ఇండియన్‌ ఆర్మీకి మరో 73 వేల ఎస్‌ఐజీ రైఫిల్స్‌... యూఎస్​తో ఇండియా ఒప్పందం

న్యూఢిల్లీ: అమెరికాతో ఇండియా భారీ వెపన్‌ డీల్‌ కుదుర్చుకుంది. 73 వేల ఎస్‌ఐజీ 716 రిఫైల్స్‌ కొనుగోళ్లకు తాజాగా ఇండియా ఒప్పందం చేసుకుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అల్లర్లు, తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, దాయాది పాకిస్తాన్‌తో టెర్రరిస్టుల ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తన ఆయుధ సంపత్తిని మరింత స్ట్రాంగ్‌ చేయడంలో భాగంగా అమెరికాతో ఈ ఆయుధాల కొనుగోలు అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.837 కోట్లని సమాచారం.

అంతకుముందు 2019లో 72,400 ఎస్‌ఐజీ 716 రైఫిల్స్‌ కొనుగోలుకు అమెరికాతో ఇండియా ఒప్పందం చేసుకుంది. దీంతో మొత్తం 1,45,400 ఎస్‌ఐజీ 716 రైఫిల్స్‌ ఇండియన్‌ ఆర్మీకి అందనున్నాయి. ఈ రైఫిళ్లను చైనా, పాకిస్తాన్‌ సరిహద్దు వెంబడి మొహరించిన బెటాలియన్‌ సైనికులకు అందించనున్నారు. 500 మీటర్స్‌ రేంజ్‌ కలిగిన ఈ ఎస్‌ఐజీ అస్సాల్ట్‌ రైఫిల్స్‌ ఇండియన్‌ ఆర్మీలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. కాగా, ఇండియన్ ఆర్మీ ఆధునీకరణలో తాము భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని సిగ్‌ సాయర్‌‌ కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో రాన్‌ కొహెన్‌ పేర్కొన్నారు.