పరిచయం : తండ్రి యాక్టర్, తల్లి ప్రొడ్యూసర్.. మరి కూతురు?..టీవీ నుంచి ప్రపంచాన్ని మెప్పించింది

తండ్రి యాక్టర్, తల్లి ప్రొడ్యూసర్.. మరి కూతురు? డైరెక్టర్​, ప్రొడ్యూసర్, ఎంట్రప్రెనూర్... ఒక్కమాటలో చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్​. అందుకే ఆమె టాలెంట్​కి మెచ్చి ఆమె పుట్టిన దేశం గర్విస్తే.. ప్రపంచం గౌరవిస్తోంది. ప్రతిభావంతులు, ప్రముఖులకు దక్కే అరుదైన గౌరవం ‘ఎమ్మా’ అవార్డ్ ఆమె సొంతం అయింది. ఎంటర్​టైన్​మెంట్​ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది ఏక్తా కపూర్​. ఇంటర్నేషనల్ అవార్డ్​ ‘ఎమ్మా’ అందుకుంటున్న మొట్టమొదటి ఇండియన్. 

ఏక్తా కపూర్... టెలివిజన్ ప్రొడ్యూసర్, ఫిల్మ్​ ప్రొడ్యూసర్, డైరెక్టర్​. బాలాజీ టెలీఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, క్రియేటివ్​ హెడ్​. బాలాజీ టెలీఫిల్మ్స్​ను ఆమె తండ్రి, నటుడు జితేందర్​ పెట్టాడు. ఆయన తర్వాత ఆ  కంపెనీ బాధ్యతల్ని ఏక్తానే చూసుకుంటోంది. ఆ కంపెనీకి అనుబంధంగా ‘బాలాజీ మోషన్​ పిక్చర్స్’​ అనే మరో కంపెనీని 2001లో లాంచ్​ చేసింది. ఇది ఫిల్మ్​ ప్రొడక్షన్​, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఓటీటీ ప్లాట్​ఫాం ఆల్ట్​ బాలాజీని 2017లో లాంచ్​ చేసింది. అదే ఏడాది ఆమె బయోగ్రఫీని ‘కింగ్​డమ్​ ఆఫ్​ ది సోప్ క్వీన్ : ది స్టోరీ ఆఫ్ బాలాజీ టెలీఫిల్మ్స్’ పేరుతో చేసింది. ఆర్ట్స్ ఫీల్డ్​లో చేస్తున్న కృషికి గుర్తింపుగా 2020లో ‘పద్మ శ్రీ’ అవార్డ్​ దక్కింది. 94వ ఆస్కార్​ అవార్డ్ ప్రదానోత్సవానికి ఏక్తా కపూర్​, ఆమె తల్లి శోభా కపూర్​కు ఆహ్వానం అందింది. లేటెస్ట్​గా ఇంటర్నేషనల్ అవార్డ్​ ఎమ్మాను అందుకోబోతోంది.

ఏక్తా తండ్రి జితేందర్ పాపులర్ హిందీ యాక్టర్, బాలాజీ టెలీఫిల్మ్స్ లిమిటెడ్​కి ఛైర్మన్​. తల్లి శోభా కపూర్​.. టీవీ, సినిమా, వెబ్​ సిరీస్​ల ప్రొడ్యూసర్. బాలాజీ టెలీఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్​ డైరెక్టర్​. వీళ్ల మొదటి సంతానం ఏక్తా కపూర్. మహారాష్ట్రలోని ముంబైలో1975లో జన్మించింది. చిన్నప్పుడు ముంబైలో ‘బాంబే స్కాటిష్ స్కూల్​’, తర్వాత ‘మిథిబాయి కాలేజీ’లో చదివింది. బాలీవుడ్​ యాక్టర్, ప్రొడ్యూసర్​ తుషార్​ కపూర్ ఏక్తా తమ్ముడు. ఏక్తా కపూర్​ పెండ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా 2019లో ఒక మగబిడ్డకు తల్లి అయింది. ఆమె కొడుకు పేరు రవీ కపూర్. 

