భారత్ ఇప్పుడు ఆహార మిగులు దేశం

  • ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారం చూపే స్థాయికి ఎదిగాం: మోదీ
  • పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో నంబర్ 1గా ఉన్నం
  • వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సులో ప్రధాని

న్యూఢిల్లీ: భారత్  ఇప్పుడు ఆహార మిగులు దేశంగా ఎదిగిందని, ప్రపంచ ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని రైతులకు బడ్జెట్ లో పెద్దపీట వేశామని, స్వయంసమృద్ధి సాధించేలా బడ్జెట్  రూపొందించామని ఆయన పేర్కొన్నారు. 65 ఏండ్ల తర్వాత ఢిల్లీలో శనివారం నిర్వహించిన వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఏఈ) లో మోదీ మాట్లాడారు. 

చివరిసారిగా ఐసీఏఈ సదస్సు జరిగినప్పుడు దేశ వ్యవసాయం, ఆహార భద్రత సవాళ్లు ఎదుర్కొనే స్థితిలో ఉందని ఆయన గుర్తుచేశారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆహార మిగులు దేశంగా మన దేశం ఎదిగిందన్నారు. ‘‘పాలు, పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా ఇప్పుడు నంబర్ వన్ గా ఉంది. అలాగే ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, తేయాకు పంటల ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది” అని మోదీ పేర్కొన్నారు. 

చిన్న రైతులే ఆహార భద్రతకు అతిపెద్ద బలం

దేశ ఆర్థిక విధానాల్లో వ్యవసాయమే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 90 శాతం రైతులకు చాలా తక్కువ మొత్తంలో భూమి ఉందని, ఆ చిన్న రైతులే దేశ ఆహార భద్రతకు అతిపెద్ద బలమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో సమ్మిళిత వృద్ధి కోసం వ్యవసాయ రంగానికి గత పదేండ్లలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి ఆయన వివరించారు. ఏటా 10 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. రసాయనరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్  కలిపే లక్ష్యం దిశగా సాగుతున్నామని తెలిపారు. పోషకాహార సవాళ్లను అధిగమించేందుకు ‘శ్రీ అన్న, మిల్లెట్’ పరిష్కారం చూపగలదన్నారు.