హరిత హైడ్రోజన్ దిశగా భారత్

ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న  ప్రకృతి విపత్తులకు మూలకారణం వాతావరణ మార్పు.  వాతావరణ మార్పులకు కారణం పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి కార్బన్ సంబంధిత  శిలాజ ఇంధనాలను మండించటం. హరిత హైడ్రోజన్ (గ్రీన్ హైడ్రోజన్)  వంటి   పునరుత్పాదక  ఇంధనాలను వాడటం ద్వారా గ్లోబల్ వార్మింగ్​ను తగ్గించి తద్వారా వాతావరణ మార్పులను నివారించవచ్చును. స్కాట్లాండ్​లో  నిర్వహించిన  కాప్26  సదస్సులో 2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50% పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటామని, 2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా భారత్ మారుతుందని  మనదేశం హామీ ఇచ్చింది.  హరిత హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా జీ20 దేశాలలో గ్రీన్ ఎనర్జీపై  పారిస్‌‌ ఒప్పందానికి సంబంధించిన హామీలను నెరవేర్చిన మొదటి దేశంగా భారత్​ నిలబడుతుంది. 

భారతదేశం 2047 నాటికి ఇంధన శక్తిపరంగా స్వతంత్రంగా మారడం, 2070 నాటికి నికర జీరో ఉద్గరాలను  సాధించడంపై దృష్టి పెట్టింది.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రంగాలలో పునరుత్పాదక ఇంధన  వినియోగాన్ని పెంచడం భారతదేశ ఇంధనశక్తి పరివర్తనలో ప్రధానమైనది.  ఈ పరివర్తనను సాధించడానికి హరిత హైడ్రోజన్  మంచి ప్రత్యా మ్నాయంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం,  ఎగుమతి కోసం భారతదేశం గ్లోబల్ హబ్‌‌గా మారాలని చూస్తోందని ప్రధాని మోదీ 11 సెప్టెంబర్ 2024 నాడు తెలిపారు. ఈక్రమంలో  భారతదేశం ఇప్పటికే 2023లో  నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్​ను  ప్రారంభించింది.  హరిత హైడ్రోజన్ అనేది  హైడ్రోజన్ వాయువును కలిగిన  ఒక పునరుత్పాదక ఇంధనం. 

పునరుత్పాదక ఇంధనాలు అంటే ఏమిటి?

ప్రకృతి వనరుల నుంచి తరిగిపోని,  తిరిగి పొందే  విధంగా  తయారుచేసిన ఇంధనాలను ‘పునరుత్పాదక ఇంధనాలు’ ( రెన్యూవబుల్ ఎనర్జీ) అని అంటారు. ఉదాహరణకు సూర్యుని నుంచి తయారుచేసే  సౌరశక్తి,  నీటి నుంచి తయారుచేసే జల విద్యుత్,  హరితహైడ్రోజన్, గాలి నుంచి తయారుచేసే పవన విద్యుత్ మొదలగునవి.  పునరుత్పాదక ఇంధనాలన్నీ పర్యావరణ అనుకూలమైనవి.  కాగా, ప్రకృతి వనరుల నుంచి తరిగిపోయే,  తిరిగి పొందలేని  తయారు చేసిన 
ఇంధనాలను ‘పునరుద్ధరించలేని’  (నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ) ఇంధనాలు  అని అంటారు. ఈ ఇంధనాలు పర్యావరణానికి హానికరమైనవి. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, బొగ్గు మొదలగు శిలాజ ఇంధనాలు. 

గ్రీన్​ హైడ్రోజన్ ఎందుకు పర్యావరణ అనుకూలం? 

హరిత హైడ్రోజన్ (గ్రీన్ హైడ్రోజన్‌‌)ను  తయారుచేయటానికి కావలసిన ముడి పదార్థం నీరు.  నీటి అణువులను, హైడ్రోజన్, ఆక్సిజన్​లుగా  విద్యుద్విశ్లేషణ ప్రక్రియ ద్వారా  విడదీయడం వల్ల హరిత హైడ్రోజన్ ఏర్పడుతుంది. ఈ విద్యుద్విశ్లేషణ ప్రక్రియకు కావలసిన  విద్యుత్ శక్తి,  సౌరశక్తి లేదా  పవన శక్తి వంటి పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి  ఉత్పత్తి చేయబడుతుంది.  హరిత హైడ్రోజన్​ను   గాలి  సమక్షంలో  మండించినప్పుడు కావలసిన శక్తి విడుదలై  తిరిగి నీరు విడుదల అవుతుంది.  హరిత హైడ్రోజన్‌‌ను మండించటం వలన కార్బన్ డయాక్సైడ్,  నైట్రోజన్ ఆక్సైడ్,  సల్ఫర్ ఆక్సైడ్,  నలుసు పదార్థాలు (పార్టిక్యూలేట్ మ్యాటర్) వంటి  గ్లోబల్ వార్మింగ్​కు  కారణమైన ఉద్గారాలు విడుదల కావు.  అంటే,  హరిత  హైడ్రోజన్​ను మండించటం  వలన నీరు తప్ప ఎటువంటి  హానికర ఉద్గారాలు  విడుదల కావు.  దీనిని ‘సున్నా’ ఉద్గారాలు అంటారు. హరిత  హైడ్రోజన్ తయారీకి వాడే ముడిపదార్థం, తయారీ విధానం,  మండించినప్పుడు ఉద్గారాలు వెలువడవు. ఈ మొత్తం ప్రక్రియ పర్యావరణ అనుకూల మైనది.  హరిత  హైడ్రోజన్ దహనంలో ఉత్పత్తి చేసిన నీటిని,  తాగునీరుగా  లేదా పరిశ్రమలలో నీటి  అవసరాల కోసం వాడవచ్చును లేదా ఈ  నీటిని వాతావరణంలోకి విడుదల చేయవచ్చును. 

