ఫ్యూచర్​ ప్లానింగ్​ బాగుంది : అర్వింద్‌‌ పనగరియా

  • పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​ పెట్టడం ఇంప్రెస్​ చేసింది
  • 16వ ఆర్థిక సంఘం చైర్మన్​ అర్వింద్​ పనగరియా ప్రశంస
  • జీడీపీలో తెలంగాణ వాటా గణనీయంగా ఉంది
  • సెస్​, సర్​చార్జీల్లో రాష్ట్రాలకు వాటాపై మేం సిఫార్సు చేయలేం
  • ఆ వాటా రావాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రాభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యూచర్​ ప్లానింగ్​ తనను ఇంప్రెస్​ చేసిందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌‌ అర్వింద్‌‌ పనగరియా అన్నారు. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తే.. అంతటా రూరల్​ ఏరియాల అభివృద్ధి పైనే ప్రస్తావించారని, తెలంగాణ ప్రభుత్వం అర్బన్​ డెవలప్​మెంట్​పైన కూడా మంచి విజన్​తో ముందుకు వెళ్తున్నదని ఆయన తెలిపారు.  ప్రజాభవన్‌‌లో మంగళవారం 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్‌‌ నారాయన్‌‌ ఝా, మనోజ్‌‌ పాండా, అన్నె జార్జ్‌‌ మాథ్యూ,  సౌమ్యా కాంతిఘోష్‌‌ తో కలిసి అర్వింద్​ పనగరియా మీడియాతో మాట్లాడారు.

ప్రతి రాష్ట్రం నుంచి ఆదాయ, వ్యయాలు, ఆర్థిక వనరులు, అభివృద్ధి పథకాలు తదితర అన్ని అంశాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక బాగుందని మెచ్చుకున్నారు. ‘‘ప్రధానంగా మనదేశంలో గ్రామీణ అభివృద్ధికి రాష్ట్రాలు ఎక్కువగా ప్రణాళికల్లో ప్రయారిటీ ఇస్తాయి. కానీ తెలంగాణ భవిష్యత్‌‌ ప్రణాళికల్లో అర్బన్‌‌ (పట్టణ) ప్రాంతాల అభివృద్ధికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయం. జీడీపీకి తెలంగాణ నుంచి అందుతున్న వాటా గణనీయంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. 

సర్​చార్జీల్లో వాటా కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి

కేంద్రం పన్నులు కాకుండా విడిగా వసూలుచేస్తున్న సెస్‌‌లు, సర్‌‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫార్సు చేసే అంశం తమ పరిధిలో లేదని అర్వింద్​ పనగరియా స్పష్టం చేశారు. ఈ వాటా రావాలంటే ముందు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది జరగాలంటే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాలని సూచించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను రాష్ట్ర జీఎస్‌‌డీపీని కూడా ప్రామాణికంగా తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ‘‘కేంద్ర పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది.  

కానీ, వాస్తవంగా 31 లేదా 32 శాతమే వస్తున్నదని రాష్ట్రాలు చెప్తున్నాయి. సెస్‌‌లు, సర్‌‌చార్జీల పేరుతో కేంద్రం వసూలు చేస్తున్న సొమ్ముతో కూడా లెక్కలు చూపి చివరికి 31 లేదా 32 శాతం వస్తున్నట్లు రాష్ట్రాలు వివరిస్తున్నాయి. కానీ, గతంలో ఆర్థిక సంఘం కేంద్రం పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ పన్నులనే పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇప్పుడు కూడా 41 శాతం వస్తున్నది. సెస్‌‌లు, సర్‌‌చార్జీల పేరుతో కేంద్రం వసూలు చేస్తున్న సొమ్ములో రాష్ట్రాలకు వాటా 41 శాతం ఇవ్వాలని గతంలో ఆర్థిక సంఘం చెప్పలేదు.

ఇప్పుడు వాటిని కూడా కలిపి చూసి మొత్తం 31 లేదా 32 శాతమే వస్తున్నదంటున్న రాష్ట్రాల వాదనతో ఏకీభవించలేం. అప్పట్లో ఆర్థిక సంఘం చెప్పింది కేంద్ర పన్నుల్లో మాత్రమే 41 శాతం ఇవ్వాలని. సెస్‌‌లు, సర్‌‌చార్జీల పేరుతో వసూలు చేసే సొమ్ము కేంద్రానికి వెళ్లాలని రాజ్యాంగం చెప్తున్నది. దానిలో కూడా రాష్ట్రాలకు వాటా కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటది” అని ఆయన వివరించారు.

సిఫార్సుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటది

ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు తక్కువగా వస్తున్నాయని కర్నాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తమ దృష్టికి తీసుకొచ్చాయని.. ఈ విషయంలో ఏం చేయాలనేది పరిశీలిస్తామని అర్వింద్‌‌ పనగరియా చెప్పారు. గతంలో 15వ ఆర్థిక సంఘం చేసిన కొన్ని సిఫార్సులన్నింటినీ కేంద్రం అమలుచేయనప్పుడు ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులకు విలువ ఉంటుందా అని మీడియా అడగ్గా .. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలి, విపత్తుల నిర్వహణకు సాయం ఎంత, స్థానిక సంస్థలకు ఎంత గ్రాంట్లు ఇవ్వాలి అనే ముఖ్యమైన అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని ఆయన చెప్పారు.

వాటిని కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఇక మిగిలిన కొన్ని సిఫార్సులను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్నేషనల్‌‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని.. వీటికి నిధులు ఇవ్వాలనే అంశాన్ని ఆర్థిక సంఘం పరిశీలిస్తుందా? అని మీడియా అడగ్గా.. ఆర్థిక సంఘం ఏం చేస్తుందనేది ఇప్పుడు చెప్పలేం అని అర్వింద్‌‌ పనగరియా అన్నారు.