న్యూఢిల్లీ: పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడాలంటూ యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు ఇచ్చింది. పాలస్తీనాకే తాము ఓటు వేస్తున్నట్లు ప్రకటించింది. మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాశ్వత శాంతిని నెలకొల్పాలని మరోసారి స్పష్టం చేసింది. మొత్తం 193 సభ్య దేశాలతో కూడిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 'పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం'పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
1967 నుంచి తూర్పు జెరూసలెం సహా పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై శాంతియుత పరిష్కారం కోరుతూ రెడీ చేసిన ముసాయిదాకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని, దాడులను, హింసాత్మక చర్యలను తక్షణమే ఆపాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి భారత్ సహా 157 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా సహా ఎనిమిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.ఉక్రెయిన్, కామెరూన్, చెకియా, ఈక్వెడార్, జార్జియా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి.