ఆస్తి కోసం ఎంతకు తెగించారు..చనిపోయి మూడురోజులైనా..అంత్యక్రియలు నిర్వహించని కొడుకులు

  • భూమి కోసం తండ్రి శవం ముందే కొడుకుల కొట్లాట
  • చనిపోయి మూడురోజులైనా అంత్యక్రియలు చేయని వైనం
  • పోలీసులు, గ్రామ పెద్దల జోక్యంతో ముగిసిన దహనసంస్కారాలు
  • యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపురంలో దారుణం

మోత్కూరు, వెలుగు: ‘తండ్రి చనిపోయి మూడు రోజులైంది.. అంత్యక్రియలు చేయాల్సిన ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం తండ్రి శవం ముందే కొట్లాటకు దిగారు. 12 ఎకరాల భూమిని పంచుకున్న వారు.. మరో ఎకరం కోసం పట్టుబట్టారు. భూమి పంచాయితీ తేలే వరకు అంత్యక్రియలు చేయబోమంటూ మొండికేశారు.. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని అగ్రిమెంట్‌‌ రాయించడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు’. 

ఈ దారుణ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని సదర్శాపురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది. సదర్శాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (65), లింగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు నరేశ్‌‌, సురేశ్‌‌ కాగా, ఇద్దరు కూతుళ్లు శోభ, సోని ఉన్నారు. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. బాలయ్య పేరున ఉన్న 12 ఎకరాలను నెల రోజుల క్రితమే నరేశ్‌‌, సురేశ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ చేయించుకున్నారు. 

పెరాలిసిస్‌‌తో కొన్నాళ్లుగా మంచాన పడ్డ బాలయ్య గురువారం చనిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఎకరం భూమి పంచాయితీ తెరమీదకు వచ్చింది. మృతుడు బాలయ్య భార్య లింగమ్మ, ఆమె అన్న రాములు కలిసి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో గతంలో మూడు ఎకరాల భూమి కొన్నారు. ఇందులో అర ఎకరం భూమిని గతంలోనే అమ్ముకోగా, మిగిలిన దాంట్లో 1.10 ఎకరాలను రాములు.. లింగమ్మ పెద్ద కొడుకు నరేశ్‌‌ భార్య, తన కూతురైన అరుణ పేరున పట్టా చేశాడు. 

దీంతో ఆ భూమిలో తనకు వాటా వస్తుందంటూ చిన్న కొడుకు సురేశ్‌‌ పట్టుబట్టాడు. దీంతో అన్నదమ్ముల మధ్య పంచాయితీ మొదలైంది. ఈ క్రమంలో భూమి విషయం తేలే వరకు తండ్రి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టారు. అంత్యక్రియలు పూర్తయ్యాక భూమి విషయం మాట్లాడుదామని బంధువులు ఎంత చెప్పినా ససేమిరా అన్నారు. విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, మోత్కూరు ఎస్సై నాగరాజుతో పాటు మోత్కూరు, అడ్డగూడూరు పోలీసులు శనివారం గ్రామానికి వచ్చారు. 

సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగరాజు కలిసి బాలయ్య కొడుకులు, కోడళ్లతో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేయాలని, లేదంటే గ్రామ పంచాయతీ సిబ్బందితో చేయిస్తామని హెచ్చరించారు. పోలీసులు గ్రామ పెద్దలతో మాట్లాడి అరుణ పేరున ఉన్న భూమిని లింగమ్మ పేరున పట్టా చేసేలా అగ్రిమెంట్‌‌ రాయించడంతో శనివారం సాయంత్రం బాలయ్య అంతక్రియలు పూర్తి చేశారు. ఎకరం భూమి కోసం మూడు రోజులుగా తండ్రి అంత్యక్రియలు ఆపడం చర్చనీయాంశమైంది.