సీపీఎస్ రద్దు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : పూల రవీందర్

  • టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి  పూల రవీందర్

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండగా మారిన సీపీఎస్ విధానం రద్దు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్ల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ స్పష్టం చేశారు. సీపీఎస్ ను రద్దు చేపించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేపించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్టలోని మున్నూరుకాపు సత్రం భవనంలో 'టీచర్స్ ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జాక్టో)' ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ గత టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వంతో కొట్లాడి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో నెలకొని ఉన్న అడ్డంకులను తొలగింపజేశానని చెప్పారు. కేజీబీవీ టీచర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే సీఆర్టీ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ అమలు కోసం కృషి చేస్తానని, అవసరమైతే దీక్ష చేయడానికి సైతం వెనుకాడబోనని స్పష్టం చేశారు.

 సమావేశంలో జాక్టో చైర్మన్ సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్ కృష్ణుడు, పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎండీ అబ్దుల్లా, ట్రెజరర్ హేమచంద్రుడు, ఎస్సీ ఎస్టీ యూనియన్ జనరల్ సెక్రటరీ దానయ్య, టీపీటీయూ స్టేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, జాక్టో కో–చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.