కరీంనగర్ జిల్లాలో ఎడతెగని వానజల్లు

  •      కరీంనగర్​లో శనివారం రాత్రి ఈదురు గాలులు 
  •     గ్రామాల్లో నిండుకున్న వాగులు 
  •     కొట్టుకుపోతున్న తాత్కాలికరోడ్లు

వెలుగు, నెట్​వర్క్ ​: ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో ఆదివారం ముసురు ఎడతెగలేదు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కురిసిన ముసురుకు, శనివారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండుకుంది. ఆయా చోట్ల రోడ్లు బురదమయం అయ్యాయి. వానల్లేక ఎండిపోతున్న జొన్న, పత్తి, ఇతర పంటలకు ఈ జల్లులు ఆసరా అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. శనివారం రాత్రి మాత్రం కరీంనగర్​ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో వర్షం హోరెత్తించింది. లోయర్ , మిడ్​ మానేరు డ్యామ్​లోకి వరద చేరుతోంది.

జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ లోని జలపాతానికి జలకళవచ్చింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శిస్తున్నారు. జిల్లాలో శనివారం రాత్రి 52.5మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గంగాధర, హుజురాబాద్ మండలాల్లో 78.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత రామడుగు మండలంలో 76.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. బోయినిపల్లిలోని గంజి వాగు బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో బోయినిపల్లి, వేములవాడ ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు రహదారిపై నుంచి వరద పోటెత్తడంతో వేములవాడ రూరల్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రాకపోకలను నిలిపివేసి భద్రత చర్యలను చేపట్టారు. నక్క వాగువద్ద తాత్కాలిక రోడ్డు వరదలో కొట్టుకుపోయింది.