వరి కొయ్యలకు నిప్పుతో.. పెరుగుతున్న పొల్యూషన్​

  • ఊపిరితిత్తుల సమస్యతో సతమతం
  • నశిస్తున్న సూక్ష్మజీవులు, పోషకాలు
  • భూసారానికి ముప్పు వాటిల్లుతుందంటున్న అగ్రికల్చర్  ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు: వరి కొయ్యలను రైతులు కాల్చడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. వాయుకాలుష్యం ఏర్పడి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. పొగతో ఊపిరి ఆడక రైతులు చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బ తిని, భూసారానికి ముప్పుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. పైగా పంటలకు ఉపయోగపడే సూక్ష్మ క్రిములు నశించి పోతున్నాయి. 

వానాకాలం సీజన్  కోతలు​ముగిసిపోవడంతో యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్​లో యాదాద్రి జిల్లాలో 2.98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. సాగులో భాగంగా మడికట్లలో వరి కొయ్యలు మురిగిపోయేందుకు కొందరు రైతులు ఎస్ఎస్పీ వాడుతుంటే.. మరికొందరు వాటిని కాల్చి వేస్తున్నారు. ఇలా వరి కొయ్యలను కాల్చి వేయడం మంచిది కాదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో లాభం కంటే నష్టాలే ఎక్కువని అంటున్నారు. 

అన్నీ నష్టాలే..

వరి కొయ్యలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ కొయ్యలు కాల్చిన సమయంలో వచ్చిన పొగతో రైతులకు ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యం కలుగుతుంది. పొగ కారణంగా ఊపిరి ఆడకుండా రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవలే సిద్దిపేట జిల్లా కోహెడలో ఊపిరి ఆడక ఒక రైతు చనిపోయాడు. అంతే కాకుండా ఈ వేడి కారణంగా పొలాల్లో వేసుకున్న పైపులైన్లు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. అలాగే పంట దిగుబడిపై కూడా ప్రభావం చూపుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంటున్నారు. 

నేలలోని నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయని, భవిష్యత్​లో పండించే  పంటలకు ఇవి అందుబాటులో ఉండవని పేర్కొంటున్నారు. మట్టిలోని సూక్ష్మ జీవులు నాశనమై భూమి సమతుల్యం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేలలో తేమ శాతం తగ్గిపోయి, నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ALSO READ : పది గ్రాముల పిట్ట పచ్చాకుల జిత్త.. రష్యా నుంచి చెన్నూరుకు వలసొచ్చిన బుజ్జి పక్షి

దున్నితేనే లాభాలు..

వరి కొయ్యలను కాల్చకుండా కలియ దున్నితేనే నేలలో పోషకాలతో పాటు సేంద్రియ కర్బన శాతం పెరిగి నేలలో సారం మరింత పెరుగుతుంది. వరి కొయ్యలను కుళ్లిపోయేలా చేస్తే పంటలకు సేంద్రీయ ఎరువుగా పని చేస్తుంది. ఇందుకోసం ఎకరం పొలానికి 150 కిలోల సింగిల్‌  సూపర్‌  ఫాస్పేట్‌(ఎస్ఎస్పీ)ను ఎకరం పొలంలో చల్లి కలియ దున్నితే తొందరగా కొయ్యలు మురిగి నేల సారవంతమవుతుంది. వరి గడ్డిని సేకరించి, ముడి పదార్థంగా చేసుకొని కంపోస్ట్‌ పద్ధతిలో సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. వరి కొయ్యల వంటి పంటల అవశేషాలతో నేలలో సారం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. 

భూసారం దెబ్బతింటుంది..


వరి కొయ్యలను పొలంలోనే మురిగిపోయేలా చేస్తే పంటలకు లాభం. కొయ్యలను కాల్చేస్తే భూసారం తగ్గిపోతుంది. పంటలకు ఉపయోపడే ఎర్రలు, అనేక సూక్ష్మ జీవులు నశించిపోతాయి. నేలలో తేమ శాతం తగ్గి, గట్టిగా మారుతుంది. 


- గోపాల్, డీఏవో, యాదాద్రి-