ధ్వని కంటే 5 రెట్ల స్పీడ్.. హైపర్ సోనిక్ సూపర్ సక్సెస్

  • సత్తా చాటిన తొలి స్వదేశీ లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిసైల్
  • ధ్వని కంటే 5 రెట్లు వేగం.. 1,500 కి.మీ. దూరంలోని టార్గెట్ పేల్చివేత 
  • హైపర్ సోనిక్ టెక్నాలజీలో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్
  • ఇది చరిత్రాత్మక ఘట్టం: రక్షణ మంత్రి రాజ్ నాథ్

న్యూఢిల్లీ: భారత్ తొలిసారి లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. హైపర్ సోనిక్ టెక్నాలజీలో అమెరికా, రష్యా, చైనా దేశాలకు దీటుగా సత్తా చాటింది. శనివారం రాత్రి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి తొలి దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆదివారం ప్రకటించింది. 

గత రెండు నెలలుగా మిసైల్ కు వరుస టెస్టులు నిర్వహించిన తర్వాత శనివారం చివరిగా ఫ్లైట్ టెస్ట్ ను చేపట్టగా.. అది పూర్తి స్థాయిలో సత్తా చాటిందని వెల్లడించింది. ఈ మిసైల్ ధ్వని వేగానికి 5 రెట్ల స్పీడ్ (మ్యాక్ 5)తో దూసుకెళ్లి..1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని తెలిపింది. మార్గమధ్యంలో విన్యాసాలు చేయడంతోపాటు తన దారిని సైతం మార్చుకుంటూ క్షిపణి అన్ని రకాలుగా అద్భుతమైన సత్తాను చాటిందని పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో మోహరించిన అనేక వ్యవస్థల ద్వారా ట్రాక్ చేయగా.. మిసైల్ అన్ని విషయాల్లోనూ అద్భుతంగా పని చేసినట్టు గుర్తించామని వెల్లడించింది. 

ధ్వని కంటే 5 రెట్ల స్పీడ్.. 

సాధారణంగా ధ్వని ఒక గంటకు 1,235 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని మ్యాక్ 1 అంటారు. మిసైల్స్ ఇంతకంటే ఎక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తే వాటిని సూపర్ సోనిక్ గా, కనీసం 5 రెట్లు ఎక్కువ (గంటకు 6,174 కి.మీ.) స్పీడ్ తో ప్రయాణించేవాటిని హైపర్ సోనిక్ గా పిలుస్తారు. డీఆర్డీవో తాజాగా పరీక్షించిన మిసైల్ మ్యాక్ 5 వేగంతో దూసుకెళ్లడంతోపాటు..1,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ఛేదించి సత్తా చాటింది. 

దీంతో తొలి స్వదేశీ  లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించినట్లయింది. ఈ క్షిపణిని హైదరాబాద్ లోని అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, ఇతర డీఆర్డోవో ల్యాబ్ లు కలిసి తయారు చేశాయి. భారత్ ఇదివరకే రష్యాతో కలిసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను తయారు చేసింది. దీనిని మాడిఫై చేసి హైపర్ సోనిక్ వెర్షన్ ను కూడా డీఆర్డీవో రూపొందిస్తోంది. 

రాడార్లు గుర్తించేలోపే.. ఖేల్ ఖతం 

బాలిస్టిక్ క్షిపణులు కూడా మ్యాక్ 5కు ఎన్నో రెట్ల స్పీడ్ తో దూసుకెళ్తాయి. అవి అట్మాస్పియర్ వెలుపలికి దూసుకెళ్లి.. టార్గెట్ ఉన్న చోట మళ్లీ అట్మాస్పియర్ లోకి ఎంటరై ఛేదిస్తాయి. కానీ అవి ముందుగా నిర్దేశించిన మార్గంలో మాత్రమే ప్రయాణిస్తాయి. అయితే, హైపర్ సోనిక్ మిసైల్స్ మాత్రం అట్మాస్పియర్ లోనే అత్యంత వేగంతో దూసుకెళ్తాయి. 

మార్గమధ్యంలో విన్యాసాలు చేస్తూ, మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తాయి. దీంతో వీటిని శత్రుదేశాల రాడార్లు గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ రాడార్లు గుర్తించినా, ఇంటర్ సెప్టర్ మిసైల్స్ తో అడ్డుకునేలోపే.. ఇవి టార్గెట్లను చేరుకుని పేల్చేస్తాయి. మిలిటరీలో అత్యంత కీలకమైన హైపర్ సోనిక్ మిసైల్స్ ను ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా మాత్రమే అభివృద్ధి చేసుకున్నాయి. 

తాజాగా భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు కూడా ప్రస్తుతం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నాయి. 

ఇది అద్భుతమైన విజయం: రాజ్ నాథ్ సింగ్

 తొలి లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం అద్భుతమైన విజయమని, దేశానికి ఇది చరిత్రాత్మక ఘట్టమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత మిలిటరీ పవర్ ను గణనీయంగా పెంచే ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన డీఆర్డీవో సైంటిస్టులను ఆయన అభినందించారు. ఈ మిసైల్ టెస్టుతో అతికొద్ది దేశాలకు దీటుగా మనం సత్తా చాటినట్టు అయిందని ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. నేవీతోపాటు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడా ఈ మిసైల్ ను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు.