TGPSC groups special : భారత ప్రభుత్వ చట్టం 1935

బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో భారత ప్రభుత్వం చట్టం-1935 సమగ్రమైంది. ఈ చట్టం 800 సంవత్సరాల బ్రిటీష్​ పార్లమెంట్​ చరిత్రలో ఆమోదించిన అతిపెద్ద చట్టం. ఇది భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా చెప్పవచ్చు. ఈ చట్టంలో మొత్తం 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతలు 70 శాతానికి పైగా అంశాలను అంటే 247 అంశాలను ఈ చట్టం నుంచి స్వీకరించారు. భారత ప్రభుత్వ చట్టం-1935 భారత రాజ్యాంగానికి మాతృక లాంటిదిగా పేర్కొంటారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. 

సమాఖ్య ఏర్పాటు: సైమన్​ కమిషన్ సూచనలను అనుసరించి మన దేశంలో బ్రిటీష్​ వారు సమాఖ్య తరహా విధానం ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ చేశారు. 

ఎ. కేంద్ర జాబితా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేలు, పోస్టాఫీసులు తదితర జాతీయ ప్రాముఖ్యం ఉన్న 59 అంశాలు. 
బి. రాష్ట్ర జాబితా: వ్యవసాయం, నీటిపారుదల, విద్య, స్థానిక స్వపరిపాలన తదితర ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన 54 అంశాలు.
సి. ఉమ్మడి జాబితా: వివాహ, విడాకులు, వారసత్వం తదితర 36 అంశాలను ఈ జాబితాలో చేర్చి వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పించారు. 
అవశిష్ట అంశాలు: పై మూడు జాబితాల్లో పేర్కొనని అంశాలు, కొత్తగా వచ్చే అంశాలు, అవశిష్టాంశాలుగా పేర్కొంటూ వాటిపై బ్రిటీష్​ గవర్నర్​ జనరల్​కు అధికారాలు కల్పించారు. 
కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానం కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు. 
ఎ. కౌన్సిల్ ఆఫ్​ స్టేట్స్​: మొత్తం సభ్యుల సంఖ్య 260. వీరిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు. ఈ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నికవుతారు. అంటే ప్రత్యక్ష ఓటింగ్​ విధానం ద్వారా ఎన్నికవుతారు. 

లెజిస్లేటివ్​ అసెంబ్లీ: మొత్తం సభ్యుల సంఖ్య 375. వీటిలో మూడో వంతు స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. ఇందులోని సభ్యులను రాష్ట్రాల్లోని లెజిస్లేటివ్​ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలు సమాఖ్య వ్యవస్థలో చేరడానికి నిరాకరించడంతో సమాఖ్య విధానం అమలులోకి రాలేదు. 

రాష్ట్రాల్లో ద్విసభా విధానం

భారతదేశంలో మొత్తం 11 బ్రిటీష్​ పాలిత ప్రాంతాల్లో ఆరు రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రాలు అసోం, బెంగాల్​, బిహార్​, యునైటెడ్​ ప్రావిన్స్​, మద్రాస్​, బొంబాయి.

రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి

1919 చట్టం ద్వారా మన దేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దు చేశారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్​డ్​, ట్రాన్స్​ఫర్డ్​ జాబితాలను రద్దు చేసి రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం

1935 చట్టం ద్వారా రాష్ట్రాల్లో రద్దు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టారు. 
రిజర్వ్​డ్​ జాబితా: ప్రాముఖ్యం కలిగిన అధికారాలు, ఆదాయం కలిగిన అంశాలను రిజర్వ్​డ్​ జాబితాగా పేర్కొంటూ వాటిపై బ్రిటీష్​ గవర్నర్​ జనరల్​కు అధికారాలు కల్పించారు.
ట్రాన్స్​ఫర్డ్​ జాబితా: అధికారాలు, ఆదాయం, ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్​ఫర్డ్​ జాబితాగా పేర్కొంటూ వాటిపై భారతీయ మంత్రులకు అధికారమిచ్చారు. భారతదేశంలోని చట్టసభల్లో బలహీన వర్గాలకు, కార్మికులకు, స్త్రీలకు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేశారు.

ఫెడరల్​ కోర్టు ఏర్పాటు

మన దేశంలో సమాఖ్య విధానం ప్రవేశ పెట్టడంతో కేంద్రానికి రాష్ట్రాలకూ, రాష్ట్రాలకూ రాష్ట్రాలకూ మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్​ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో న్యాయమూర్తుల సంఖ్య ఏడు. ప్రధాన న్యాయమూర్తి మారిస్ గ్వేయర్​. ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై అండన్​లోని ప్రీవీ కౌన్సిల్​కు అప్పీలు చేసుకోవచ్చు. 

    భారత్​ నుంచి బర్మా, బీరార్​ను వేరు చేశారు. 
    కేంద్రం, రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్​ కమిషన్లు ఏర్పాటు చేశారు.
    అడ్వకేట్​ జనరల్​ పదవి ఏర్పాటు చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారులను నియమించవచ్చు. 
    సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్​ సౌకర్యాన్ని కల్పించారు. 
    కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్​ బ్రిటీష్ రాణి పరిశీలనకు లండన్​కు పంపే అధికారాన్ని కల్పించారు.
    ఇన్​స్ట్రుమెంట్​ ఆఫ్​ ఇన్​స్ట్రక్షన్స్​ పేరుతో షెడ్యూల్డ్​ జాతులు, షెడ్యూల్డ్​ తెగల సంక్షేమం అంశాలను పొందుపర్చారు.
    గవర్నర్​ జనరల్​కు ఎనలేని అధికారాలు కల్పించడం ద్వారా కేంద్ర లేజిస్లేటివ్​ అసెంబ్లీ తీర్మానాలను వీటో చేసే అధికారంతోపాటు అవసరమైతే ఆ బిల్లులు, తీర్మానానలు బ్రిటీష్​ రాణి పరిశీలన కోసం లండన్​ పంపవచ్చు.
    భారత కౌన్సిల్​ (భారత రాజ్య కార్యదర్శికి సలహాలిచ్చే కౌన్సిల్​) రద్దు చేశారు.
    భారతదేశ విత్తపరమైన అంశాలను 
    క్రమబద్ధీకరించుకోవడం కోసం ఆర్​బీఐను ఏర్పాటు చేశారు.
    భారత ప్రజల్లో కేవలం 10.6 శాతం ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. 
    భారత రాజధానిని ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి తరలించారు.

సైమన్​ కమిషన్ 

భారతదేశంలో బ్రిటీష్​ పరిపాలన తీరును పరిశీలించడానికి బ్రిటీష్​ ప్రభుత్వం నియమించి చట్టబద్ధ కమిషన్​ సైమన్​ కమిషన్​. మాంటేగు ఛేమ్స్​ఫర్డ్​ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించడానికి 1927లో సర్​ జాన్​ సైమన్​ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్​ను ఏర్పాటు చేశారు. ఆనాటి బ్రిటన్​ ప్రధాని బాల్ద్విన్​. 1928లో సైమన్​ కమిషన్​ భారత్​ను సందర్శించింది. మొదట సందర్శించిన ప్రాంతం బొంబాయి. ఈ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని  నిరసిస్తూ భారత ప్రజలకు సైమన్ గో బ్యాక్​ అనే ఉద్యమాన్ని నిర్వహించారు. 1930లో సైమన్ కమిషన్​ లండన్​లో తన నివేదికను బ్రిటీష్​ ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలు.

    భారత్​లో సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
    1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
    పరిపాలనలో భారతీయులకు ఎక్కువగా భాగస్వామ్యం కల్పించాలి.
    చట్టసభల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించాలి.
    పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం.
    భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధ్​ రాష్ట్రాలు ఏర్పాటు.
    సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ.
    ప్రాథమిక హక్కుల నిరాకరణ.
    భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు.
    భారతీయులు కోరిన అధినివేశ ప్రతిపత్తితో కూడుకున్న స్వాతంత్ర్యాన్ని తిరస్కరించడం.

1935 చట్టం అమలు

ఈ చట్టాన్ని 1937లో అమలు చేయడం వల్ల ఆ సమయంలోనే బర్మా ఏర్పాటు అమలులోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించగా, మూడు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.