024 వరకు అమల్లో ఉంటుంది. థాయిలాండ్ వెళ్తే టూరిస్ట్‌లకు 30 రోజుల పర్మిషన్ ఉంటుంది. భారత్, తైవాన్ ప్రజలకు వీసా ఫ్రీ అవకాశం ఇచ్చింది. టూరిస్ట్‌ల సీజన్ రాబోతుండడంతో ఎక్కువమంది టూరిస్ట్‌లను అట్రాక్ట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది థాయ్ గవర్నమెంట్. ఈ సీజన్లో 28 లక్షల మంది టూరిస్ట్‌లను అట్రాక్ట్ చేయాలనేది వాళ్ల టార్గెట్. మామూలుగానే థాయిలాండ్‌కు చైనా, మలేసియా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది టూరిస్ట్‌లు వెళ్తుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 22 లక్షల మంది వెళ్లారు.
మలేసియాకు ఎంట్రీ
మలేసియాకు వీసా లేకపోయినా వెళ్లొచ్చని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. గతంలో కువైట్, సౌదీ, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మాత్రమే ఈ అనుమతి ఉండేది. ఇప్పుడు భారత్‌కి కూడా అందులో చోటు కల్పించింది. డిసెంబర్1 నుంచి 30 రోజుల పాటు చైనా, భారత దేశ పౌరులకు వీసా– ఫ్రీ ఎంట్రీ ఇస్తుందన్నారు. అయితే, అది ఎంతకాలం వర్తిస్తుందో చెప్పలేదు. మలేసియా వెళ్లే వాళ్లలో చైనా నాలుగో ప్లేస్‌లో ఉంటే మనదేశం ఐదో స్థానంలో ఉంది.
మలేసియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మలేసియాకు 9.16లక్షల మంది వెళ్లారు. అందులో చైనీయులు నాలుగు లక్షలకు పైగా ఉంటే భారతీయులు 2 రెండు లక్షలకు పైగా ఉన్నారు. కరోనాకు ముందు ఇదే పీరియడ్‌లో చైనా నుంచి15 లక్షలు, భారత్ నుంచి 3 లక్షలకు పైగా పర్యాటకులు మలేసియా వెళ్లారు. దీంతో టూరిస్ట్‌లను అట్రాక్ట్ చేసేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు మలేసియా ఈ నిర్ణయం తీసుకుంది.
ద్వీప దేశం శ్రీలంక
టూరిజంను ఎంకరేజ్ చేసేందుకు శ్రీలంక గవర్నమెంట్ వీసా–ఫ్రీ ఎంట్రీ కల్పిస్తోంది. అందులో భారత్‌తోపాటు మరో ఏడు దేశాలున్నాయి. అవి చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయిలాండ్. ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ తెలిపారు.
ద్వీపదేశం అయిన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన వనరు. కరోనాతోపాటు, ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం రావడం వల్ల టూరిజం తగ్గిపోయింది. అందుకని 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని అట్రాక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగానే వీసా–ఫ్రీ నిర్ణయం తీసుకుంది. మొదట్లో ఐదు దేశాలకు అనుమతివ్వాలి అనుకున్నారు. తర్వాత దాన్ని ఏడుకి పెంచారు.
అమెరికా వీసాతో ఇతర దేశాలకు..
భారతీయుల్లో ఎక్కువమంది అమెరికా వెళ్లాలనుకుంటారు. అక్కడికి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. అయితే, అమెరికన్ వీసా ఉంటే, దాంతో వేరే దేశాలకు వీసా – ఫ్రీ లేదా వీసా ఆన్ – అరైవల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
అమెరికా వీసా ఉంటే.. మెక్సికోలో ఆరునెలలు ఉండొచ్చు. అక్కడికి వెళ్లాలంటే మల్టిపుల్ ఇమ్మిగ్రేషన్ ఫామ్ (ఎఫ్.ఎం.ఎం.) నింపాలి. పెరూ దేశం టూరిస్ట్ డెస్టినేషన్‌కి పాపులర్. అక్కడికి వెళ్లాలన్నా అమెరికా వీసా చాలు. దాంతో ఆరు నెలలు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అరబ్ దేశమైన ఒమన్‌లో 30 రోజులు ఉండొచ్చు. అయితే, అక్కడికి వెళ్లాక టూరిస్ట్ వీసా కింద వీసా ఆన్ – అరైవల్ లేదా ఇ–వీసా తీసుకోవాలి. అమెరికన్ వీసాను బట్టి ఆ గడువు ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉంది.
ద్వీపదేశం అయిన సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌కు కూడా వీసా అవసరం లేదు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ అందమైన ప్రైవేట్ ద్వీపాలు కూడా ఉంటాయి. కాబట్టి హాలిడేస్ కి బెస్ట్ స్పాట్. ఇక్కడికి వెళ్తే 30 రోజులు ఉండొచ్చు. టర్కీ, బోస్నియా అండ్ హెగ్జెగోవినాల్లో కూడా నెల రోజులు ఉండొచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా అమెరికా వీసాతో14 రోజులు ఉండొచ్చు.
యూరప్ వీసాతో కూడా..
యూరప్ వీసాని షెంజన్ వీసా అంటారు. భారతీయులు ఈ వీసాతో 27 దేశాలు తిరగొచ్చు. వాటిలో నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, హంగేరీ, ఫ్రాన్స్, జర్మనీ, జెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, ఇటలీ, గ్రీస్, లిథ్వానియా, పోర్చుగల్, స్పెయిన్, లాట్వియా, స్వీడన్, స్లోవేనియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఐస్లాండ్, లక్సెంబర్గ్, మాల్టా, నార్వే, పోలాండ్, బెల్జియం, స్లోవకియా, క్రొయేసియా, ఈస్టోనియా, డెన్మార్క్. వీటితోపాటు నాన్ షెంజన్ దేశాలు కూడా తిరగొచ్చు. అవి యూకె, ఐర్లాండ్, అల్బెనియా, అర్మేనియా, బెలారస్, బోస్నియా అండ్ హెగ్జెగోవిన, సిప్రస్, బల్గేరియా, జార్జియా, కొసొవొ, మాల్డొవా, మాంటెరెగొ, నార్త్ మాసిదొనియా, రొమేనియా, రష్యా, సెర్బియా, తుర్కియే, ఉక్రెయిన్.
మొత్తంగా అమెరికా వీసా ఉంటే 51 దేశాలు తిరగొచ్చు. యూరోపియన్ లేదా షెంజన్ వీసా ఉంటే 27 దేశాలతోపాటు మరో 20 నాన్ షెంజన్ దేశాలు కూడా తిరగొచ్చు. ఆ రెండు వీసాలు కూడా వద్దనుకుంటే పాస్‌పోర్ట్‌తోనే 60 దేశాలు చుట్టిరావొచ్చు. ఫారిన్ ట్రిప్‌కి వెళ్లాలనుకునేవాళ్లు వీటిలో నచ్చిన దేశానికి వెళ్లి ఎంజాయ్ చేసేయొచ్చు. ప్రపంచయాత్ర చేయాలనుకునే వాళ్లకు పాస్‌పోర్ట్, అమెరికన్ వీసా, షెంజన్ వీసా ఉంటే దాదాపు170 దేశాలకి పైగా తిరగొచ్చన్నమాట.
పాస్‌పోర్ట్ ఇక ఈజీగా...
కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేయడానికి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్‌ని వాడాలి. దాని ద్వారానే అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రాసెసింగ్ టైం తగ్గుతుంది. ప్రాసెసింగ్ క్వాలిటీ కూడా పెరుగుతుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. డిజీ లాకర్ అనే ఈ యాప్‌ని భారతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ ప్రారంభించింది. ఇది డిజిటల్ వ్యాలెట్లాగా పనిచేస్తుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్, మార్క్షీట్లు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు యాక్సెస్ చేసుకోవచ్చు.
వెళ్లగానే వీసా ఇచ్చే దేశాలు
వీసా – ఫ్రీ అంటే వీసా లేకుండా వెళ్లొచ్చు. కానీ, వీసా లేకపోయినా అక్కడికి వెళ్లాక తీసుకుంటే దాన్ని వీసా ఆన్– అరైవల్ అంటారు. అలాంటి వీసాలతో కూడా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. అరైవల్ వీసా ఇచ్చే దేశాలేవంటే... ఆసియాలో భూటాన్, ఇండోనేసియా, మకావు, నేపాల్, లావోస్, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, టిమొర్ లెస్టె. యూరప్‌లో అల్బెనియా, సెర్బియా. ఓషినియాలో కుక్ ఐలాండ్స్, నియు, ఫిజీ, మైక్రోనేషియా. ది కరేబియన్‌లో బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, డొమినికా, హైతి, జమైకా, మాంట్సెర్రెట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో. అమెరికాలో ఎల్ సాల్వడార్.
