హైదరాబాద్ సిటీలో..గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నయ్

  • మత్తులో ఎవరిపై పడితే వారిపై దాడులు 
  • ఐదు రోజుల కింద రాజేంద్రనగర్​లో వాకర్స్​పై అటాక్​  
  • అదే రోజు జీడిమెట్లలో మర్డర్​
  • నెల రోజుల్లో మూడు ఘటనలు

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్‌‌‌‌లో గంజాయి బ్యాచ్‌‌‌‌లు రెచ్చిపోతున్నాయి. ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో నడిరోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు.  అడ్డొచ్చిన వారిని విచక్షణారహితంగా కొడుతున్నారు. ఇలాంటి ఘటనలు సిటీలో రోజూ ఏదో ఒక చోట జరుగుతున్నాయి. ముఖ్యంగా బస్తీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గుప్పు గుప్పున గంజాయి సిగరెట్లు తాగుతూ వదులుతుండడం, హాష్​ఆయిల్​తీసుకుని మత్తులో తూలుతుండడంతో తిరగడానికి జనాలు భయపడుతున్నారు.  

కుటీర పరిశ్రమగా మారిన గాంజా 

రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను పూర్తిగా కట్టడి చేయడంతో ఆ వ్యాపారం చేసినవాళ్లలో ఎక్కువ మంది గంజాయి బిజినెస్​వైపు మళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడుతున్న వారిలో వీరి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఎన్నిసార్లు పట్టుబడినా జైలుకు వెళ్తున్నారు కానీ, గంజాయి దందా మాత్రం వదలడం లేదు.  ముఖ్యంగా నగరంలోని ధూల్‌‌‌‌పేట, మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌, ఫలక్‌‌‌‌నుమా, ఉప్పుగూడ, పురాణాపూల్, జియాగూడ , రాజేంద్రనగర్, అత్తాపూర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడ,  సికింద్రాబాద్, నాంపల్లి సహా పలు ఏరియాల్లో గంజాయి దందా ఎక్కువగా సాగుతోంది. 

సిటీ సెంటర్​గా.. 

వైజాగ్‌‌‌‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, బెంగళూర్‌‌‌‌‌‌‌‌కు తరలించే గాంజాకు హైదరాబాద్​నే సెంటర్​గా చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజధాని మీదుగా ప్రతి ఏటా దాదాపు 20 టన్నులకు పైగా గంజాయిని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందులో 2 టన్నుల వరకు గ్రేటర్‌‌‌‌ ‌‌‌‌హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమ్ముతున్నారు. అలాగే ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సిటీకి గంజాయి ట్రాన్స్​పోర్ట్​చేస్తున్నారు. మధ్యలో అక్కడక్కడా పట్టుబడుతున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. 

క్వాలిటీని బట్టి రూ.100కు 10 గ్రాములు 

సిటీలోని బ్రోకర్ల వద్దకు వచ్చిన గంజాయిని కొంటున్న వ్యాపారులు చిన్న చిన్న కవర్స్‌‌‌‌లో ప్యాక్ చేసి 10 గ్రాములకు క్వాలిటీని బట్టి రూ.100 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. వీటిని గ్రేటర్‌‌‌‌‌‌‌‌లోని అన్ని ప్రాంతాల్లోని రెగ్యులర్ కస్టమర్లకు చైన్ సిస్టమ్‌‌‌‌తో సప్లయ్ చేస్తున్నారు. ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు, రైల్వేస్టేషన్స్‌‌‌‌, బస్‌‌‌‌స్టేషన్స్‌‌‌‌ వద్ద షెల్టర్‌‌‌‌ ‌‌‌‌తీసుకునే వారిని కూడా వదలడం లేదు. హుస్సేన్‌‌‌‌సాగర్ పరిసర ప్రాంతాలు, సిటీలోని పార్కులకు సమీపంలోను గంజాయి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకుంటున్నారు.  

యూత్ టార్గెట్​గా దందా

సిగరెట్లు, లిక్కర్‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడిన వారే గంజాయికి బానిసలవుతున్నారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. పలు వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర ఎడ్యుకేషన్​ఇన్​స్టిట్యూషన్స్​తోపాటు హైస్కూల్​ విద్యార్థులు కూడా దీని మత్తులో తూగుతున్నారు. ఐటీ ఎంప్లాయీస్‌‌‌‌ కూడా గాంజా వలలో చిక్కుకుంటున్నారు. ఇక బస్తీల సంగతి అయితే చెప్పక్కరలేదు. ఎక్కువగా గొడవలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. కొన్ని పాన్​షాపుల్లో డైరెక్ట్​గాంజా సిగరెట్లే అమ్ముతున్నారు.

 ఎక్కువగా దాడులకు తెగబడే వారు గంజాయి మత్తులోనే విచక్షణ కోల్పోయి చేస్తున్నట్టు ఈ మధ్య నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. మరోవైపు హ్యాష్ ఆయిల్‌‌‌‌ ట్రెండ్ కూడా నడుస్తోంది. దీన్ని ఫుడ్​ఐటమ్స్​లో కలుపుకుని తింటుండడంతో ఎవరికీ ఏమీ తెలియదు.  

జీవితం నాశనమే..

గంజాయిని పీల్చుకున్న వెంటనే అందులో ఉండే టీహెచ్‌‌‌‌సీ రక్తంతోపాటు, మెదడుకు చేరుకుంటుంది. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పేలా చేసి విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. అప్పుడు సదరు వ్యక్తి ఏం చేస్తున్నాడో అతడికే తెలియదు.  గంజాయి తీసుకోవడం వల్ల ‘బైపోలార్ డిజార్డర్‌‌‌‌’ కూడా వస్తుంది. ఇది నిరాశ, మానసిక సమస్యలకు కారణమవుతుంది.  క్యాన్సర్‌‌‌‌ ముప్పు కూడా ఎక్కువే.  వృషణ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 

గంజాయి తాగిన తర్వాత దాని నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ కెమికల్​శరీరంలో నెలల పాటు ఉంటుంది. దాని ప్రభావం బాడీలోని అన్ని పార్ట్స్​పై పడుతుంది. గాంజాలోని టెట్రాహైడ్రోకానాబినాల్‌‌‌‌ జుట్టులో మూడు నెలలు, యూరిన్​లో నెల రోజులు, ఉమ్ములో ఒక రోజు, రక్తంలో 12 గంటలు ఉంటుంది.