ఆస్పత్రి బెడ్‎పై ఇంటిపెద్ద.. దీనస్థితిలో నిరుపేద కుటుంబం ఎదురుచూపు

కోనరావుపేట,వెలుగు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పెద్ద దిక్కు కిడ్నీలు చెడిపోగా దవాఖానాలో మంచపట్టాడు. కిడ్నీల మార్పిడి చేస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన కదిరె మహేందర్ ఉపాధి కోసం కొన్నేండ్ల కింద గల్ఫ్ వెళ్లాడు. అక్కడ ఆరోగ్యం సరిగా లేక వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇంటికి తిరిగొచ్చాడు. 

ఈ క్రమంలో  మహేందర్‌‌‌‌ కాళ్లు వాపులు రావడంతో హైదరాబాద్ లోని ఓ దవాఖానాకు వెళ్లాడు. డాక్టర్లు టెస్ట్ లు చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని, వెంటనే మార్పిడి చేయాలని తేల్చిచెప్పారు. ఇందుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో దాతలెవరైనా  ఆదుకుని సాయం అందించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. సాయం చేయాలనుకునేవారు  7794982178 గూగుల్, ఫోన్ పే లేదా.. ఎస్ బీఐ అకౌంట్ : 20331884274 , వేములవాడ బ్రాంచ్ నందు అందించాలని కోరుతున్నారు.