భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..

మనసును కట్టిపడేసే ప్రకృతి అందాలు అడవితల్లి ఒడిలో దాగిన ముత్యపు జలపాతం సొంతం. చెక్కినట్టుండే కొండలు, 700 అడుగుల ఎత్తు నుంచి పడే నీటిధార చూస్తుంటే మనసు పులకరించిపోతుంది.

ముత్వపు జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం ఓ అడ్వెంచర్. 

జలపాతం 700 అడుగుల ఎత్తుంటుంది. పై నుంచి సడే తుంపర్ల కింద కాసేపు నిల్చుంటే అలసట చిటికెలో మాయమైపోతుంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తుంటే మనసు తేలికవుతుంది. ప్రకృతికి పచ్చని చీర కట్టినట్లుండే చెట్ల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి తాకగానే స్వర్గంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలోని ఎత్తైన గుట్టలు, ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. 

నాలుగు నెలల క్రితం వరకూ బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి పెద్దగా తెలియదు. ఈ ప్రాంతం చుట్టుపక్కల ఊళ్ల ప్రజలకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం దీని గురించి తెలిసి దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఈ జలపాతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఆది మానవులు నివసించేవాళ్లని కొందరంటారు. 

దీనికి 200 మీటర్ల దూరంలో ఉన్న కాలువ దగ్గర వాళ్లు జీవనం సాగించేవాళ్లట. ఇక్కడ రాతి ఆయుధాలు కూడా దొరికినట్లు చెబుతారు. మరికొందరేమో ఇక్కడ గతంలో మునులు తపస్సు చేసేవాళ్లంటారు. ముత్యపు జలపాతాన్ని గద్దలసరి. జలపాతం అని కూడా అంటారు. గద్దలు ఎగిరేంత ఎత్తు నుంచి నీళ్లు పడతాయిని స్థానికులు ఆ పేరుతో పిలుస్తారు.

ALSO READ : Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!

రూటే.. సెపరేటు ఈ జలపాతానికి వెళ్లాలంటే చిన్నపాటి అచ్వెంచర్ తప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతానికి కార్లు, బస్సుల్లో వెళ్లలేం. వీరభద్రవరం నుంచి జలపాతానికి వెళ్లే దారి ఇరుకుగా ఉంటుంది. రోడ్డు పొడవునా రాళ్లు. గుంతలే కనిపిస్తాయి. ట్రాక్టర్లు, బైక్లపై మాత్రమే వెళ్లాలి. అదికూడా జలపాతం వరకు వెళ్లలేం. ఒక కిలోమీటర్ వరకూ కాలినడకన వెళ్లాలి. 

అక్కడి నుంచి నీళ్లలో సదవాలి. నీళ్లలోని రాళ్లపై అడుగులు వేస్తూ 250 మీటర్లు నడిస్తే ముత్యపు జలపాతాన్ని చేరుకోవచ్చు. జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. పర్యాటక శాఖ చొరవ తీసుకుని రోడ్డు నిర్మించి వసతులు కల్పించాలని ఇక్కడి వాళ్ళు కోరుకుంటున్నారు.

V6 వెలుగు