సాయం చేసిన సింగరేణి ఆఫీసర్.. డబ్బు, నగలు కాజేసిన అక్కాచెల్లెళ్లు ​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇద్దరు అమ్మాయిలను అతిగా నమ్మిన ఓ ఆఫీసర్​ను నిలువునా దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రాయల భవాని, రాయల శ్రీలత అక్కాచెల్లెల్లు. వీరి తండ్రి నాలుగేండ్ల కింద సింగరేణి శ్రీరాంపూర్​ ఏరియాలో రిటైర్డ్ అయ్యాడు. 

బెనిఫిట్స్‌‌ కోసం వీరు సింగరేణిలో పనిచేసే ఓ ఆఫీసర్‌‌‌‌ను కలవగా ఆయన సహకరించాడు. ఆయనతో ఏర్పడిన పరిచయం కొనసాగుతూ వచ్చింది. ఈక్రమంలో వారు ఆఫీసర్‌‌‌‌ ఇంటికి వచ్చి పోతుండేవారు. అక్కాచెల్లెళ్లిద్దరికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు సదరు ఆఫీసర్​డబ్బు సాయం కూడా చేసేవాడు. కాగా, ఆ అధికారి వద్ద డబ్బులు, బంగారం ఉండడాన్ని గమనించిన అక్కాచెల్లెళ్లు ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్‌‌ వేశారు. ఈ విషయాన్ని శ్రీలత తన భర్త వెంకటేశ్వర్లుకు చెప్పింది. ఇటీవల ఆ ఆఫీసర్​ రామగుండం ఏరియాకు బదిలీ కావడంతో దోపిడీకి ప్లాన్‌‌ చేశారు.

రెండు రోజుల కింద గోదావరిఖని జీఎం కాలనీలోని క్వార్టర్స్‌‌లో ఆఫీసర్​ ఒంటరిగా ఉండగా, ముగ్గురు అక్కడికి వచ్చారు. వెంకటేశ్వర్లు ఆఫీసర్​ గొంతుపై కత్తి పెట్టి అమ్మాయితో చెడుగా ప్రవర్తిస్తావా అంటూ 4 సెల్​ఫోన్లు, తొమ్మిది తులాల బంగారు నగలు, ఫోన్​ పే ద్వారా రూ.1.90 లక్షలు ట్రాన్స్​ఫర్​ చేయించుకుని, రూ.20 లక్షల ఖాళీ చెక్​పై సంతకం చేయించుకుని పారిపోయారు. దీంతో ఆఫీసర్​ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు బంగారం, ​ఫోన్లు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

నగలు, సెల్​ఫోన్లు, రూ.83 వేల నగదు రికవరీ చేసి జైలుకు తరలించారు. రాయల వెంకటేశ్వర్లు, శ్రీలతపై గతంలో ఖమ్మం జిల్లా ఖానాపూర్​హవేలీలో బొమ్మ తుపాకీ చూపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసు ఉంది. కేసును ఛేదించిన వన్​టౌన్​ ఇన్ స్పెక్టర్ ​ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్‌‌ఐ ఎన్.సుగుణాకర్, క్రైమ్​టీమ్​సిబ్బంది జి.వెంకటేశ్​, టి.శ్రీనివాస్​ను పెద్దపల్లి డీసీపీ డాక్టర్​ చేతన అభినందించారు.