గోవులతో తొక్కించుకున్న భక్తులు : అక్కడ పూర్వం నుంచి ఇదే సంప్రదాయం

మనదేశంలో గోమాతలను దైవంగా భావిస్తుంటారు భారతీయులు. వాటికి పూజలు చేస్తారు కొందరు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కనుమ పండగ సందర్భంగా పశువులను ప్రత్యేకంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పలు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా గోమాతలను పూజిస్తుంటారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని భిదావత్ గ్రామంలోనూ గోమాతలను భక్తులు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. భక్తులు నేలపై పడుకుని గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని వారి నమ్మకం. 

దీపావళి పండగ తర్వాత రోజు భిదావత్ గ్రామంలో ఉదయం గ్రామస్తులు గోవులకు పూజలు చేశారు. ఆ తర్వాత గోవులను ఒకేచోట ఉంచారు. డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత పురుష భక్తులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. గోవులు.. భక్తులను తొక్కిన తర్వాత భక్తుల లేచి నిలబడి.. డప్పులకు తగ్గట్లు నృత్యం చేశారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో భిదావత్ గ్రామానికి భారీగా తరలివచ్చారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని.. అందుకే నేలపై పడుకుని గోవులతో తొక్కించుటామని పురుష భక్తులు చెబుతున్నారు.

ఇక్కడి భక్తులు దీపావళికి ముందు ఐదు రోజుల నుంచి ఉపవాసం ఉంటారు. దీపావళికి ముందు రోజు రాత్రి వారంతా మాతా భవానీ ఆలయంలో ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తారు. ఆ తర్వాత రోజు నేలపై పడుకుంటే ఆవులు తొక్కుతాయి. అబద్ధం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని వారి నమ్మకం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా గ్రామంలో ఉంది.