ఇండియా ఫస్ట్ : క్యాన్సర్ చికిత్సకు మొదటి ఆయుర్వేద పరిశోధనా కేంద్రం

2026 నాటికి, ఆయుర్వేదం సహాయంతో క్యాన్సర్‌ను నయం చేసే మార్గాలను కనుగొనే మొదటి హాస్పిటల్-కమ్-రీసెర్చ్ సెంటర్‌ను భారతదేశం పొందనుంది. త్వరలోనే కొంతమంది రోగులపై కూడా ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. టాటా మెమోరియల్ సెంటర్ ఈ చొరవను చేపట్టింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి వద్ద 21 ఎకరాల స్థలంలో దీన్ని నిర్వహించనుంది.

ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు అల్లోపతి ద్వారా మాత్రమే చికిత్స చేయబడుతుందని, ఇది చాలా దుష్ప్రభావాలతో కూడినదని టాటా హాస్పిటల్ క్యాన్సర్ విభాగం (తల, మెడ) విభాగాధిపతి డాక్టర్ పంకజ్ చతుర్వేది అన్నారు. అంతే కాదు ఈ ప్రక్రియ చాలా ఖరీదైనదని, చాలా మంది దీని కోసం తమ ఇళ్లను కూడా అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత చికిత్సలో జీవితకాల దుష్ప్రభావాలు

"మనమందరం (క్యాన్సర్) చికిత్సను అభివృద్ధి చేయడానికి లేదా ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఇది మరింత ప్రభావవంతంగా ఉండాలి. దీనిపై దేశవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుత ట్రీట్‌మెంట్ వల్ల జీవితాంతం దుష్ప్రభావాలు ఉంటాయి. అంతేకాదు వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం కూడా ఉంది” అని డాక్టర్ చతుర్వేది చెప్పారు. "అందువల్ల, ఇటువంటి ఔషధం తయారీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇది చికిత్స ముగిసిన తర్వాత కూడా రోగి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శతాబ్దాలుగా మానవులకు మేలు చేసే మూలికల కోసం టాటా హాస్పిటల్ శోధిస్తోంది”  అని అన్నారు.

ఆయుర్వేదంపై ఫార్మా కంపెనీలు పనిచేయవని తెలిపిన డాక్టర్ చతుర్వేది.. క్యాన్సర్ నయం చేయలేని వ్యాధి అని, కొన్ని సందర్భాల్లో సరైన చికిత్సను రూపొందించడం కూడా చాలా కష్టమని అన్నారు. “అల్లోపతి.. క్యాన్సర్‌ను రేడియేషన్, కీమోథెరపీ, శస్త్రచికిత్స ప్రక్రియలతో చికిత్స చేస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ చికిత్సలన్నీ చాలా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. దీనికి విరుద్ధంగా, ఆయుర్వేద శాస్త్రం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ కీమోథెరపీ, రేడియేషన్ రెండూ కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి”అని ఆయన వివరించారు.

డాక్టర్ చతుర్వేది కొన్ని ఔషధ మొక్కలు, మూలికల సహాయంతో క్యాన్సర్‌ను నయం చేస్తామని తెలుపుతూ.. అనేక సార్లు ప్రకటనలు లేదా సోషల్ మీడియా వీడియోల ద్వారా రోగులను తప్పుదోవ పట్టించే వాస్తవాన్ని హైలైట్ చేశారు. “ఆయుర్వేద ఔషధాలపై పరిశోధన చేయడం, క్యాన్సర్ చికిత్సలో అవి నిజంగా సహాయకారిగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మా ప్రధాన ఉద్దేశ్యం. దీని కోసం ట్రయల్స్ కూడా నిర్వహిస్తాం" అని ఆయన చెప్పారు.

Also Read :- సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ రైలు 6 గంటలు ఆలస్యం