మిడిల్ ఈస్ట్‌లో ఒమన్, ఖతర్. ఆఫ్రికాలో మారిషస్, సెనెగల్, సెషెల్స్. రువాండా, ఉగాండా, జింబాబ్వే, మడగాస్కర్, ఇథియోపియా, టాంజానియా, టోగో, సెయిర్రె లియోన్, సోమాలియా, కొమొరో ఐలాండ్స్, బురుండి, ట్యునీషియా, కేప్ వెర్డె ఐలాండ్స్, మారిటియానా, మొజాంబిక్... ఈ దేశాలన్నింటికీ వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. అక్కడికి వెళ్లాక అరైవల్ వీసా తీసుకోవచ్చు. ఆయా దేశాల్లో ఉండే గడువు మాత్రం ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. ఆ గడువు పూర్తయ్యేవరకు ఆ దేశాల్లో అన్ని ప్రాంతాలను చుట్టి రావచ్చు.
ప్రపంచానికి కెన్యా స్వాగతం
కెన్యా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్ట్‌లంతా వీసా లేకుండానే తమదేశానికి రావచ్చని ఆహ్వానిస్తోంది. జనవరి1, 2024 నుంచి కెన్యా వెళ్లడానికి వీసా అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. డిసెంబర్12న కెన్యా స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో ఈ విషయం తెలిపారు. టూరిజం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కెన్యా అడవుల్లో అన్ని జాతుల వన్య ప్రాణులు ఉన్నాయి. వీటిని చూసేందుకు ప్రత్యేకంగా సఫారీలను ఏర్పాటు చేసింది. గతంలో వీసా తీసుకుని వెళ్తే మూడు నెలలు ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఉండొచ్చు అనే దానిమీద క్లారిటీ లేదు.
రూపాయిని తక్కువ అంచనా వేయొద్దు
ఫారిన్ ట్రిప్‌కి వెళ్లాలంటే ముందు బడ్జెట్ చూసుకోవాలి. మనదేశ కరెన్సీకి, వెళ్లబోయే దేశ కరెన్సీకి మధ్య తేడాను తెలుసుకోవాలి. దాన్ని బట్టి బడ్జెట్ అంచనా వేసుకుని బయల్దేరాలి. మనవాళ్లు ఎక్కువగా విదేశాలు వెళ్లే ముందు యూఎస్ డాలర్స్, యూరోల విలువ ఎంత ఉందో చూసుకుంటారు. అయితే, ఇప్పుడు మన రూపాయిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రూపాయి కూడా బలంగా మారింది. మరి రూపాయి విలువ ఎక్కడ ఎలా ఉందో చూడండి.
కింద ఇచ్చిన దేశాల్లో ఒక ఇండియన్ రూపాయి విలువ
ఇండోనేసియాలో – 86.44 ఇండోనేసియన్ రుపియా
కంబోడియా – 49. 40 కంబోడియన్ రియల్
వియత్నాం – 292.87 వియత్నమేస్ డాంగ్
నేపాల్ – 1.60 నేపాలేస్ రూపీ
శ్రీలంక – 3.93 శ్రీలంకన్ రూపీ
హంగేరి – 4.22 ఫోరింట్
ఐస్లాండ్ – 1.66 ఐస్ లాండిక్ క్రోన
కోస్టారికా – 6.30 కొలొన్
పరాగ్వే – 87.81 పరాగ్వేయన్ గ్వరాని
మంగోలియా – 41.18 మంగోలియన్ తుగ్రిక్
ఉజ్బెకిస్తాన్ – 146.45 ఉజ్బెకిస్తాన్ సొమ్
చిలీ – 11 చిలియన్ పెసొస్
టాంజానియా – 30. 04 టాంజానియన్ షిల్లింగ్స్
పాస్‌పోర్ట్ కూడా అక్కర్లేదు
హిమాలయాల్లో ఉన్న ఈ దేశం నేచర్‌కు కేరాఫ్. ఈ దేశానికి వెళ్లాలంటే వీసానే కాదు.. పాస్‌పోర్ట్ కూడా అక్కర్లేదు. ఏదైనా గుర్తింపు కార్డు లేదా పత్రం చూపిస్తే చాలు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. భారతీయులకు ఎలాంటి షరతులు ఉండవు.
మనీష పరిమి