మన్మోహన్​ జీ.. అల్విదా .. ముగిసిన మాజీ ప్రధాని అంత్యక్రియలు

  • ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్​లో  అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు 
  • తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కూతురు ఉపీందర్ సింగ్
  • కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర
  • హాజరైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, రాహుల్, ఖర్గే   
  • భూటాన్ రాజు వాంగ్ చుక్, మారిషస్ మంత్రి ధనంజయ్ కూడా హాజరు

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలతో అద్భుతాలు సృష్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశం అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శనివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో ముగిశాయి. భద్రతా బలగాలు 21 గన్ సెల్యూట్ చేయగా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సిక్కు సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మన్మోహన్ చితికి ఆయన పెద్ద కూతురు ఉపిందర్ సింగ్ నిప్పు పెట్టారు. భార్య గురుశరణ్ కౌర్, మరో ఇద్దరు కూతుళ్లు హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర సాగింది. 

నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫుల్ కూడా మన్మోహన్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. 

దారి పొడవునా నినాదాలు... 

మన్మోహన్ పార్థివ దేహాన్ని మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని తన ఇంటి నుంచి శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ కు తీసుకొచ్చారు. ఆయనకు నివాళులర్పించేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ చీఫ్   ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు నివాళులర్పించారు. గంట పాటు మన్మోహన్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ఆఫీసులో ఉంచారు. 

అనంతరం జాతీయ జెండా కప్పి ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన ఆర్మీ ట్రక్కులోకి ఎక్కించారు. ఉదయం 10 గంటలకు  అంతిమ యాత్ర మొదలైంది. దారి వెంట ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే’  అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 11:30 గంటలకు అంతిమయాత్ర నిగమ్ బోధ్ ఘాట్ కు చేరుకోగా, అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. 

తరలివచ్చిన నేతలు..  

మన్మోహన్ అంత్యక్రియలకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు తరలివచ్చారు. పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు హాజరయ్యారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు, ఢిల్లీ సీఎం అతిశీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మాజీ సీఎంలు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా తదితరులు హాజరై నివాళులర్పించారు.  

తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు తదితరులు హాజరయ్యారు. 

భూటాన్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక ప్రార్థనలు..మారిషస్ లో జెండా అవనతం.. 

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ మృతి పట్ల ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. శనివారం నిగంబోధ్ ఘాట్‌‌‌‌‌‌‌‌ వద్ద మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అంత్యక్రియలు జరిగాయి. దీనికి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌‌‌‌‌‌‌‌గేల్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ హాజరయ్యారు. అంతేగాక,  మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌  ఆత్మకు శాంతి చేకూరాలని భూటాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. తాషిచోడ్‌‌‌‌‌‌‌‌జోంగ్‌‌‌‌‌‌‌‌లోని థింపూస్ కున్రేలో  బౌద్ధ ఆశ్రమంలో వెయ్యి వెన్న దీపాలు వెలిగించింది. ఈ ప్రార్థనలో ప్రధాని షెరింగ్ టోబ్‌‌‌‌‌‌‌‌గే, భారత రాయబారి సుధాకర్ దలేలా, పలువురు రాజకుటుంబ సభ్యులు, భూటాన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ కు సంతాప సూచికగా భూటాన్‌‌‌‌‌‌‌‌లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాల వద్ద, విదేశాలలోని భూటాన్ కాన్సులేట్ల వద్ద భూటాన్ జెండాను సగం వరకు అవనతం చేసింది. కాగా, మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ కు సంతాపం సూచికగా ద్వీప దేశం మారిషస్‌‌‌‌‌‌‌‌ కూడా జెండా అవనతం చేసింది. శనివారం సూర్యుడు అస్తమించేదాకా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల వద్ద జాతీయ జెండాను సగం వరకే ఎగురవేసింది. జెండాలను అవనతం చేయాలని దేశంలోని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌‌‌‌‌‌‌‌గూలం కార్యాలయం కోరింది. అంతేగాక.. మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫుల్ ఢిల్లీ వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ పార్థీవదేహానికి  నివాళి అర్పించారు. కాగా..మన్మోహన్ సింగ్ మృతి పట్ల సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కూడా శనివారం తన సంతాపాన్ని తెలియజేశారు.   

పాడె మోసిన రాహుల్.. 

మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర వాహనంలోనే రాహుల్ గాంధీ కూర్చున్నారు. ఆయన మన్మోహన్ కుటుంబసభ్యుల వెన్నంటే ఉన్నారు. అంతిమయాత్ర నిగమ్ బోధ్ ఘాట్ కు చేరుకున్న తర్వాత.. మన్మోహన్ పార్థివదేహాన్ని చితి వరకు తీసుకెళ్లేటప్పుడు రాహుల్ గాంధీ పాడె మోశారు.