పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఆగష్టు 21) బయలుదేరి వెళ్లారు. వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించనున్న భారత ప్రధాని.. అనంతరం రష్యాతో యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో కాలు పెట్టనున్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, వార్సాలో ప్రధానమంత్రికి లాంఛనప్రాయ స్వాగతం పలుకుతారు. అనంతరం మోదీ.. పోలాండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ సెబాస్టియన్ డుడాతో సమావేశం కానున్నారు. ఆపై ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బుధవారం సాయంత్రం వార్సాలో జరిగే కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీతో ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
భారత్, పోలండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు.
PM @narendramodi emplanes for his visit to Poland and Ukraine. pic.twitter.com/m2gfxhosUI
— PMO India (@PMOIndia) August 21, 2024
ఉక్రెయిన్ పర్యటన
పోలాండ్ పర్యటన అనంతరం ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 23న ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకోనున్నారు. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి రైలు మార్గంలో పోలాండ్ చేరుకోనున్నారు. 1992లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వాధినేత ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
యుద్ధం కొనసాగుతోంది
కాగా, గతేడాది ప్రారంభమైన రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. రష్యా జరిపిన భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలన్నీ నేలమట్టమవ్వగా.. ఇప్పుడు జెలెన్‌స్కీ సైన్యం అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. రష్యా భూభాగంలోని ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రష్యాలో 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులలో భారత ప్రధాని అక్కడ పర్యటించాలనుకోవడం సాహసమని చెప్పుకోవాలి.