ఆర్మూర్ మున్సిపల్ ​పీఠంపై ఉత్కంఠ

  •     21న​చైర్ పర్సన్ ఎన్నిక
  •     పదవి కోసం ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ
  •     క్యాంపునకు తరలిన కాంగ్రెస్​కౌన్సిలర్లు

ఆర్మూర్, వెలుగు : మెజార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో ఆర్మూర్​ మున్సిపాలిటీ  హస్తగతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21న ​చైర్ పర్సన్ పదవి కోసం ఎన్నిక నిర్వహించనున్నారు. బీఆర్​ఎస్​ నుంచి ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఇద్దరు లీడర్లు ​చైర్​పర్సన్ పదవిని ఆశిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

మొదటి నుంచీ మలుపులే..

అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యే జీవన్ ​రెడ్డి ఓటమి చెందారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ పండిత్​ వినీతపై గుర్రుగా ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్లు ఇదే అదునుగా భావించి ఆమెపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌన్సిలర్లను రెండుసార్లు హైదరాబాద్ కు పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఆయన సూచనతోనే 24 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్​కు అవిశ్వాస నోటీసు అందించారు. జనవరి 4న జరిగిన ప్రత్యేక సమావేశంలో 24 మంది కౌన్సిలర్లు హాజరై తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు.

జీవన్ రెడ్డి సపోర్ట్​ తోనే కౌన్సిలర్లు తమపై అవిశ్వాసం పెట్టారని ఆవేదన చెందిన చైర్ పర్సన్ వినీత, ఆమె వర్గీయులు బీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అవిశ్వాస మీటింగ్​ జరిగిందని పండిత్ వినీత కోర్టును ఆశ్రయించారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందంటూ ఆమె ఫిబ్రవరి 5న మున్సిపాలిటీకి వచ్చి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొన్నిరోజులకే పండిత్​ వినీతపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. వైస్​చైర్మన్​గా ఉన్న షేక్​మున్నుకు ఇన్​చార్జ్​ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలకు ముందే ​వైస్ ​చైర్మన్ షేక్​ మున్నుతో  కలిసి16 మంది కౌన్సిలర్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి వినయ్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. 

ఆ ఇద్దరిలో కుర్చీ దక్కేదెవరికో..

మున్సిపల్​ పీఠం బీసీ మహిళకు రిజర్వ్​ అవడంతో 23వ వార్డు కౌన్సిలర్​ వన్నెల్​దేవి లావణ్య, 2వ వార్డు కౌన్సిలర్ ​ఖాందేశ్ సంగీత చైర్​పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. వీరు బీఆర్ఎస్​ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేశారనే చర్చ జరుగుతోంది. కాగా చైర్​పర్సన్ సీటు ఆశిస్తున్న వీరు దాదాపు 20 మంది కౌన్సిలర్లతో కలిసి శనివారం గోవా క్యాంపునకు తరలివెళ్లారు.