పదిహేడేండ్లకే కెరీర్ స్టార్ట్

పదిహేడేండ్ల వయసులో ఏక్తా తన కెరీర్​ మొదలుపెట్టింది. మొదట అడ్వర్టైజ్​మెంట్​, ఫీచర్​ ఫిల్మ్​ మేకర్ కైలాష్​ సురేంద్రనాథ్​ దగ్గర ఇంటర్న్​గా పని చేసింది. ‘‘ఆ వయసులో పార్టీలు చేసుకోమని డబ్బులు ఇవ్వలేదు. పెండ్లి చేసుకోమని చెప్పలేదు. ‘ఏదైనా పని చెయ్’​ అని చెప్పాడు నాన్న. అందుకే అడ్వర్టైజ్​మెంట్​ఏజెన్సీలో పనిచేశా’’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పందొమ్మిదేండ్ల వయసులో లండన్​లోని ‘టీవీ ఆసియా’ అనే ఛానెల్​కు సాఫ్ట్​వేర్​ డిజైన్​ చేయమని తండ్రి జితేంద్ర ఆమెకు ఒక ఛాన్స్​ ఇచ్చాడు. ఆ ఛానెల్​ను జితేంద్ర ఫ్రెండ్ కేతన్​ సోమయా రన్​ చేస్తున్నాడు. ఆ పని పట్ల ఏ మాత్రం ఇంట్రెస్ట్​ లేని ఏక్తాకు దీన్ని అప్పజెప్పారు.

తొలి అడుగు పడింది​

‘ది ఫ్రెష్​ ప్రిన్స్​ ఆఫ్​ బెల్​ ఎయిర్​’ వంటి అమెరికన్​  సిట్​కామ్స్​ అంటే చాలా ఇష్టపడేది ఏక్తా. ఆ ఇష్టమే  ఆ ఆఫర్​ను ఒప్పుకునేలా చేసింది. ‘‘నా బుర్రలో ఉన్న ఐదారు ఐడియాలను పైలెట్​ ఎపిసోడ్స్​​ చేయాలనుకున్నా. కానీ ఆ లోపులోనే టీవీ ఏసియా ఛానెల్​ను జీటీవీకి అమ్మేశారు. నేను చేసిన సాఫ్ట్​వేర్​ను కొనేందుకు ఎవరూ రెడీగా లేరు. అక్కడేమో మా పార్ట్​నర్​షిప్​ ముక్కలైపోయింది. మా ఇన్వెస్ట్​మెంట్స్​ అన్నీ పోయాయి. ఆఖరికి చేతిలో రెండు లక్షల రూపాయలు మిగిలాయి. అప్పుడు నేను ‘హమ్​ పాంచ్​’ అనే కాన్సెప్ట్​ పైలెట్​ ఎపిసోడ్​ షూటింగ్ చేశా. దాన్ని జీటీవీకి అమ్మేశా. అప్పుడు నాకు పందొమ్మిదేండ్లు” అని టీవీ ఇండస్ట్రీలోకి అడుగు ఎలా పడిందో చెప్పింది. ‘హమ్​ పాంచ్’ హిట్​ అవ్వడంతో బాలాజీ టెలీ ఫిల్మ్స్​తోపాటు ఏక్తా కపూర్​ పేరు కూడా అందరికీ తెలిసింది. 

‘‘ప్రొడక్షన్​ పనిని ఎంజాయ్​ చేస్తూ చేశా. కొన్ని షోలు ఎక్కువ ఖర్చు పెట్టి, కొన్నేమో తక్కువ బడ్జెట్​లో చేశా. సవాళ్లను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు అదే ప్రొడక్షన్​ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయా. అది ఎంతగా అంటే.. తింటున్నా, తాగుతున్నా ఆఖరికి నిద్రలో ఉన్నా.. అదే ఆలోచన. ఇంకా చెప్పాలంటే టెలివిజన్​ని పెండ్లాడా అని చెప్పొచ్చు. కానీ, ఇదంతా డబ్బు కోసం కాదు. నేను తీసే కంటెంట్ నాకు సంతోషాన్నిస్తుంది. అందుకే నేను అంత ఇన్వాల్వ్ అయి పని చేస్తా’’ అంటుంది ఏక్తా. 

రజనీకాంత్​ వల్ల సౌత్​లో కూడా...

