మహిళా సంఘాలకు 4 నెలల్లో 5 వేల కోట్ల లోన్లు

  • ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 1 వరకు మంజూరు
  • ఈ ఏడాది 3.60 లక్షల మందికి రూ. 20 వేల కోట్ల లోన్లు టార్గెట్ 
  • ఇప్పటివరకు లక్షన్నర మంది ఎంపిక 
  • ట్రైనింగ్ ఇస్తున్న నిథమ్, నిఫ్ట్, రెడ్డీస్ ఫౌండేషన్ 
  • వచ్చే నెల నుంచే బిజినెస్ స్టార్ట్

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాలకు వచ్చే ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల లోన్లు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా లోన్ల మంజూరు శర వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఫైనాన్సియల్ ఇయర్​లో 3.60 లక్షల మందికి  రూ.20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్1 వరకు నాలుగు నెలల్లోనే మహిళా సంఘాలకు రూ.5,500 కోట్లు లోన్లు ఇచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే జనవరి కల్లా ఈ లోన్ల టార్గెట్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

వీటితో బ్యాంకింగ్ సేవలు లేని గ్రామాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖి, ఇతర వ్యాపారాలతో మూడు దశల్లో మహిళా సంఘాలు నిలదొక్కుకునేలా సెర్ప్ అధికారులు పని చేస్తున్నారు. రాష్ర్టంలో మహిళా సంఘాల లోన్ రీపేమెంట్ శాతం 90కిపైనే ఉండటం, ప్రభుత్వ సహకారం కూడా ఉండటంతో బ్యాంకులు మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.  

బిజినెస్​కు ఫుల్ రెస్పాన్స్

మహిళా సంఘాలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ర్టంలో మహిళా సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులు ఉండగా దశల వారీగా వ్యాపారాలు స్థాపించేలా అధికారులు ప్రొత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ ఇస్తున్నారు. తొలి దశలో ఈ ఏడాదిలో 3.60 లక్షల మందికి రూ. లక్షకు పైగా చొప్పున లోన్లు ఇచ్చి వ్యాపారాలను స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. 

ఇందులో లక్షన్నర మంది అర్హత సాధించగా.. ఇప్పటికే 9 వేల మంది రూ. 100 కోట్లకు పైగా లోన్లు పొందటంతోపాటు వ్యాపారాలు స్టార్ట్ చేశారు. వీటిలో ఎంబ్రాయిడరీ వర్క్, డెయిరీ, బ్యూటీ పార్లర్, పిండిమిల్లులు, టైలరింగ్, చిన్న హోటళ్లు వంటివి ఉన్నాయి. మహిళా సంఘాలు వ్యాపారాలకు కొత్త కావటంతో వీరికి అధికారులు ట్రైనింగ్ పోగ్రాంలు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథమ్), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంస్థలు వీరికి ట్రైనింగ్ ఇస్తున్నాయి.   

బ్యాంకింగ్​లో 750 మందికి అర్హత 

బ్యాంకులు లేని గ్రామాల్లో ప్రత్యేకంగా బ్యాంకింగ్ కరస్పాండెన్స్ సఖి (బీసీసీ)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి బాధ్యత కూడా మహిళా సంఘాలకే అప్పగించారు. ఇందులో ట్రైన్, ఫ్లైట్ టికెట్ల బుకింగ్, మీసేవ కార్యకలాపాల వంటివి జరుగుతున్నాయి. మహిళా సంఘాల సభ్యుల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారికి ఐఐబీఎఫ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్) 750 మందికి అర్హత పరీక్ష నిర్వహించగా అందరూ క్వాలిఫై అయ్యారు. వీరి ఆధ్వర్యంలో బీసీసీలు పని చేస్తున్నాయి.  మరో 300 మందికి కూడా త్వరలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

లక్ష కోట్ల ఆర్థిక సహకారం

మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారంతో వచ్చే 5 ఏండ్లలో బ్యాంకులు, స్ర్తీనిధి ద్వారా రూ. లక్ష కోట్ల రుణాలను అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఇందులో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో ఏటా 5 వేల గ్రామ సంఘాలకు రూ. కోటి చొప్పున రూ.5 వేల కోట్ల లోన్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంచేలా.. వివిధ రకాల ట్రేడ్ ఎగ్జిబిషన్లలో పాల్గొనేలా ప్రొత్సహించటం వంటివి చేయనున్నారు. 

3 రంగాలు ఎంపిక

ప్రొడక్షన్ సెక్టార్ లో భాగంగా పౌల్ట్రీ, పాడి పశువులు, డెయిరీ యూనిట్లు, ఫిషరీస్, చేనేత వస్ర్తాలు, హస్తకళలు, యూనిఫాంలు కుట్టడం వంటి వాటిని ప్రభుత్వం ప్రొత్సహించనుంది. ఇటీవల సర్కారు విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను సంఘాలకు అప్పగించగా వచ్చే ఏడాది నుంచి మరిన్ని బాధ్యతలు ఇవ్వనున్నారు. ట్రేడింగ్ లో మినీ సోలార్ యూనిట్లు, మినీ సూపర్ మార్కెట్లు, జెనరిక్ మెడికల్ షాపులు, విత్తనాలు, ఎరువుల షాపుల వంటివి ఏర్పాటు చేయించనున్నారు. అలాగే సేవల విభాగంలో క్యాటరింగ్, బ్యూటీ పార్లర్లు, హెల్త్ కేర్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి బాధ్యతలు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇవీ వ్యాపారాలు 

బ్రాండింగ్, ప్యాకేజింగ్ వంటి అంశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నా గత ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవటంతో మార్కెట్​లో పోటీకి తట్టుకొని మహిళా సంఘాలు నిలబడలేకపోయాయి. రాష్ట్రంలో 1,050 మీసేవ, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. వీటిని మహిళా సంఘాలకు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళలతో చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను ఎంకరేజ్ చేసి ఆర్థిక స్వావలంబనకు సహకరించటం, సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయటమే మహిళా శక్తి ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.