ఏటా ఐదు మిలియన్ టన్నుల హరిత  హైడ్రోజన్ ఉత్పత్తికి భారత్​ సన్నద్ధం

కౌన్సిల్ ఆఫ్​ ఎనర్జీ,  ఎన్విరాన్మెంట్, వాటర్  నివేదిక ప్రకారం హరిత  హైడ్రోజన్ ఉత్పత్తికి  84 గిగావాట్ (జీ.డబ్ల్యూ) పవనశక్తి,  51 గిగావాట్ (జీ.డబ్ల్యూ)సౌరశక్తి అవసరం.  అవసరమైన ఈ మొత్తం పునరుత్పాదక శక్తిలో గుజరాత్,  తమిళనాడు రాష్ట్రాలు వరుసగా 43%,  24%  సమకూర్చుతాయి.  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇతర ముఖ్య రాష్ట్రాలు కూడా ఈ మిషన్​లో గణనీయంగా సహాయపడతాయి.  నేషనల్  గ్రీన్  హైడ్రోజన్  మిషన్  2030 నాటికి 10.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.  అదేవిధంగా భారతదేశం  ఏటా ఐదు మిలియన్  టన్నుల హరిత  హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి  సన్నద్ధం అవుతుంది. 

అంతర్జాతీయంగానూ భారత్​ ప్రధాన పాత్ర 

పునరుత్పాదక శక్తి లభ్యత పెరుగుతున్న  కారణంగా భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి సగటు వ్యయం రెండు శాతం తగ్గుతుంది.   ఫలితంగా వార్షికంగా రూ.18,800 కోట్లు ఆదా అవుతుంది.  ఇది హరిత హైడ్రోజన్‌‌ భారతదేశంలో  మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, హరిత  హైడ్రోజన్‌‌కు  గ్లోబల్  డిమాండ్ పెరిగేకొద్దీ ఇందులో భారతదేశం పెట్టిన పెట్టుబడి అంతర్జాతీయస్థాయిలో దేశాన్ని ప్రధాన పాత్రధారిగా నిలబెట్టగలదు.  హరిత హైడ్రోజన్ వాయువును ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనఘటం (హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్) లో  విద్యుత్తును,  నీటిని   తయారుచేయవచ్చును.

దేశంలో టాటా మోటర్స్​ డిజైన్​ చేసిన హైడ్రోజన్​ బస్సు

1969వ సంవత్సరంలో మానవుడు చంద్రునిపై అడుగు పెట్టడంకోసం ఉపయోగించిన అపోలో11 వ్యోమనౌకకు అవసరమైన విద్యుత్   తో పాటు,  వ్యోమగాములకు  తాగడానికి అవసరమైన నీటిని తయారుచేయడం కోసం హైడ్రోజన్ ఇంధన ఘటంను ఉపయోగించడం జరిగింది.  సెప్టెంబర్ 2023లో టాటా మోటార్స్  భారతదేశపు మొట్టమొదటి  హైడ్రోజన్ ఇంధనఘటం బస్సును డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలో రవాణా రంగంలో గ్రీన్ మొబిలిటీకి ఒక కీలక మైలురాయి లాంటిది. ఈ బస్సు శబ్దం లేనిది, సున్నా ఉద్గారాలను కలిగి ఉంటుంది.  హరిత హైడ్రోజన్  వలన శిలాజ ఇంధనాల వాడకం తగ్గి రిఫైనరీలు, ఎరువులు, ఉక్కు, హెవీ డ్యూటీ రవాణా  ఇలా అనేక రంగాలు ప్రయోజనం పొందుతాయి. అదేవిధంగా వాతావరణ మార్పులను నివారించవచ్చును.

శ్రీధరాల రాము,  ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్  ఎన్విరాన్మెంటల్ సైన్సెస్