బాలికల హాస్టల్​లో నగ్న పూజల కలకలం

  • కనక వర్షం కురుస్తుందని బాలికను నమ్మించిన వంట చేసే మహిళ
  • యువకుడితో కలిసి వీడియో రికార్డ్
  • భయంతో బంధువుల ఇంటికెళ్లిపోయిన బాలిక
  • సిబ్బందిని నిలదీసిన స్టూడెంట్​ పేరెంట్స్​
  • పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఘటన

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల హాస్టల్​లో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్​లో పనిచేసే వంట మహిళ.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ పదో తరగతి బాలికకు మాయ మాటలు చెప్పింది. ఓ యువకుడిని హాస్టల్​కు పిలిపించుకుని వీడియోలు తీయించింది. దీంతో సదరు విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. హాస్టల్​లో ఉండేందుకు నిరాకరిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా.. నగ్న పూజల ఘటన వెలుగులోకొచ్చింది.

హాస్టల్​కు చేరుకున్న బాలిక తల్లి.. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించింది. ‘‘నా కూతురు పదో తరగతి చదువుతూ హాస్టల్​లో ఉంటున్నది. ఈ నెల 18వ తేదీన రాత్రి.. ఊరి నుంచి పిన్ని వచ్చిందని చెప్పి.. నా కూతుర్ని వంట చేసే మహిళ తన గదిలోకి తీసుకెళ్లింది. తలుపులు, కిటికీలు పెట్టేసింది. నగ్నంగా పూజలు చేస్తే లక్ష్మి దేవి కనకరించి డబ్బుల వర్షం కురిపిస్తుందని నమ్మించింది. మా పేదరికాన్ని ఆసరా చేసుకుని నా కూతురికి మాయ మాటలు చెప్పింది. తర్వాత ఒకతనికి ఫోన్ చేసి హాస్టల్​కు పిలిపించుకున్నది.

నా కూతురు వద్దని చెప్పినా వంట చేసే మహిళ వినిపించుకోలేదు. గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి.. వీడియో కాల్ చేసి నా కూతురు కాళ్ల నుంచి తల వరకు ఎవరికో చూపించిండు’’అని బాలిక తల్లి తెలిపింది. మరుసటి రోజే తన కూతురు లీవ్ లెటర్ ఇచ్చి.. హాస్టల్ వదిలేసి మంథని పట్టణంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయిందని చెప్పింది. ‘‘హాస్టల్​లో ఉండాలని నా బిడ్డకు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నువ్వు వచ్చాకే హాస్టల్​కు వెళ్తానని మారం చేసింది. ఏమైందో అర్థం కాలే.. 25వ తేదీన నేను హాస్టల్​కు వచ్చి ఆరా తీస్తే నగ్న పూజల విషయం తెలిసింది. హాస్టల్​లో ఉండాలంటేనే నా బిడ్డ భయపడ్తున్నది’’అని బాధిత బాలిక తల్లి వివరించింది.

పరారీలో వంట మనిషి చేసే మహిళ 

నగ్న పూజలకు యత్నించిన ఘటనపై పెద్దపల్లి ఎస్సీ డెవలప్​మెంట్ ఆఫీసర్ నాగుళేశ్వర్ మంగళవారం హాస్టల్​కు చేరుకుని సిబ్బందిని విచారించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ఈ నెల 18న పదో తరగతి చదువుతున్న బాలికను హాస్టల్​లో వంట చేసే మహిళ తన రూమ్​కు తీసుకెళ్లింది. బాలికతో మాట్లాడుతూ.. నరేశ్ అనే యువకుడికి రూమ్​కు పిలిపించుకున్నది. నరేశ్.. వీడియో తీస్తుండగా బాలిక అడ్డుకున్నది. అయినప్పటికీ వీడియోలు తీసుకుని అతను వెళ్లిపోయాడు. తర్వాత బాలిక తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

ఈ నెల 25వ తేదీన బాలికను ఆమె తల్లి హాస్టల్​కు తీసుకొచ్చింది. జరిగిన విషయం మొత్తం బాలిక చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాలికతో పాటు ఆమె తల్లిని పోలీసులు విచారించారు. రాత్రి కావడంతో వంట చేసే మహిళను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లలేదు. నిందితుడు నరేశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. వంట చేసే మహిళ పరారీలో ఉంది. ఆమెను విధుల నుంచి తప్పించేశాం. హాస్టల్ సిబ్బంది మొత్తాన్ని మార్చాలని కలెక్టర్ ఆదేశించారు’’అని నాగుళేశ్వర్​తెలిపారు. 

ఘటనపై ఎంపీ వంశీకృష్ణ ఆరా

మంథని బాలికల హాస్టల్​లో నగ్న పూజలకు సంబంధించిన ఘటనపై పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంగళవారం ఆరా తీశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఆయన.. రామగుండం సీపీ శ్రీనివాస్​తో ఫోన్​లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సీరియస్​గా విచారణ జరపాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు.