బంగ్లాదేశ్ హిందువులపై 2200 కేసులు..భద్రతపై భారత్ ఆగ్రహం

బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో  హిందువులు మైనార్టీలపై  హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

బంగ్లాదేశ్ లో ఒక్క ఏడాది కాలంలో (2024)నే 2200 కేసులునమోదు అయ్యాయని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.  మరోవైపు పాకిస్తాన్ లో 112 కేసులు రికార్డయ్యాయని రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. 

బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో హిందువులపై హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. హింసాత్మక ఘటనలపై రెండు దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది.  హిందువులు, ఇతర మైనార్టీల భద్రతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. 

మరోవైపు బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు యూనస్ సహాయకుడు ముహ్పుజ్ ఆలం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారి తీసిన తిరుగుబాటును భారత్ గుర్తించాలని ఆలం సూచించారు. అయితే ఈ పోస్ట్ ను ఇప్పడు తొలగించారు. ఈ పోస్ట్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్ ప్రజలు, మధ్యంతర ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేయాలని భారత్ కోరుకుంటున్నప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు, బహిరంగ ప్రకటన బాధ్యతారాహిత్యం అని విదేశాంగ మంత్రి ప్రతినిధి జైశ్వాల్ అన్నారు. 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, భారత్ కు వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బలహీనమయ్యాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై హింసాత్మక దాడుల ఎక్కువయ్యాయి. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. బంగ్లా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేయడం, బంగ్లాదేశ్ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. హిందుదేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. హిందువులతో పోలీసులు ఘర్షణ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రాజ్యసభలో డేటాను సమర్పిస్తూ MEA బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటికీ లేఖలు రాసింది. ఆ దేశాలలో హిందువుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించాలని ఆయా ప్రభుత్వాలను కోరింది.