ఏక్తా కపూర్ తీసే కంటెంట్​ కేవలం కొందరికే రీచ్ అవుతోంది. అలాకాకుండా దక్షిణాదికి కూడా పరిచయం చేయాలనుకుంది. ఆ ఆలోచన వచ్చాక ఒకసారి ఒక పార్టీలో రజినీకాంత్​ని కలిసిందామె. ఆయన ఏక్తా తండ్రి జితేంద్ర దగ్గర ఆమె టాలెంట్​ని పొగిడారట. ఆ తర్వాత టెలివిజన్​లో స్లాట్ కోసం తమిళనాడు వెళ్తే అక్కడ నార్త్ ఇండియన్స్​ని వేరుగా చూస్తారని అర్థమైంది ఏక్తాకి. స్లాట్ దొరకడం చాలా కష్టం అనిపించింది. కానీ, అప్పుడు రజినీకాంత్​ ఫోన్ చేసి ‘సన్​ టీవీ’లో నాన్​ ప్రైమ్ టైం స్లాట్​ ఇప్పించాడు. ‘కుడుంబమ్’ అనే పేరుతో ఒక షో చేసింది. దానికి ఆమె డైలాగ్ రైటర్.​ కాగా ఆమె అకౌంట్స్ చూసే హెడ్​ని ట్రాన్స్​లేటర్​గా పెట్టుకుంది. ఆ షో నాన్​ ప్రైమ్​ టైంలో టెలికాస్ట్​ అయినప్పటికీ పెద్ద హిట్​ అయింది. దాంతో ఆ షోని ప్రైమ్​ టైంలో వచ్చేలా షెడ్యూల్ చేశారు. అంతేకాదు.. ఆ షోని 1999లో ‘ఘర్ ఏక్ మందిర్’ పేరుతో రీమేక్​ చేసి, సోనీ టీవీలో టెలికాస్ట్​ చేశారు.

నిలబెట్టుకోవడం కష్టం

కంపెనీ పెట్టాక దాని ఎదుగుదల కోసం ఎంతో కష్టపడింది. ఆ ప్రయాణంలో ఆమె ఎన్నోసార్లు వదిలేద్దాం అనుకుందట. కెరీర్ బాగానే సాగుతున్నా.. సక్సెస్ మాత్రం స్లోగా వచ్చింది ఆమెకి. ‘‘ బిజినెస్​లో కోటి రూపాయలు నష్టం వచ్చింది. ఒక షోకి ఒకరోజుకి రెండు నుంచి ఆరు లక్షలు లాస్​. దాంతో మా షోని పది సెకండ్లు ఎనిమిది వేలకు అమ్మితే బ్రేక్ ఈవెన్​ అవుతుందని సజెస్ట్​ చేశారు. కానీ, మా దగ్గర ఉంది ఇరవై వేల సెకండ్ల కంటే ఎక్కువ. అప్పుడే పది సెకండ్లను రెండు వేల రూపాయలకు కొంటాం అని ఒక ఏజెన్సీ వచ్చింది. కానీ, అమ్మ ‘తొందర పడొద్దు. కొంచెం ఆగుదాం’ అని చెప్పింది. అమ్మ చెప్పినట్టే వెయిట్ చేశాం. చివరకు సెకండ్​కి పాతిక వేల చొప్పున అమ్మాం. ఆ టైంలో ఇలాంటి పరిస్థితి మా ఫ్యామిలీకి మళ్లీ రాకూడదంటే... నేను ఈ పనికి బైబై చెప్పాలనుకున్నా”అని అప్పటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. హిందీలో ఎంటర్​టైన్​మెంట్ ఛానెల్ ‘స్టార్ ప్లస్’​తో కలిసి ఏడేండ్లు నడిచింది. ‘క్యోం​కి సాస్​ బీ కభీ బహూ థీ’, ‘కహానీ ఘర్​ ఘర్​ కీ’ వంటి టీవీ సీరియల్స్ ఇండియన్ టెలివిజన్​లో హిస్టరీ క్రియేట్ చేశాయి. అత్తాకోడళ్ల డ్రామాతో ఉత్తర, దక్షిణ భారతదేశంలో చాలామంది ఇండ్లలోకి వెళ్లిపోయింది. అలా ఆమె ‘క్వీన్​ ఆఫ్ ఇండియన్ టెలివిజన్​’గా పేరు తెచ్చుకుంది. కానీ స్టార్​తో బాలాజీ చేసుకున్న ఒప్పందం దాటి క్యోంకి సాస్​ బీ కభీ బహూ థీ సీరియల్​ రైట్స్​ను వేరే ఛానెల్​కు ఇచ్చారు. ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. అలా 2008 వరకు ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

టీవీ నుంచి సినిమాల వైపు..

‘‘ఆ టైంలో నేను ఐదు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లా. కంటెంట్​ని క్రియేట్ చేయడమే లోకంగా బతికా. కానీ.. అవేవీ పనిచేయలేదు. స్టార్​ ప్లస్​తో పార్ట్​నర్ షిప్ అయిపోయాక కొత్త ఛానెల్స్, కొత్త షోలు, కాన్సెప్ట్​లు వచ్చాయి. దాంతో ప్రజలు దాదాపు ఐదేండ్లు మా సీరియల్స్ చూడలేదు’’ అని చెప్పిందామె. దాంతో ఆమె దృష్టి టీవీ నుంచి సినిమాల మీదకు మళ్లింది.

నిజానికి ఆమె సినిమాల వైపు వెళ్లాలనుకోలేదు. కానీ, ఒక టైంలో ఆమె నడిపిస్తున్న కంపెనీ ఒకే మీడియంపై ఆధారపడితే కష్టం అని అర్థం చేసుకుంది. దాంతో కంపెనీని విస్తరించాలి అనుకుంది. దానికి ఉన్న ఒకే ఒక మార్గం సినిమా. అలా ఆమె సినిమా ఇండస్ట్రీలో భాగమైంది. టీవీలో ఎలాగైతే కొత్త టాలెంట్స్​ని పరిచయం చేసిందో... అలాగే సినిమాల్లోనూ చేయాలనుకుంది. కాకపోతే... ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు బాలెన్స్ ఉండడం ముఖ్యం అనుకుంది. అలా ‘ఆల్ట్ ఎంటర్​టైన్​మెంట్’​ అనే ప్రొడక్షన్ హౌస్​ని 2010లో ప్రారంభించింది. ఇది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా టీవీ షోలు, వి ఛానెల్​లో ‘గుమ్రా’ వంటి షోలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం బాలాజీ టెలీ ఫిల్మ్స్​ ‘నాచ్ బలీయే’ వంటి రియాలిటీ షోలు చేస్తోంది. అలాగే బాలాజీ మోషన్ పిక్చర్స్ నుంచి ఏటా దాదాపు పది సినిమాలు విడుదలవుతాయి. ఇవే కాకుండా.. టెలివిజన్ ఫ్యాషన్ బ్రాండ్​ ‘ఇకె’ పేరుతో బట్టల బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బట్టలు ఆమె టీవీ షోల్లో కనిపించే ఫ్యాషన్​ బట్టి తయారుచేసినవే. 

నేను సలహాలు ఇవ్వను. కానీ ఎప్పుడూ ఎగ్జాంపుల్​గా ఉండాలనుకుంటా. ఆ పని చెయ్, ఈ పని చెయ్​ అని అవతలి వాళ్లకు చెప్పడం వల్ల ఏమీ జరగదు. నేను చేస్తున్న పని చూసి వాళ్లు నేర్చుకోవాలి. ఎతిక్స్ అనేవి డి.ఎన్.​ఎ.లోనే ఉండాలి. నేను మహిళను కాబట్టే ఇక్కడి వరకు రాగలిగా అని గట్టిగా చెప్పగలను. ఆడవాళ్లకు శక్తివంతమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టు మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాం. 

అప్పుడు అమ్మకి నాకు పడేది కాదు

మొదటి నుంచి అమ్మ ప్రొడక్షన్, ఫైనాన్స్ విషయాలు చూసుకునేది. నేను క్రియేటివ్ పార్ట్ చూసుకునేదాన్ని. లుక్స్, డిజైన్, సీన్ బ్రేక్​ అప్ వంటివన్నమాట. దాంతో అమ్మ చేసే పని నేను చేయలేకపోయేదాన్ని. ఆమె ఎప్పుడూ బడ్జెట్ మేనేజ్​మెంట్ గురించి ఆలోచిస్తుంది. నేనేమో క్రియేటివ్​గా చేయడం కోసం ఎంత డబ్బయినా ఖర్చుపెట్టాలనుకుంటా. ఆమెకి డబ్బులు కావాలి. నాకు టీఆర్​పీలు. ఇలాంటప్పుడే మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేవి. 2008 తర్వాత అదంతా మారిపోయింది. నేను కూడా బడ్జెట్​ గురించి ఆలోచించడం మొదలుపెట్టా.