కామారెడ్డిలో పెరిగిన పోలింగ్

  •     ఓటు వేసేందుకు ఆసక్తి చూపిన యూత్​, వృద్ధులు

కామారెడ్డి, కామారెడ్డి టౌన్​,  వెలుగు :  పార్లమెంట్​ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో అనూహ్యంగా పోలింగ్​ శాతం పెరిగింది. పోలింగ్​ ప్రారంభమైన ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉదయం 11గంటల వరకే 30 శాతానికి పైగా పోలింగ్​ నమోదు అయ్యింది.   యూత్​, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి ఈ సారి ఆసక్తి కనబర్చారు.

గతంలో కంటే ఈసారి యూత్​ ఓటర్లు బూత్​ ల వద్ద ఎక్కువ సంఖ్యలో కన్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు జుక్కల్​ నియోజకవర్గంలో 72.91శాతం, ఎల్లారెడ్డిలో 74.74శాతం, కామారెడ్డి నియోజకవర్గంలో 67.79శాతం, బాన్సువాడలో 73.99శాతం ఓటింగ్​ నమోదైంది. 

ఈవీఎంల మొరాయింపు..

మద్నూర్​ మండల కేంద్రంలోని 3వ వార్డులో పోలింగ్​ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు మొరాయించాయి. 20 నిమిషాల పాటు పోలింగ్​ నిలిచిపోయింది. ఆఫీసర్లు అక్కడకు చేరుకొని ఈవీఎంలను సరిచేసి, తిరిగి పోలింగ్​ ప్రారంభించారు. బాన్సువాడలోని 240 నంబర్​ గల పోలింగ్​ బూత్​ లో కూడ వీవీ ఫ్యాట్​ మిషన్​ మొరాయించింది. అధికారులు సరి చేసిన తర్వాత తిరిగి పోలింగ్​ మొదలు పెట్టారు.

వాగ్వివాదాలు....

దోమకొండ మండలం ముత్యంపేటలో  పోలీస్​ ఆఫీసర్లకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ బీజేపీ కార్యకర్తను ఎస్‌ఐ లాఠీతో కొట్టడంతో అక్కడి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌ల సమీపంలో ఉండటంతో తాము ఇక్కడి నుంచి వారికి వెళ్లామని చెప్పామని పోలీసులు తెలిపారు. కొట్టారంటూ స్థానికులు ఆందోళన చేయడంతో ఆఫీసర్లు నచ్చజెప్పి స్థానికులను శాంతింపజేశారు. లింగంపేట్​ మండలంలో బీజేపీ, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య ఆదివారం అర్ధరాత్రి గొడవ జరిగింది.  బీజేపీ లీడర్‌‌కు చెందిన కారు ధ్వంసమైంది.